హైదరాబాద్, న్యూస్‌లైన్:

‘టోర్నమెంట్ గెలవడమే తరువాయి... కొంత మందికేమో ఘన స్వాగతాలు, భారీ స్థాయిలో హడావిడి, ఆ వెంటనే నగదు నజరానా. నేను వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పతకం నెగ్గినా....
నాలుగు నెలల వరకు కనీస అభినందన కూడా దక్కలేదు. అంత పెద్ద టోర్నీలో నెగ్గినా.... వేరేవాళ్లతో పోలిస్తే నాకెలాంటి గుర్తింపు లభించిందో అందరికీ తెలుసు...’ అంటూ బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారిణి గుత్తా జ్వాల మరోసారి విరుచుకు పడింది. కెరీర్ ఆరంభంనుంచి తనకు ఈ పరిస్థితి ఎన్నోసార్లు ఎదురైందని ఆమె పేర్కొంది. నగరంలో గురువారం జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న జ్వాల, భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు గుప్పించింది. ఏదో ముంచుకొస్తున్నట్లు రెండు రోజుల్లోనే ‘బాయ్’ భారీ నగదు ప్రోత్సాహకం ప్రకటించడాన్ని జ్వాల ప్రశ్నించింది. ‘టోర్నీల విలువపై స్పష్టత లేకుండానే ఒకవైపు ప్రభుత్వం అనూహ్య మొత్తాన్ని ప్రకటించింది. మరో వైపు బాయ్ కూడా వెంటనే స్పందించింది. మా విజయాలు మాత్రం లెక్కలోకి రావా’ అని ఆమె వ్యాఖ్యానించింది. ఇటీవల సైనా నెహ్వాల్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షలు ప్రకటించగా... ‘బాయ్’ రూ.పది లక్షల నగదును ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
పరోక్షంగా ఈ విషయాన్నే జ్వాల ఎత్తి చూపింది. డబ్బు కోసం తాను మాట్లాడటం లేదని... కొందరి వ్యవహార శైలితోనే సమస్య అని ఆమె పేర్కొంది. అయితే ఎవరినో అడగాల్సిన, ప్రాధేయ పడాల్సిన అవసరం తనకు లేదన్న జ్వాల... దేశం కోసం ఆడుతుండటం పట్ల గర్వపడుతున్నానని చెప్పింది. టెన్నిస్ వివాదంలో సానియా మీర్జాకు మద్దతు పలకడాన్ని జ్వాల సమర్థించుకుంది. ‘నేను అశ్వినితో డబుల్స్, దిజుతో మిక్స్‌డ్ డబుల్స్ ఆడతాను. దీనిని ఎవరైనా మార్చాలని ప్రయత్నిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించను. అవసరమైతే వారితో పోరాడతాను’ అని జ్వాల స్పష్టం చేసింది.