NEWS

Blogger Widgets

1.7.12

మళ్లీ రెడ్డి కార్పెట్‌





కాంగ్రెస్‌ నాయకత్వం తనకు వరసగా తగులుతున్న ఎదురుదెబ్బల నేపథ్యంలో తన పాత సంప్రదాయ ఓటు బ్యాంకును కాపాడుకునేందుకే మొగ్గుచూపుతోంది. కొన్ని దశాబ్దాల నుంచి రెడ్డి సామాజికవర్గం తన శాశ్వత ఓటు బ్యాంకుగా ఉన్నప్పటికీ,....
జగన్‌ పార్టీ స్థాపించిన నేపథ్యంలో ఆ వర్గం జగన్‌ వెైపు మళ్లుతున్న పరిస్థితిని గమనించి,తాము ఎట్టి పరిస్థితి లోనూ రెడ్డి ఓటు బ్యాంకును వదలుకోకూడదని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే.. నాయకత్వ మార్పు అనంతరం కూడా మళ్లీ రెడ్డి నేతకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని భావి స్తున్నట్లు సమాచారం. దానికితోడు కాం గ్రెస్‌ నాయకత్వం రెడ్డి వర్గాన్ని విస్మరిస్తోందన్న ఆరోపణలకు తెరదింపాలంటే మళ్లీ ఆ వర్గానికే సీఎం పీఠం ఇవ్వాలని యోచిస్తున్నట్లు ఢిల్లీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉప ఎన్నికల ఫలితాలు, జగన్‌ దూకుడు, తగ్గిపోతున్న ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో నాయకత్వ మార్పు చేయాలని భావిస్తున్న నాయకత్వం మళ్లీ తన చూపును రెడ్డి సామాజికవర్గంపెైనే మళ్లిస్తున్నట్లు తెలుస్తోంది.నాయకత్వ మార్పు జరిగిన తర్వాత కూడా రెడ్డి వర్గానికే ముఖ్యమంత్రి పీఠం అప్పగించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇప్పటికే తెలంగాణ నేతకు అవకాశం ఇవ్వాలని భావించింది.అందులో భాగంగా తెలంగాణ రెడ్డి వర్గంలో పట్టు, పలుకుబడి ఉన్న సీనియర్‌ మంత్రి జానారెడ్డికి పగ్గాలు అప్పగించాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. జానారెడ్డికి అవకాశం ఇస్తే ఆయన తెలంగాణలోని రెడ్లతో పాటు కొన్ని జిల్లాల్లో రాజకీయంగా ఆధిపత్యం చెలాయిస్తున్న వెలమలను కూడా సమన్వయం చేసుకుంటారని అధిష్ఠానం అంచనా వేస్తోంది. ఆయన చొరవతోనే తెలంగాణ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆవిర్భవించిన విషయంతో పాటు, తెలంగాణలో రెడ్డి వర్గానికి ఇప్పటివరకూ జానారెడ్డి పెద్దదిక్కుగా వ్యవహరిస్తున్న విషయాన్ని కూడా నాయకత్వం పరిగణనలోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. నిజానికి.. రాష్ట్రంలో రెడ్డి సామాజికవర్గం జనాభా 4 . 5 శాతం మాత్రమే ఉన్నప్పటికీ, ఉత్తరాంధ్రలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, కోస్తాలో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, తెలంగాణలో హైదరాబాద్‌ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ రెడ్డి సామాజికవర్గ అధిపత్యం ఎక్కువన్నది నిర్వివాదం.

