7అంతస్తుల బిల్డింగ్‌లో భారీ ప్రమాదం
ముఖ్యమంత్రి కార్యాలయమూ దగ్ధం
11మందికి గాయాలు
ఆదర్ష్ స్కామ్ ఫైళ్లు సేఫ్
ముంబయి : మహారాష్ట్ర రాష్ట్ర సచివాలయం 'మంత్రాలయ'లో గురువారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్నది. ఇందులో ముఖ్యమంత్రి, కీలకమంత్రులు, అధికారుల కార్యా లయాలు వున్నాయి. రెండు గంటల దాటిన తర్వాత అగ్నిప్రమాదం సంభవించింది. నాలుగో అంతస్తులోని గిరిజన సంక్షేమశాఖ మంత్రి బబన్‌రావు కేబిన్ సమీపంలో ముందుగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక దళాలు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ సాయంత్రం వరకు మంటలు అదుపులోకి రాలేదు. ఎవరైనా మృతి చెందింది లేనిది వెంటనే తెలియరాలేదు. అయితే, చాలామంది పైఅంతస్తుల్లో, టెర్రాస్‌పై చిక్కుకున్నారు. అగ్నిమాపక సిబ్బందితో పాటు కమాండో దళాలు, క్విక్ రెస్పాన్స్ బృందాలు రంగంలోకి దిగాయి. నావల్ డాక్‌యార్డ్‌కు చెం దిన రెండు బృందాలు రంగంలోకి దిగాయి. నాలుగో అంతస్తులో పనిచేసే ఉద్యోగులు, అధికా రులు, సిబ్బంది భయంతో పరుగులు తీశారు. దాదాపు రాష్ట్ర పాలనా యంత్రాంగమంతా నాలుగో అంతస్తులోనే వున్నది. ప్రధమంగా 2.45 గంటల సమయంలో అగ్నిప్రమాదాన్ని గుర్తిం చారు. అక్కడ నుండి ఐదు, ఆరు, ఏడు అంత స్తులకు మంటలు వేగంగా వ్యాపించాయి. పొగలు కూడా వ్యాపించ డంతో అంతస్తుల్లో చిక్కు కున్న వారిని బయటికి తీసుకురావడం కష్టంగా మారింది. మంటలు వ్యాపించిన వెంటనే భవనం నుండి దాదాపు 5 వేల మందిని ఖాళీ చేయించారు. అగ్నిమాపక బలగాలు అతిపెద్ద హైడ్రాలిక్ నిచ్చెనలు ఉప యోగించాయి. పైన మంటలు, పొగలో చిక్కుకున్న వారిని ఈ దళాలు రక్షిం చాయి. అగ్నిప్రమాదంతో మంత్రాలయ భవనమే కాకుండా పరిసర ప్రాం తాల్లోనూ దట్టమైన పొగ ఆవరించింది. కొంత మంది ప్రాణాలు అరచేత పట్టుకొని పరుగులు తీస్తే కొంతమంది సమాయక బృందాల కోసం ఎదురుచూస్తూ నిల్చు న్నారు. కొంతమంది తాళ్లు, డ్రెయిన్ పైపులు పట్టు కొని కిందకు జారడం కనిపించింది. పట్టణాభివృద్ధి శాఖ, హోమ్, రెవెన్యూ, పరిశ్రమల మంత్రిత్వ శాఖల భవనాలు అగ్నిప్రమాదానికి తీవ్రంగా దెబ్బతిన్నాయి. వివాదాస్పద ఆదర్శ్ కుంభకోణం వ్యవహారానికి సంబంధించిన ఫైళ్లన్నీ పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యాలయంలోనే వున్నాయి. ఆరో అంతస్తులోని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ కార్యాలయాలు కూడా దెబ్బతిన్నాయి. కొంతమంది గాయపడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నప్పటికీ అధికారికంగా ఎవరు ధృవీకరించడం లేదు. మంటలు రావడానికి ముందు పేలుడు శబ్ధం విన్నట్లు కొంతమంది చెప్పారు.