NEWS

Blogger Widgets

29.6.12

నైరుతి ఆవరిస్తేనే భారీ వర్షాలు


6/29/2012 2:27:00 AM
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : ఇప్పటివరకు రాష్ర్టంతో పాటు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లను తాకిన నైరుతి రుతుపవనాలు రానున్న రోజుల్లో పూర్తిస్థాయిలో ఉత్తరాదికి సమీపిస్తేనే భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.... నైరుతి పవనాలు ముఖం చాటేస్తుండడంతో అధికారులు ఎప్పటికప్పుడు వివిధ కోణాల్లో విశ్లేషిస్తున్నారు. ఈ రుతుపవనాలు కేరళను తాకి ఇప్పటికి పాతికరోజులవుతోంది. రాష్ట్రాన్ని తాకి 14 రోజులవుతోంది. అయినా రాయలసీమ, ఉత్తర కోస్తాలకు వర్షాలు లేవు. మిగతా ప్రాంతాల్లో కొన్నాళ్లు వర్షాలు కురిసినా అవన్నీ సాధారణ వర్షపాతంగానే వాతావరణశాఖ గుర్తించింది.

వర్షపాత నమోదు అధికం కావాలంటే ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనాలు/ఉపరితల ఆవర్తనాలు వంటివి ఏర్పడాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నైరుతి మరింత ముందుకు కదిలి ఉత్తరం వైపు వెళ్లాల్సిందేనంటున్నారు. మరోవైపు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తా మీదుగా కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి కాస్త బలహీనపడి ఒడిశా వైపు వెళుతోంది. కొన్నాళ్లుగా అక్కడకక్కడ కురుస్తున్న వర్షాలకు కారణం కూడా ఈ ద్రోణేనని చెబుతున్నారు. జూలై 1 నుంచి వర్షపాత నమోదు శాతం పెరిగే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం డెరైక్టర్ వి.ఎల్. ప్రసాదరావు తెలిపారు. అయితే ఇది సాధారణమేనని, రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని కోస్తా, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.