మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాలో భారతీయ ట్యాక్సీ డ్రైవర్లపై జరిగిన జాత్యహంకార దాడులకు సంబంధించి ఎనిమిది మంది టీనేజర్లను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. మెల్‌బోర్న్ పశ్చిమ శివారు ప్రాంతంలో ఉదయం నుంచీ పలు దఫాలుగా తనిఖీలు చేపట్టి వీరిని అదుపులోకి తీసుకున్నారు. 14 నుంచి 18 ఏళ్ల మధ్య ఉన్న ఆ ఎనిమిది మందిలో ఒక మహిళ కూడా ఉంది. వీరి వయసు, వారు చేసిన దాడుల స్థాయి చూస్తే దిగ్భ్రాంతి కలిగించేలా ఉన్నాయని పోలీసు సూపరింటెండెంట్ రిక్ నుగెట్ వ్యాఖ్యానించారు. ‘ట్యాక్సీలపైన, వాటి డ్రైవర్లపైన జరిగిన దాడి చాలా హింసాత్మకంగా ఉంది. ఈ వయసు పిల్లలు ఇంత దారుణమైన నేరాలకు పాల్పడడం చాలా ఆందోళనకరం’ అని ఆయన అన్నారు. వీరిలో చాలా మందిని బాలల కోర్టుకు తీసుకెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి వీరు చేసిన దాడుల్లో 5 క్యాబ్‌లు ధ్వంసమయ్యాయన్నారు.
|