వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు, సాక్షి మీడియాపై ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తీవ్రంగా ధ్వజమెత్తారు. సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణతో తాము మాట్లాడిన కాల్ లిస్టును విడుదల చేస్తూ తమ మొబైల్ నెంబర్లను పత్రికా ప్రకటనలో పొందుపరచడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. లక్ష్మీనారాయణతో తాము మాట్లాడితే కుట్ర ఎలా అవుతుందని ప్రశ్నించారు. వృత్తి ధర్మంలో భాగంగానే తాము లక్ష్మీనారాయణతో అనేక సార్లు మాట్లాడామని, ఓఎంసి, జగన్ అక్రమాస్తుల కేసు, ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసుకు సంబంధించి సిబిఐకి చెందిన ఇంకా చాలా మంది అధికారులతో మాట్లాడుతున్నామని తెలిపారు. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి క్రైం రిపోర్టర్ సత్యనారాయణ, ఎన్టీవీ క్రైం రిపోర్టర్ రమేష్ వైట్ల, టివి 9 క్రైం రిపోర్టర్ మహాత్మ, జీ24 క్రైం రిపోర్టర్ ఇన్నారెడ్డి, ఐ న్యూస్ క్రైమ్ రిపోర్టర్ కమల్ తదితరులు గురువారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సాక్షి ఛానెల్లో వస్తున్న కథనాలపై వారు తీవ్రంగా స్పందించారు. వృత్తిధర్మంలో భాగంగా సిబిఐ జేడి లక్ష్మీనారాయణతో తాము వందల సార్లు కాదు, వేయి సార్లు మాట్లాడామని వారు చెప్పారు. ఆయనతో ఒక్క జగన్ కేసు గురించే కాదు, ఎమ్మార్, ఓఎంసి, సోహ్రాబుద్దీన్ తదితర కేసుల గురించి కూడా మాట్లాడామన్నారు. తమ మొబైల్ నెంబర్లు విడుదల చేయడం, సాక్షి ఛానెల్లో స్క్రోలింగ్ ఇవ్వడం వల్ల తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, తమ ప్రాణాలకు ముప్పుందన్నారు. కుట్రలో భాగస్వాములమంటూ నిందించడం ద్వారా తమ వ్యక్తిగత స్వేచ్ఛను సాక్షి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దెబ్బతీస్తున్నారని వారు ఆరోపించారు. చేసిన పొరపాట్లకు గానూ తమకు 24 గంటల్లోగా వైఎస్ఆర్సిపి నాయకులు క్షమాపణ చెప్పాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. న్యాయపరమైన చర్యలకు కూడా వెనకాడబోమని వారు హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమపై వ్యక్తిగతంగా దాడి చేశారని వారు ఆరోపించారు.
జెడిగా లకీëనారాయణ అనర్హుడు : అంబటి
లక్ష్మీనారాయణ సిబిఐ జాయింట్ డైరెక్టర్గా అనర్హుడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. గురువారం సాయంత్రం మరో అధికార ప్రతినిధి బాజిరెడ్డి గోవర్దన్తో అంబటి మాట్లాడారు. కర్తవ్య నిర్వహణలో భాగంగా విధులు నిర్వర్తిస్తున్న క్రైం జర్నలిస్టులపై తమకు ఎటువంటి కక్షా లేదన్నారు. ఫోన్నెంబర్లు మీడియాలో వచ్చినంత మాత్రాన క్రైం జర్నలిస్టులు భయపడిపోయారంటే ఎవరూ నమ్మరని, జర్నలిస్టులు అంత పిరికివారని తాము భావించటం లేదని బాజిరెడ్డి గోవర్దన్ అన్నారు.