సంగ్మాకే సపోర్టు
న్యూఢిల్లీ, జూన్ 21: రాష్టప్రతి పదవికి ఎన్నిక తప్పేటట్టు లేదు. అధికార పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీతో బిజెపి సారథ్యంలోని ఎన్డీయేలో చీలిక వర్గ అభ్యర్థిగా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన గిరిజన నేత, లోక్‌సభ మాజీ స్పీకర్ పిఏ సంగ్మా పోటీ పడనున్నారు. పోటీ లేకుండా రాష్టప్రతి ఎన్నిక జరగబోదని చేసిన సవాలును నిలబెట్టుకుంటూ బిజెపి ఎట్టకేలకు సంగ్మా అభ్యర్థిత్వాన్ని బలపర్చాలన్న తుది నిర్ణయం తీసుకోవటంతో ముఖాముఖి పోటీకి రంగం సిద్ధమైంది. తమ కూటమి నుంచి పోటీ చేసే అభ్యర్థిని ఏకాభిప్రాయంతో ఎంపిక చేయటానికి జరిగిన ప్రయత్నాలు విఫలమైనప్పటికీ, పోటీ చేయటానికి మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలామ్ నిరాకరించటంతో, ఆయన తరువాత పోటీ చేయటానికి అన్నివిధాలా అర్హుడైన సంగ్మాను బలపర్చాలన్న నిర్ణయం తీసుకున్నట్టు బిజెపి సీనియర్లు, పార్లమెంట్ ఉభయ సభల ప్రతిపక్ష నేతలు సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీ మీడియాకు వెల్లడించారు. అధికార అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్న ప్రణబ్‌పై పోటీకి, ఎన్డీయే నుంచి అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థి ఎంపికకు పార్టీపరంగా, కూటమి వైపునుంచి చేసిన ప్రయత్నాలు ఏకాభిప్రాయాన్ని సాధించలేక పోయాయని సుష్మ వెల్లడించారు. పశ్చిమబెంగాల్ సిఎం మమతా బెనర్జీ మాజీ రాష్టప్రతి కలామ్ పేరును ప్రతిపాదించారు. ఆయన పోటీ చేయటానికి ఇష్డపడలేదు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌లు సంగ్మా పేరును ప్రతిపాదించారు. ప్రణబ్‌పై పోటీ పెట్టే విషయంలో కూటమి భాగస్వాములైన శివసేన, జనతాదళ్ వ్యతిరేకించటంతో పార్టీలోని అధికశాతం అభిప్రాయానికి లోబడి సంగ్మానే బలపరచాలని తీర్మానించినట్టు చెప్పారు. ప్రణబ్ ముఖర్జీపై పోటీ విషయంలో తమ కూటమిలో తలెత్తిన అభిప్రాయ బేధాలు కూటమి భవితవ్యంపై ఎలాంటి ప్రభావం చూపించబోదన్న ఆత్మవిశ్వాసాన్ని వీరు వ్యక్తం చేశారు. రాష్టప్రతి పదవికి ఎన్నిక జరగరాదన్న సంప్రదాయమేమీ లేదన్నారు. అదేవిధంగా పోటీ విషయంలో తమ కూటమిలో ఏకాభిప్రాయం కుదరక పోవటం కూడా కొత్తకాదని ఆమె గుర్తు చేశారు. గత ఎన్నికల్లో తమ రాష్ట్రానికి చెందిన ప్రతిభాపాటిల్ రాష్టప్రతి పదవికి పోటీ చేసినందున శివసేన ఆమెకే ఓటు చేసిందని సుష్మ గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ అంతార్భాగమని జెట్లీ చెప్పారు అంతేకాక దేశాన్ని ప్రతి ఒక్క రంగంలో తిరోగమన పథంలో నడిపిస్తున్న యూపీఏ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పటానికే తమ పార్టీ రాష్టప్రతి ఎన్నికలో పోటీ చేయాలన్న ధృఢమైన నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు ప్రణబ్ ముఖర్జీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన తరువాతే ప్రధాని మన్‌మోహన్ సింగ్ తమ అగ్రనేత అద్వానీకి ఫోన్ చేసి మద్దతు కోరారని సుష్మా అన్నారు. అత్యున్నతమైన రాష్టప్రతి పదవికి ఇంతవరకూ ఒక్కసారి మాత్రమే ఏకగ్రీవ ఎన్నిక జరిగిందన్నారు. విపక్షాలతో ఏమాత్రం చర్చించకుండా యూపీఏ నేతలు తమ అభ్యర్థిని ప్రకటించిన తరువాత, ప్రధాన ప్రతిపక్షమైన తాము పోటీకి దిగకుండా ఎలా ఉండగలమని సుష్మ ప్రశ్నించారు. సంగ్మా అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్న తమ కూటమికి 33శాతం ఓట్లున్నాయని ఆమె తెలియచేశారు. గిరిజనుడు, క్రైస్తవుడైన సంగ్మాను అన్నివర్గాలు బలపర్చాలని ఆమె కోరారు. తమ కూటమిలోని భాగస్వాములైన శివసేన, జనతాదళ్ తమ నిర్ణయాన్ని మార్చుకుని సంగ్మాకు అనుకూలంగా ఓటు వేయాలని ఆమె కోరారు. చివరి క్షణం వరకూ వీరిని తమతో కలుపుకుపోయే ప్రయత్నాలు జరుగుతాయని ఆమె చెప్పారు. రాష్టప్రతి ఎన్నికలో విజయం సాధించటానికి కాంగ్రెస్ నాయకత్వం ఎప్పటి మాదిరిగానే విచారణ సంస్థలను దురుపయోగం చేస్తోందని జైట్లీ ఆరోపించారు. కలామ్ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించిన ఒక పార్టీ అగ్రనేత, ఇరవై నాలుగ్గంటలు గడవకముందే ప్లేటు ఎందుకు ఫిరాయించారని ఆయన ప్రశ్నించారు.