NEWS

Blogger Widgets

22.6.12

శిబి చక్రవర్తి ఔదార్యం అపురూపం



Sibi Chakravarthy Generosity
దాతృత్వానికి మరో పేరు శిబి చక్రవర్తి. అలా ఎందుకంటారో తెలియాలంటే శిబి చక్రవర్తి కథా కమామీషు ఏమిటో చూద్దాం.
శిబి చక్రవర్తి చేతికి ఎముక లేదని, దానం చేయడంలో ఆయన్ను మించిన వారు లేరని లోకంలో అందరూ చెప్పుకుంటున్నారు. ఆ కీర్తి అలా అలా పాకి స్వర్గం వరకూ వ్యాపించింది.
ఇంద్రుడు, తన పక్కనే ఉన్న యమునివైపు చూసి తల పంకించి నవ్వి "అయితే శిబి చక్రవర్తికి ఓ పరీక్ష పెడదామేంటి?!" అన్నాడు. యముడు కాదనలేదు. ఇద్దరూ సరదా పడ్డారు. ఇంద్రుడు పావురంగా, యముడు డేగగా బయల్దేరారు.
డేగ రూపంలో ఉన్న యముడు, పావురం రూపంలో ఉన్న ఇంద్రుని తరుముకొచ్చింది. పావురం శిబి భుజంమీద వాలింది. నవ్వుతూ చూసిన శిబి చక్రవర్తితో ''నన్ను కాపాడు... డేగబారినుండి రక్షించు.." అంది.
శిబి చక్రవర్తి అలాగే రక్షిస్తానని మాట ఇచ్చాడు.
కానీ, పావురాన్ని తరుముతూ వచ్చిన డేగ ''రాజా, ఆ పావురాన్ని విడిచిపెట్టు. నా నోటి దగ్గరి ఆహారాన్ని నీవద్ద ఉ న్చుకోవడం భావ్యం కాదు.. నాకు చాలా ఆకలిగా ఉంది.. ముందు పావురాన్ని వదులు'' అంది.
శిబి చక్రవర్తి చాలా నెమ్మదిగా ''నీకు కావలసింది ఆహారమే కదా.. అందుకేమీ లోటు ఉండదు.. తెప్పిస్తాను'' అన్నాడు.
''తమరు ఏదో ఆహారం పెడితే వల్ల కాదు, నాకు మాంసాహారమే కావాలి.. దయచేసి పావురాన్ని వదిలిపెట్టు''
''సరే, నీకు మాంసాహారమే తెప్పిస్తాను.. ఈ పావురాన్ని మాత్రం వదులు.. దాన్ని కాపాడతానని మాట ఇచ్చాను.. ఇచ్చిన మాట తప్పడం భావ్యం కాదు''
''ఉహూ.. నాకు ఏదో ఒక మాంసాహారం ఒద్దు... అయితే ఆ పావురాన్ని వదిలిపెట్టు.. లేదా నీ తోడ కోసి పావురం ఎత్తు మాంసాన్ని ఇవ్వు'' అంది డేగ.
శిబి చక్రవర్తి క్షణం కూడా ఆలోచించలేదు. వెంటనే తరాజు తెప్పించాడు. నిస్సందేహంగా తన తోడను కోయడానికి సిద్ధపడ్డాడు. అయితే, తోడలోంచి ఎంత మాసం కోసి పెడుతున్నా శ్రీకృష్ణ తులాబారం మాదిరిగా, పావురంతో సరి తూగడంలేదు. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. అరచేతిలో ఇమిడే పావురం ఇంత బరువు ఉండతమేంటి.. ఇదేం మాయ అని విస్తుపోయారు.
శిబి చక్రవర్తి మాత్రం వెనుకాడలేదు శిబి చక్రవర్తి. తాను లేచి నిలబడి ''నువ్వు సందేహించకుండా నన్ను తిను.. నా మొత్తం మాంసాన్ని నీకు సమర్పించుకుంటున్నాను.. పావురం జోలికి మాత్రం వెళ్ళకు.. నన్ను తిని నీ ఆకలి తీర్చుకో'' అన్నాడు.
శిబి చక్రవర్తి ఔదార్యానికి, దాతృగుణానికి ఇంద్రుడు పులకించిపోయాడు. ఇక నటించలేకపోయాడు. వెంటనే తన అసలు రూపం దాల్చాడు. డేగరూపంలో ఉన్న యముడు కూడా అదే పని చేశాడు. వాళ్ళిద్దర్నీ చూసి శిబి చక్రవర్తితోబాటు తక్కిన సభికులూ ఆశ్చర్యంతో నోళ్ళు తెరిచారు.
"శిబీ! ఒక పావురం కోసం నీ తోడను కోసి ఇచ్చిన నీ సాహసాన్ని, దాతృత్వ గుణాన్ని, త్యాగనిరతిని ఎలా ప్రశంసించాలో అర్ధం కావడంలేదు.. ఆఖరికి మొత్తంగా నిన్ను నువ్వు అర్పించుకోడానిక్కూడా సిద్ధపడ్డావు. నీ కీర్తి శాశ్వతంగా నిలిచిపోతుంది..'' అంటూ చిరునవ్వు నవ్వారు.
సభికులు సంతోషంగా కరతాళధ్వనులు చేశారు.