NEWS

Blogger Widgets

1.7.12

నాగార్జున అగ్రికెమ్‌లో భారీ పేలుడు



  • టీ బ్రేక్‌ వల్ల తప్పిన ప్రాణనష్టం
  • ఆసుపత్రుల్లో 18 మంది
  • ముగ్గురి పరిస్థితి ఆందోళనకరం
  • భద్రతా వైఫల్యమే కారణం
  • భయంతో 20 గ్రామాలను
  • ఖాళీ చేసిన జనం
  • జోరుగా దొంగతనాలు
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం నాగార్జున అగ్రికమ్‌ పరిశ్రమలో శనివారం ఉదయం 9.30 గంటల సమయంలో భారీపేలుడు సంభవించింది. ప్రమాదం జరిగిన సమయంలోనే టీ బ్రేకుకు అందరూ బయటకు రావడంతో ప్రాణనష్టం జరగలేదని భావిస్తున్నారు. అయితే పేలుడు తరువాత రసాయనాల వాయువుతో 18 మంది స్పృహ తప్పారు. వారందరినీ శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. పురుగు మందులు తయారుచేసే ఈ పరిశ్రమలో సంభవించిన భారీ పేలుడుతో వందల మీటర్ల దూరం వరకూ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. మరో రియాక్టర్‌ పేలిపోయే ప్రమాదముందని భావించిన కార్మికులు పరిశ్రమ ఆవరణ నుంచి పరుగులు తీశారు. పేలుడు అనంతరం పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. పేలుడు సంభవించిన కొద్దిక్షణాల్లోనే రసాయనాలతో కూడిన దట్టమైన పొగ కిలోమీటర్ల పొడవునా వ్యాపించింది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇళ్లు విడిచి భయంతో పరుగులు తీశారు. ప్రమాదంలో పదుల సంఖ్యలో కార్మికులు చనిపోయి ఉంటారని భయాందోళనలూ మిన్నంటాయి. ఎవరూ మరణించలేదని ప్రమాదం జరిగిన నాలుగు గంటల తరువాత యాజమాన్య ప్రతినిధి ప్రకటించినప్పటికీ స్థానికులు విశ్వసించలేదు. ఐదో బ్లాకులోని నాలుగో అంతస్తులో రియాక్టర్‌ పేలుడు సమయంలో ఎంతమంది కార్మికులు ఉన్నారన్న విషయాన్ని యాజమాన్యం దాచిపెట్టింది. జనరల్‌ షిఫ్ట్‌లో 60 మంది పనిచేస్తారని సమాచారం. ఈ ప్రమాదంలో రూ.10 కోట్లు ఆస్తినష్టం జరిగి ఉంటుందని యాజమాన్యం అంచనా.