జనాభా తక్కువగా ఉన్నప్పటికీ, రాజకీయాలను శాసించి, విజయం నిర్దేశించే స్థాయి ఉన్న రెడ్డి సామాజికవర్గంలో..జగన్‌ వెైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ స్థాపించిన తర్వాత మార్పు రావడం కాంగ్రెస్‌ నాయకత్వాన్ని కలవరపెట్టింది. దానికి కారణం చిరంజీవి రాకతో నాయకత్వం రెడ్లను పక్కకుపెట్టి, కాపులను ప్రోత్సహిస్తోందన్న ప్రచారంతో రెడ్డి వర్గమంతా జగన్‌ వెైపు వెళుతోందని గ్రహించిన నాయకత్వం తిరిగి రెడ్లకే నాయకత్వ పగ్గాలు అప్పచెప్పడం ద్వారా ఆ వర్గం ఓటు బ్యాంకును కాపాడుకోవాలని నిర్ణయించుకుంది.జగన్‌ పార్టీ స్థాపించకముందు వరకూ ‘కాంగ్రెస్‌పెై రెడ్డి పార్టీ’ అన్న ముద్ర ఉన్న విషయం బహిరంగమే. అయితే, జగన్‌ పార్టీ స్థాపించిన తర్వాత రెడ్లలో ‘ఒక తరహా ఐక్యత’ రావడం, ఫలితంగా ఉప ఎన్నికల్లో ఆయన పార్టీ ఘన విజయం సాధించడం, రెడ్డి సామాజికవర్గానికి చెందిన ద్వితీయ శ్రేణి నేతలంతా పార్టీని విడిచి జగన్‌ గూటిలో చేరడం వంటి పరిణామాలతో కాంగ్రెస్‌ ఖంగుతినవలసి వచ్చింది.రెడ్లను పార్టీ పక్కకుపెట్టి కాపులను ప్రోత్సహిస్తుందన్న ప్రచారం వల్లే రెడ్డి వర్గీయులు జగన్‌ వెైపు వెళుతున్నారని, దానికితోడు రెడ్లలో అందరినీ సమన్వయపరచగల స్థాయి నేత కూడా లేకపోవడంతో జగన్‌ పార్టీ ఘన విజయం సాధించిందని నాయకత్వానికి పలువురు రెడ్డి నేతలు విశ్లేషణ చేశారు. ఈ అనూహ్య మార్పునకు కారణం.. వెైఎస్‌ స్ధాయిలో కాకపోయినా కనీసం ఆ స్థాయి రెడ్డి నేత ఆ సామాజికవర్గంలో ప్రత్యామ్నాయంగా కనిపించకపోవడమే అందుకే ఇప్పుడు పార్టీ నాయకత్వం జానారెడ్డి వెైపు చూస్తున్నట్లు చెబుతున్నారు. భవిష్యత్తులో జగన్‌ను ఎదుర్కోవాలంటే ముందు..రెడ్డి సామాజికవర్గంలో ఇమేజ్‌ ఉన్న సీనియర్‌ అవసరమని పార్టీ నాయకత్వం గ్రహించినట్లు కనిపిస్తోంది.రెడ్డి నేతలను ఒక్కతాటిపెైకి తీసుకురావడం,వారితో కిందిస్థాయి రెడ్డి వర్గాలు జగన్‌ వెైపు వెళ్లకుండా నిరోధింపచేయడం,కాంగ్రెస్‌పెై ఉన్న రెడ్డి ముద్రను కొనసాగించే స్ధాయి ఉన్న నేతతో పరిస్థితిని చక్కబెట్టడం అధిష్ఠానం లక్ష్యంగా కనిపిస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అందుకు వయసు, అన్ని ప్రాంతాల రెడ్డి నేతలతో సత్సంబంధాలున్న సీనియర్‌ నేత కావాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే.. సీనియర్‌ మంత్రి జానారెడ్డి పేరు ప్రముఖంగా పరిశీలనకు తీసుకుంటున్నట్లు ఢిల్లీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జానారెడ్డికి తెలంగాణలోని రెడ్డి వర్గంతో పాటు, సీమాంధ్రలోని రెడ్డి వర్గ నేతలతోనూ సన్నిహిత సంబంధాలు ఉండటంతో పాటు, గతంలో తెలుగుదేశంలో చాలాకాలం పనిచేసిన నేపథ్యంలో.. కమ్మ వర్గంతోనూ ఆయన సన్నిహితంగా వ్యవహరిస్తున్న విషయాన్ని నాయకత్వం గుర్తించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో వెలమ నేతలతోనూ జానాకు ఉన్న పరిచయాలను నాయకత్వం పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.జగన్‌ పార్టీ తెలంగాణలోనూ కాలుపెట్టాలని ప్రయత్నిస్తోన్న నేపథ్యంలో.. ఇటీవల జరిగిన పరకాల ఉప ఎన్నికలో ఆ పార్టీకి రెండవస్థానం లభించడం నాయకత్వాన్ని ఆలోచనలో పడవేసింది. ఇప్పటికే చాలామంది తెలంగాణ రెడ్డి నేతలు జగన్‌తో టచ్‌లో ఉన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌, జీవన్‌రెడ్డి వంటి ప్రముఖుల పేర్లు బాహాటంగానే వినిపిస్తున్నాయి. పార్టీలో సంక్షోభం తలెత్తితే వారంతా జగన్‌ పార్టీ వెైపు దూకేందుకు సిద్ధంగా ఉన్న విషయాన్ని నాయకత్వం గ్రహించింది. అందులో కొందరు ఎంపీలు, మరికొందరు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా ఉన్నట్లు తెలుసుకున్న నాయకత్వం, తెలంగాణ రెడ్డికే పట్టం కట్టాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. అందులో భాగంగా.. సీనియర్‌ అయిన జానారెడ్డికి అవకాశం ఇవ్వడం ద్వారా రెడ్లను సంతృప్తి పరచవచ్చని యోచిస్తోంది.అయితే, జానారెడ్డితో పాటు మర్రి శశిధర్‌రెడ్డి, కెప్టెన్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి కూడా ముఖ్యమంత్రి పీఠంపెై ఆశలు పెట్టుకున్నారు. శశిధర్‌రెడ్డిపెై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకపోయినా, ఆయనకు పార్టీలో అంతపెద్దగా మద్దతు లేదంటున్నారు.పెైగా రెడ్డి వర్గంతోనూ ఆయనకున్న సంబంధాలు అంతంతమాత్రమేనని, తండ్రి చెన్నారెడ్డితో సన్నిహిత సంబంధాలున్న వారితో తప్ప, ఈ తరం రెడ్డి నేతలతో పెద్దగా సంబంధాలు లేవంటున్నారు. మేధావిగా ఉన్న పేరు తప్ప, మాస్‌లో అంతంతమాత్రమేనని గుర్తు చేస్తున్నారు. అటు కెప్టెన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపెై సైతం ఎలాంటి అవినీతి మచ్చ లేదు. పెైగా ఆయనకు అధిష్ఠానం వద్ద కొంతమేరకు సంబంధబాంధవ్యాలున్నాయి. అయితే, ఆయనకూ శశిధర్‌రెడ్డి మాదిరిగానే రెడ్డివర్గంతో పెద్దగా సంబంధాలు లేవని చెబుతున్నారు. యువకుడు-రెడ్డి-తెలంగాణ కోణంలో ఆలోచిస్తే తప్ప, కెప్టెన్‌కు అవకాశాలు తక్కువంటున్నారు. జానారెడ్డికి సీఎం పదవి దక్కకుండా ఆయన ప్రత్యర్ధులు కెప్టెన్‌ను ఒక అస్త్రంగా ప్రయోగిస్తున్నారన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.