NEWS

Blogger Widgets

22.6.12

వైకాపా ఎమ్మెల్యేల సత్యాగ్రహం


హైదరాబాద్, జూన్ 21: కాంగ్రెస్, టిడిపి, సిబిఐ కలిసి తమ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డిపై మహాకుట్రకు తెర తీశాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. జగన్‌పై అక్రమ కేసులు పెట్టారని ఆరోపిస్తూ అందుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, ఆ పార్టీ శాసనసభా పక్ష నేత విజయమ్మ అధ్వర్యంలో గురువారం అసెంబ్లీలోని గాంధీ విగ్రహం వద్ద సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పాల్గొన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పేరు ప్రతిష్ఠలను దెబ్బతీసే కుట్రతో పాటు, ఆయనకు భౌతికంగా హాని చేసే కుట్రకు కూడా పాల్పడే అవకాశం ఉందని తాము నమ్ముతున్నామని సత్యాగ్రహ దీక్షా శిబిరం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. ఈ వ్యవహారాన్ని దేశంలోని ఇతర రాజకీయ పార్టీలకు, ప్రజాస్వామ్య వాదులకు నివేదించనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్, టిడిపి, సిబిఐ ఉమ్మడిగా సాగిస్తున్న కుట్రను నిరసిస్తూ, ప్రజాస్వామ్య సంస్థల పట్ల మళ్లీ విశ్వాసాన్ని నెలకొల్పాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన శాసనసభ్యులుగా తాము అసెంబ్లీలోని గాంధీ విగ్రహం వద్ద సత్యాగ్రహం చేపట్టినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యమ్రంలో 15 మంది ఎమ్మెల్యేలతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. అనంతరం వారిని పోలీసులు అరెస్టుచేసి పూచీకత్తు పైన విడుదలచేశారు.
సిబిఐ జెడి లక్ష్మీనారాయణ పలు మీడియా ప్రతినిధులతో గంటల తరబడి మాట్లాడుతూ దర్యాప్తు వివరాలను ముందుగా లీకు చేశారని వైఎస్‌ఆర్‌సిపి నేత, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు విమర్శించారు. ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ సుప్రీం కోర్టు తీర్పు కన్నా జెడి గొప్పవాడా అని ఆయన ప్రశ్నించారు. జెడి లక్ష్మీనారాయణ తాను ఒక ఉద్యోగి అనే విషయాన్ని మర్చిపోయి వ్యవహరించారన్నారు. మీడియాకు ఫోన్లు చేసే అధికారం ఎవరు ఇచ్చారన్నారు. హైకోర్టును కూడా మోసం చేసే విధంగా సంభాషించారని, యుపిఎస్‌సి మాన్యువల్‌ను జెడి చదువుకోవాలని ఆయన కోరారు.
సిబిఐ జెడిని తొలగించాలి: అంబటి
వైఎస్ జగన్ కేసు విచారణ జరిపేందుకు సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అనర్హుడని వైఎస్‌ఆర్‌సిపి నేతలు అంబటి రాంబాబు, బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. గురువారం వారు ఇక్కడ పార్టీ కార్యాలయంలో విలేఖర్లతో మాట్లాడుతూ సిబిఐ జెడి లక్ష్మీనారాయణను వెంటనే విధుల నుంచి తొలగించాలన్నారు. మీడియా రిపోర్టర్లను తప్పుబట్టడం తమ ఉద్దేశం కాదన్నారు. జెడి మొబైల్ ఫోన్‌కు సంబంధించి కాల్ లిస్టువివరాలను, ఆధారాలను రాష్టప్రతి ప్రతిభాపాటిల్, ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అందించనున్నట్లు తెలిపారు. సిబిఐ జెడితో క్రైం రిపోర్టర్లు ఎన్నిసార్లు మాట్లాడినా తప్పుబట్టడం లేదని, కాని నిబంధనలను ఉల్లంఘించి ప్రత్యేకంగా ఒక వర్గం మీడియాతోనే సిబిఐ జెడి ఎందుకు మాట్లాడారని, దీనికి జెడి సమాధానం చెప్పాలన్నారు. సిబిఐ మాన్యువల్, హైకోర్టు తీర్పులకు విరుద్ధంగా జెడి వ్యవహరించారని వారు ఆరోపించారు. మీడియా ప్రతినిధులకు తమ పార్టీ అండగా ఉంటుందన్నారు. (చిత్రం) అసెంబ్లీలోని గాంధీ విగ్రహం వద్ద గురువారం సత్యాగ్రహ దీక్షను నిర్వహిస్తున్న వైకాపా ఎమ్మెల్యేలు