ఇస్లామాబాద్, జూన్ 21: పాకిస్తాన్ కొత్త ప్రధాని అభ్యర్థిత్వ వ్యవహారం క్షణాల్లో అనేక మలుపులకు లోనైంది. అధికార పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ మొదట తన అభ్యర్థిగా మఖ్దూమ్ షాబుద్దీన్‌ను ప్రకటించింది. అయితే ఆయనపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ కావడంతో క్షణాల్లో తన అభ్యర్థిని మార్చి ప్రధాని పదవికి రజా పర్వయిజ్ అష్రాఫ్‌ను ప్రకటించింది. ఇంతకు ముందు ప్రధాని పదవికి ఎంపికైన మఖ్దూమ్ షాబుద్దీన్‌కు రావల్పిండి కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. షాబుద్దీన్ వైద్య ఆరోగ్య మంత్రిగా పనిచేసినప్పుడు ఎఫెడ్రిన్ అనే డ్రగ్ దిగుమతికి సంబంధించి చోటుచేసుకున్న అవకతవకలపై మాదక ద్రవ్యాల నిరోధక విభాగం(ఎఎన్‌ఎఫ్) కేసు నమోదు చేసింది. దీనిపై రావల్పిండిలోని ఎఎన్‌ఎఫ్ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సఫ్కాతుల్లాఖాన్ ఈ ఎన్‌బిడబ్ల్యూ జారీ చేశారు. ఈకేసులో ప్రధాన మంత్రి పదవికి నామినేట్ అయిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నేత మఖ్దూమ్ షాబుద్దీన్, మాజీ ప్రధాని యూసుఫ్ రజా గిలానీ కుమారుడు అలీ వౌసా గిలానీలపై ఎన్‌బిడబ్ల్యూ జారీ అయింది. షాబుద్దీన్, గిలానీలను అరెస్టు చేసి వారంలోపున్యాయస్థాంలో హాజరుపరచాలని జడ్జి ఆదేశించారు