ప్రమాదం ఎందుకు జరిగిందంటే...
థమైదల్‌ సల్ఫాక్సైడ్‌, క్లోరోసైనాక్సిడ్‌ కలిసివున్న 10 కిలోలీటర్ల సామర్థ్యం కలిగిన రియాక్టర్‌ను 140 డిగ్రీల ఉష్ణోగ్రత స్థాయికి తీసుకెళ్తారు. దానిని కంప్యూటర్‌ ద్వారా టిఇఎస్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తారు. 140 డిగ్రీల ఉష్ణోగ్రతకు చేరుకున్న తరువాత ఆ వేడిని రెండు గంటలపాటు స్థిరంగా ఉంచుతారనీ, 140 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రత పెరిగినందునే పేలుడు సంభవించి ఉంటుందని పరిశ్రమ ప్రతినిధులు జిల్లా అధికారులకు వివరించారు.
సాయంత్రానికి అదుపులోకి మంటలు
మంటలను అదుపుచేసేందుకు పరిశ్రమ వద్ద ఎటువంటి రక్షణ పరికరాలూ లేవు. మంటలను అదుపు చేసేందుకు శ్రీకాకుళం నుంచి ఆరు ఫైర్‌ ఇంజన్లు చేరుకున్నా నాలుగో అంతస్తు వరకూ నీటిని చిమ్మే సామర్థ్యం వాటికి లేకపోయింది. మధ్యాహ్నం రెండు గంటల వరకూ మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. ప్రమాద ఘటన తెలుసుకున్న జిల్లా కలెక్టర్‌ జి.వెంకటరామిరెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ పి.భాస్కర్‌ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని ప్రత్యక్షంగా చూసిన తరువాత విజయనగరం నుంచి మరో నాలుగు ఫైర్‌ ఇంజన్లనూ, విశాఖపట్నం నుంచి పది హైడ్రాలిక్‌ ప్లాట్‌ఫామ్‌ ఉన్న ఫైర్‌ ఇంజన్లతోపాటు మొత్తం 20 ఫైర్‌ ఇంజన్లను రప్పించారు. ఇవన్నీ వినియోగించిన తరువాతే మంటలు అదుపులోకి వచ్చాయి. ఆ తరువాత రెస్క్యూ బృందం పేలుడు సంభవించిన గదిలోకి ప్రవేశించి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని నిర్ధారించింది. రసాయనాల వాయువుతో స్పృహ తప్పిన కార్మికులను, గాయపడిన కార్మికులను 18 మందిని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. వారిలో ఆర్‌వి.రమణాచార్యులు, ఎన్‌.రమణయ్య, పి.జగదీష్‌ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో విశాఖలోని కళా ఆసుపత్రికి తరలించారు.
20 గ్రామాలు ఖాళీ చేయాలని ఆదేశాలు
పేలుడుతో సుదూర ప్రాంతం వరకూ దట్టమైన పొగలు కమ్ముకోవడంతో పరిశ్రమ పరిధిలోని 20 గ్రామాల ప్రజలను ఖాళీచేయాలని జిల్లా అధికారులు ఆదేశాలు జారీచేశారు. అప్పటికే చాలామంది పరుగులు తీయడంతో మిగిలినవారిని లారీలపై శ్రీకాకుళం తీసుకొచ్చారు. భయంతో ఇళ్ళు విడిచిన తరువాత ఒక్కసారిగా ఆయా గ్రామాల్లో దొంగతనాలు జరిగాయి. వృద్ధులను కొట్టి ఇళ్లల్లో చొరబడి దొంగతనాలు చేశారు. వివిధ గ్రామాల నుంచి అందిన సమాచారం మేరకు సుమారు రూ.లక్ష నగదు, 30 తులాల బంగారం దొంగల పాలైనట్లు సమాచారం.
పరిసర ప్రాంతాల వారి ఆందోళన
ప్రమాద తీవ్రతను చూసి పరిశ్రమలో పనిచేస్తున్న తమ వారికి ఏమైందోనన్న ఆందోళనతో చుట్టుపక్కల గ్రామాలతోపాటు సుదూర ప్రాంతాల నుంచి వందలాదిమంది పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. జనాన్ని అదుపు చేసేందుకు పోలీసులు పలుమార్లు లాఠీఛార్జీ చేశారు. ఈ సందర్భంగా కేశవదాసుపురం, అరిణాం అక్కివలస, జాస్తిపేట గ్రామాలకు చెందిన జనం అధికసంఖ్యలో పరిశ్రమవద్దకు చేరుకున్నారు. పరిశ్రమ వల్ల తమకు అనేక కష్టనష్టాలు ఎదురౌతున్నాయనీ, నీరు కలుషితమైందనీ, పరిశ్రమను ఎత్తివేయడమే పరిష్కారమనీ నినాదాలు చేశారు. సాయంత్రం ఎచ్చెర్ల కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మీసాల నీలకంఠంనాయుడు ప్రమాద స్థలానికి చేరుకోగా, ఆయనను చుట్టుముట్టారు. 'ఉదయం ప్రమాదం సంభవిస్తే ఎంతమంది చనిపోయారో చూసేందుకు ఇప్పుడొచ్చావా..!' అని పత్రికలో రాయలేని విధంగా దూషించారు. 'యాజమాన్యం వద్ద ఎన్ని సూట్‌ కేసులు అందుకున్నావు' అని నిలదీశారు. రాత్రి ఏడు గంటల వరకూ ప్రజలు నిరసన కొనసాగించారు. చివరికి ఆర్డీఓ దామోదరరావు వచ్చి ప్రమాదంలో ఎవ్వరూ మృతిచెందలేదనీ, గాయపడిన వారిని చికిత్సకు తరలించామనీ వివరించడంతో జనం శాంతించారు.
నిపుణులతో విచారణ చేయించాలి : సిపిఎం డిమాండ్‌
నాగార్జున అగ్రికమ్‌ పరిశ్రమలో రియాక్టర్‌ పేలుడుకు భద్రతా వైఫల్యం, యాజమాన్యం బాధ్యతారాహిత్యమే కారణమని సిపిఎం జిల్లా కమిటీ స్పష్టం చేసింది. జిల్లా కార్యదర్శి భవిరి కృష్ణమూర్తి, కార్యదర్శివర్గ సభ్యులు పంచాది పాపారావు, కె.శ్రీనివాస్‌, కె.నారాయణరావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రసాయనాల పరిశ్రమలో అగ్నిమాపక వ్యవస్థ లేకపోవడం తీవ్రమైన తప్పిదమని విమర్శించారు. ఇప్పుడైనా పరిశ్రమల భద్రతా వ్యవస్థపై, ప్రమాదంపై నిపుణులతో సమగ్ర దర్యాప్తు చేయించాలనీ డిమాండ్‌ చేశారు. గాయపడిన వారికి రూ.ఐదు లక్షలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలనీ కోరారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ.అజరుశర్మ మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు నిర్దిష్ట చర్యలు తీసుకోవాలనీ డిమాండ్‌ చేశారు. టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు కె.ఎర్రన్నాయుడు, ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గోవిందరావు, మాజీ ఎమ్మెల్సీ గొర్లె హరిబాబు తదితరులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు.