NEWS

Blogger Widgets

29.6.12

2017 నాటికి భారత్, రష్యాలే నెంబర్ వన్!


ప్రపంచంలోనే వేగవంతమైన హైపర్‌సోనిక్ క్షిపణిని తయారుచేస్తున్న మిత్రదేశాలు
6/28/2012 11:50:00 PM
మాస్కో: వివిధ రంగాల్లో పరస్పర సహకారంతో చిరకాల మిత్రదేశాలుగా కొనసాగుతున్న భారత్, రష్యాలు క్షిపణి సామర్థ్యంలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలవనున్నాయి.... ధ్వనివేగం కంటే ఐదు నుంచి ఏడు రెట్లు వేగంగా దూసుకెళ్లే హైపర్‌సోనిక్ క్షిపణులను ఈ రెండు దేశాలు సంయుక్తంగా సమకూర్చుకోనున్నాయి. తద్వారా ఇంతటి వేగం గల హైపర్‌సోనిక్ క్షిపణులు కలిగిన మొదటి దేశాలుగా సత్తా చాటనున్నాయి. రెండు దేశాలు చేపట్టిన ‘బ్రహ్మోస్ ఏరోస్పేస్’ ప్రాజెక్టులో భాగంగా తయారుచేస్తున్న ఈ హైపర్‌సోనిక్ బ్రహ్మోస్ క్షిపణులను వచ్చే 2017 నాటికి పరీక్షించనున్నట్లు ఈ మేరకు ప్రాజెక్టు సీఈవో శివథాను పిళ్లై శుక్రవారమిక్కడ వెల్లడించారు. ఈ క్షిపణులు ధ్వనివేగం కంటే 6.5 రెట్లు వేగంతో ప్రయాణించగలవని ఇప్పటివరకు ప్రయోగశాలలో చేపట్టిన పరీక్షల్లో తేలిందన్నారు.

భూ, సముద్ర, గగన తలాల నుంచి ప్రయోగించేలా మూడురకాలుగా దీనిని తయారుచేస్తున్నట్లు తెలిపారు. ఈ మిస్సైళ్లు భారత్, రష్యాల వద్ద మాత్రమే ఉంటాయని, మూడో దేశానికి ఇవ్వబోరన్నారు. కాగా, అమెరికా హైపర్‌సోనిక్ (ధ్వనికంటే ఐదు రెట్లు వేగంగా ప్రయాణించేవి) క్షిపణిని గత ఏడాదే పరీక్షించింది. భూమిపై ఏ చోటికైనా కేవలం గంటలోపే క్షిపణిని ప్రయోగించే సత్తా సమకూరినట్లు ఆ పరీక్ష విజయవంతమయ్యాక ఆ దేశం ప్రకటించింది.