NEWS

Blogger Widgets

10.6.12

వైఎస్‌ది దోపిడీ పాలన!



 
రాష్ట్రం పరువు పోయింది
కూతురుకు కట్నంగా బయ్యారం
కుమారుడికి సీమాంధ్రను కట్టబెట్టారు
మళ్లీ 'వైఎస్ పాలన' వస్తే.. తెలంగాణకు టోపీ
జగన్, విజయలక్ష్మిపై కేసీఆర్ విసుర్లు
పరకాల, జూన్ 9 : వైఎస్ పాలన కారణంగా జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పరువు పోయిందని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పేర్కొన్నారు. దేశంలో తలెత్తుకోలేని స్థితిలో పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పుడు మళ్లీ 'వైఎస్ పాలన' వస్తే తెలంగాణ నెత్తిన టోపీ పెట్టడం ఖాయమని హెచ్చరించారు. శనివారం రాత్రి వరంగల్ జిల్లా పరకాలలో జరిగిన ఉప ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ పాల్గొన్నారు. సరిగ్గా ఒక్కరోజు ముందు పరకాల నియోజకవర్గంలో వైఎస్ విజయలక్ష్మి పర్యటించిన నేపథ్యంలో... ప్రధానంగా ఆమె వ్యాఖ్యలను, జగన్‌ను లక్ష్యంగా చేసుకుని కేసీఆర్ ప్రసంగం సాగింది. 
 
జగన్ ముఖ్యమంత్రి అయితే వైఎస్ పాలన మళ్లీ వస్తుందని విజయలక్ష్మి చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. "ఖమ్మం జిల్లాలోని బయ్యారం ప్రాంతంలోని అపారమైన, విలువ కలిగిన 1.50లక్షల ఎకరాల విస్తీర్ణంలోని గనులను తన కూతురు షర్మిలకు వైఎస్ కట్నంగా రాసిచ్చారు. రాయలసీమ ప్రాంతంలోని వనరులను కొడుకు జగన్‌కు కట్టబెట్టారు. అలాంటి వైఎస్ పాలన మళ్లీ వస్తే తెలంగాణ ప్రజల నెత్తిన టోపీ పెట్టినట్లే'' అని కేసీఆర్ ధ్వజమెత్తారు. దొంగలకు కొండా సురేఖ, మురళి సద్దులు కట్టినట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. 
 
జగన్ జైలు నుంచి తిరిగి వస్తారని, ముఖ్యమంత్రి కాగానే రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తారని సీమాంధ్రలో విజయలక్ష్మి చెబుతున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణకు అంతో ఇంతో ఉపయోగపడే జల వనరుగా ఉన్న గోదావరి నీళ్లను తీసుకుని వెళ్లే కుట్రలో భాగంగానే పోలవరం ప్రాజెక్టుకు వైఎస్ హయాంలో రూపకల్పన జరిగినట్లు ఆయన తెలిపారు. పోలవరం ప్రాజెక్టును సమర్థిస్తారా? అని కొండా దంపతులను నిలదీశారు. 
 
వైఎస్ పాలనలో రాష్ట్రంలో దోపిడీ జరిగిందని... ఆయన పుణ్యాన ఐఏఎస్ అధికారులు, మంత్రులు జైలు బాట పట్టారని కేసీఆర్ తెలిపారు. పరకాల టీఆర్ఎస్ అభ్యర్థి భిక్షపతిని గెలిపించి... జయ శంకర్ సార్‌కు అంకితమివ్వాలని పదేపదే విజ్ఞప్తి చేశారు. ఈ సభలో టీఆర్ఎస్ నేతలు ఈటెల రాజేందర్, హరీశ్‌రావు తదితరులు ప్రసంగించారు. 
 
గాలి దుమారం.. వర్షం
శనివారం బీజేపీ, టీఆర్ఎస్ పోటాపోటీగా సభలు నిర్వహించగా... ఇరువురి సభలకూ వర్షం ఆటంకం కల్గించింది. పరకాలలో టీఆర్ఎస్ సభ 7 గంటలకు ప్రారంభమైంది. అప్పుడే గాలి దుమారం మొదలైంది. 8 గంటలకు కేసీఆర్ వేదిక ఎక్కి ప్రసంగం మొదలుపెట్టగానే... వర్షం మొదలైంది. 'నిజాలు చెబుతున్నందునే వాన పడుతోంది' అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. వర్షం జోరు పెరగడంతో కేసీఆర్ తన ప్రసంగాన్ని త్వరగా ముగించారు.