Keechaka Droupadi Story
స్త్రీలను ఎవరైనా కించపరుస్తుంటే, అవమానిస్తుంటే అపర కీచకుడు అనడం చాలాసార్లు వినే ఉంటారు. ఇంతకూ అసలు కీచకుడు ఎవరు, ఏం చేశాడో తెలుసుకుందాం.
అనివార్య కారణాల వల్ల పంచ పాండవులను వివాహం చేసుకున్న ద్రౌపది మహా సౌందర్యవతి. అజ్ఞాతవాసంలో ఉండగా ద్రౌపది,....
మాలిని అనే పేరుతో సైరంధ్రిగా అంతఃపురంలో అట్టిపెట్టుకోమని అడిగినప్పుడు సుధేష్ణ భయపడింది. విరాటరాజు, ద్రౌపదిని చూసి ఎక్కడ మోహంలో పడతాడోననేది ఆమె భయం. ''పురుషుడి మనసు మహా చంచలమైంది. అందునా నువ్వు వర్ణించనలవి కానంత అందంగా ఉన్నావు..'' అంటూ కపటం లేకుండా మనసులోని మాట చెప్పింది.
ద్రౌపది శాంత చిత్తంతో ''మీరన్న మాట నిజమే. అయితే, ఒకసారి పంచ పాండవులను గుర్తు చేసుకోండి.. వాళ్ళు శౌర్యానికి మారుపేరు. తమ భార్యపై మరో పురుషుడి కన్ను పడితే చూస్తూ సహించరు. పైగా నేను కూడా చాలా జాగ్రత్తగా ఉంటాను. జరగరానిది ఏదీ జరగదని నేను మీకు హామీ ఇస్తున్నాను.. నన్ను మీ అంతఃపురంలో ఉండనీయండి..'' అంది.
ద్రౌపది ముగ్ధమోహన లావణ్యాన్ని చూస్తోంటే ఎంత సందేహంగా ఉన్నప్పటికీ, ఆమె మాటలమీది నమ్మకంతో సుధేష్ణ సరేననక తప్పలేదు. అలా ద్రౌపది సుధేష్ణ అంతఃపురంలో చోటు సంపాదించింది.
సుధేష్ణ భయపడినట్లు ద్రౌపది విషయంలో విరాటరాజు అనుచితంగా ప్రవర్తించలేదు. అయితే, సుధేష్ణ సోదరుడు కీచకుడు ద్రౌపదిని చూసి మోహావేశంలో పడ్డాడు.
''మాలినీ! అందానికి నిర్వచనంలా ఉన్న నువ్వు సైరంధ్రిగా ఉండటం ఏమిటి? నాకు ఈ విషయం మింగుడు పడటంలేదు. సరే, నీ పూర్వాపరాల సంగతి నాకెందుకు? నిన్ను చూడగానే వలచాను. నువ్వు లేకపోతే బతకలేను అనిపిస్తోంది. ఇక నువ్వు సైరంధ్రిగా ఉండాల్సిన అగత్యం లేదు. నా పట్టపురాణిని చేసుకుంటాను. నువ్వు ఒప్పుకుంటే చాలు నీకు సర్వ భోగాలూ కల్పిస్తాను. నువ్వు పరిచారికలా ఉండాల్సిన పని లేదు. నీకింద ఎందరో పరిచారికలు ఉంటారు..'' అంటూ చెప్పాడు.
కీచకుడు ఆమెని ఊరించాడు, బ్రితిమాలాడు, ప్రాధేయపడ్డాడు. ఆమె దేనికీ లొంగకపోయేసరికి చివరికి బెదిరించాడు. అది మొదలు కీచకుడు, ద్రౌపదిని అనేకసార్లు వెంటపడుతూ, వేధిస్తూ, సతాయిస్తున్నాడు. ద్రౌపదిని వేధిస్తున్న సంగతి తెలిసిన భీముడు అసహనంతో రగిలిపోయాడు. వికటించిన ప్రేమకు వికృతంగానే జవాబు చెప్పాలనుకున్నాడు. ఈసారి కీచకుడు వెంబడించినప్పుడు నర్తనశాలకు రమ్మని ఆహ్వానించమన్నాడు.
కీచకుడు మహదానందపడి, ద్రౌపది చెప్పిన సమయానికి నర్తనశాలకు వెళ్ళాడు. లోనికి వెళ్తూనే తలుపు మూశాడు. గదిలో భీమసేనుడు మంచంమీద కూర్చున్నాడు. చూడగానే స్త్రీమూర్తిలా భ్రమింప చేసేందుకు తలపై చెంగు చుట్టుకున్నాడు.
కీచకుడు, ఆ కూర్చున్నది ద్రౌపదేననుకుని సంబరంగా వెళ్ళి చేయి పట్టుకున్నాడు. అంతే.. భీముడు నిమిషంలో కీచకుని నేలకూల్చాడు.