NEWS

Blogger Widgets

22.6.12

నాలాలో కొట్టుకుపోయి వలస కూలీ మృతి



    హైదరాబాద్, జూన్ 21: బల్దియా అధికారుల నిర్లక్ష్యం ఓ వలస కూలీ నిండు ప్రాణం బలిగొంది. సికింద్రాబాద్ నాలాబజార్‌లో గురువారం పూడికతీస్తుండగా ఒక కార్మికుడు ప్రమాదవశాత్తూ నాలాలో పడి దుర్మరణం పాలయ్యాడు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే... సికింద్రాబాద్ రాంగోపాల్‌పేట డివిజన్‌లోని నాలాలు కొంతకాలంగా వ్యర్థాలతో నిండి వర్షపు నీరు ప్రవాహానికి అడ్డుపడుతుండడంతో పూడికతీత పనులు చేపట్టారు. వీటిని వరంగల్ జిల్లాకు చెందిన సూరయ్య అనే కాంట్రాక్టరు నిర్వహిస్తున్నాడు. అదే జిల్లా పర్వతగిరి మండలం కొంకపాక నుంచి నగరానికి వలసవచ్చిన తన బంధువులైన పదకొండు మంది కార్మికులను గురువారం సూరయ్య పనికి తీసుకొచ్చాడు. ఉదయం 10 గంటలకు నాలాబజార్ వద్ద ఉన్న నాలాలో పూడికతీత పనులు జరుగుతున్న సమయంలో నిచ్చెన సాయంతో లోపలకు దిగిన దేవరాజు వీరస్వామి(23) మరో ఐదుగురు వ్యర్థాలను బయటకు తీశారు. ఇంతలో నాలాలో నీటి ప్రవాహ ఉద్ధృతి ఒక్కసారిగా పెరిగి క్షణంలో నిచ్చెన విరిగి దేవరాజు వీరస్వామితో పాటు మిగతావారూ కొట్టుకుపోయారు. అయతే వెంటనే స్పందించి మరో చోట మ్యాన్‌హోల్ తవ్వించడంతో వీరస్వామి మినహా మిగతావారు బయటపడ్డారు. కనిపించకుండా పోయిన దేవరాజు వీరస్వామి దాదాపు ఐదు గంటల తర్వాత కిలోమీటరు దూరంలో ఉన్న కళాసిగూడ ఉన్నత పాఠశాల సమీపంలోని నాలాలో విగతజీవిగా కనిపించాడు. కాగా, మృతుడి కుటుంబానికి జిహెచ్‌ఎంసి నుంచి రూ.1లక్ష నష్టపరిహారంతో పాటు ఆపద్బంధు పథకం కింద వర్తించే ప్రయోజనాలు అందజేస్తామని సికింద్రాబాద్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ గంగాధర్‌రెడ్డి ప్రకటించారు. అంతేకాకుండా, కాంట్రాక్టరు ద్వారా మరో రూ.50వేలు ఇప్పిస్తామన్నారు. గాయపడ్డ వారికి రూ.5వేల చొప్పున అందజేస్తామని హామీ ఇచ్చారు.