NEWS

Blogger Widgets

29.6.12

ఫస్ట్ ప్రణబ్.. సెకండ్ సంగ్మా!


న్యూఢిల్లీ, జూన్ 28: మూడు వందల ఆరు గదులతో అత్యంత వైభవోపేతంగా అలరారే రాష్టప్రతి భవన్‌లో అడుగుపెట్టే కొత్త ప్రథమ పౌరుడి ఎంపికకు జరగనున్న ఎన్నికల్లోని తొలి ఘట్టమైన నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది.....
అధికారంలోవున్న యూపీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ, భారతీయ జనత పార్టీ నేతృత్వంలోని చీలిక ఎన్డీయే అభ్యర్థిగా రంగంలో దిగుతున్న లోక్‌సభ మాజీ స్పీకర్ పిఏ సంగ్మా ఉత్సాహభరిత వాతావరణంలో తమ మద్దతుదారుల సమక్షంలో గురువారం నామినేషన్లు దాఖలు చేశారు. ఉదయం పదకొండు గంటలకు ప్రణబ్ ముఖర్జీ తన నామినేషన్ దాఖలు చేస్తే, మధ్యాహ్నం రెండు గంటల ముప్ఫై ఒక్క నిమిషాలకు పిఏ సంగ్మా తన నామినేషన్ పత్రాలను రాష్టప్రతి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా నియమితులైన రాజ్యసభ సెక్రటరీ జనరల్ వికె అగ్నిహోత్రికి అందించారు. ప్రణబ్, సంగ్మాలు నాలుగేసి సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్టి సహా ఎనిమిదిమంది ముఖ్యమంత్రులతోపాటు యూపీఏ భాగస్వామ్య పక్షాల నేతలు అధిక సంఖ్యలో కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రణబ్ పక్షాన మొదటి సెట్ నామినేషన్‌ను ప్రధాని మన్మోహన్ సింగ్, పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అందచేశారు. రెండో సెట్ నామినేషన్‌ను పార్టీ సీనియర్ నాయకుడు మోతీలాల్ వోరా అందించగా, మిగిలిన రెండు సెట్ల నామినేషన్ పత్రాలను స్వయంగా ప్రణబ్ ముఖర్జీ రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ప్రణబ్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న యూపీఏ భాగస్వామ్య పక్షమైన తృణమూల్ కాంగ్రెస్ కార్యక్రమానికి డుమ్మా కొట్టింది. కాగా ప్రణబ్‌కు మద్దతు తెలియచేసిన సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, ఆర్‌జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, లోక్ జన్‌శక్తి నేత రాంవిలాస్ పాశ్వాన్ ప్రణబ్ నామినేషన్ ఘట్టానికి హాజరయ్యారు. మధ్యాహ్నం 2.31 నిమిషాలకు ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తాము ప్రతిపాదించిన అభ్యర్థి సంగ్మా పక్షాన మొదటి సెట్ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి అగ్నిహోత్రికి అందించారు. అన్నాడీఏంకె పక్ష నేత తంబిదొరై రెండో సెట్ నామినేషన్ అందిస్తే, మిగిలిన రెండు సెట్ల నామినేషన్లను అభ్యర్థి పిఏ సంగ్మా స్వయంగా అందించారు. భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్‌కె అద్వానీ, ఉభయ సభల విపక్ష నేతలు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, గోవా ముఖ్యమంత్రి పరికర్, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్, బిజెపి సీనియర్ నేతలు మురళీ మనోహర్ జోషి, అనంతకుమార్, వెంకయ్యనాయుడు, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజె తదితరులు సంగ్మా వెంట ఉన్నారు. సంగ్మా కుమార్తె, కేంద్ర గ్రామీణాభివృధ్ధి శాఖ సహాయ మంత్రి అగత సంగ్మా నామినేషన్ దాఖలు కార్యక్రమానికి గైర్హాజర్ కావటం గమనార్హం.
కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లిపోయిన సంగ్మా నేషనలిస్టు కాంగ్రెస్ స్ధాపనలో కీలక పాత్ర వహించారు. కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్ ఆదేశాలను ఖాతరు చేయకుండా రాష్టప్రతి పదవికి పోటీ చేయాలన్న పట్టుదలకుపోయి పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. అగత సంగ్మా తండ్రినే అనుసరించటం ఖాయమన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఎన్సీపీ నుంచి పోటీ చేసి ఆమె గెలు పొందారు. మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో అందరికంటే పిన్న వయస్కురాలు అగత సంగ్మాయే కావటం గమనార్హం. (చిత్రం) నామినేషన్లు దాఖలు చేసిన అనంతరం అభివాదం చేస్తున్న ప్రణబ్ ముఖర్జీ, పిఏ సంగ్మా