NEWS

Blogger Widgets

1.7.12

నిబంధనల మేరకే కృష్ణా డెల్టాకు నీరు


హైదరాబాద్, జూన్ 30: కృష్ణా డెల్టాలో సాగుకు నీరు అందించడాన్ని వివాదాస్పదం చేయడం సరికాదని నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి స్పష్టం చేశారు. నిబంధనలకు అనుగుణంగానే నీటిని కేటాయించినట్లు వివరించారు...
. గత దశాబ్దకాలంగా అనుసరించిన విధానానే్న ఇప్పుడు కూడా అవలంభించినట్లు చెప్పారు. అప్పుడు కూడా నాగార్జున సాగర్ నుంచి కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేసిన సమయంలో సాగర్‌లో ఉన్న నీటిమట్టమే ఇప్పుడు కూడా ఉందన్నారు. అప్పట్లో 500 నుంచి 550 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడు నీరు విడుదల చేశామని, ఇప్పుడు నీరు విడుదల చేసేందుకు నిర్ణయించిన సమయంలో కూడా నీటిమట్టం 511.10 అడుగులుగా ఉందని గణాంకాలతో గుర్తుచేశారు.
సాధారణంగా కృష్ణా డెల్టాకు ఎప్పుడూ జూన్ మూడు, నాలుగు వారాల మధ్య నీటిని విడుదల చేయడం జరుగుతోందని, ఈసారి కొద్దిగా జాప్యం జరిగిందని వివరించారు. ప్రస్తుతం విడుదల చేస్తున్న నీరు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరి నారుమళ్లతో పాటు రెండు జిల్లాల్లో తాగునీటి కోసం ఉపయోగించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో కృష్ణా డెల్టాకు నీరు అందించే సమయంలోనే సాగర్‌లో అందుబాటులో ఉండే నీటిని జంటనగరాలు, ఇతర ప్రాంతాల్లో తాగునీటి అవసరాలకు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని వివరించారు.
రాజకీయం చేయవద్దు : మంత్రి పార్థసారధి
కృష్ణా డెల్టాలో ఖరీఫ్ నారుమళ్లకు నాగార్జునసాగర్ నుంచి నీటిని విడుదల చేయడంపై తెలంగాణ ప్రజాప్రతినిధులు ప్రాంతీయ వివాదాన్ని రేకెత్తించడం దురదృష్టకరమని ఎక్సైజ్, మాథ్యమిక విద్యా శాఖ మంత్రి పార్థసారథి ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఆయన సచివాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తాగునీటి సమస్య నివారించడంతో పాటు నారుమళ్లకు సాగునీరు విడుదల చేశారన్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధులు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. కృష్ణా డెల్టాలో నారుమళ్లకు నీరు విడుదల చేయడం కొత్త విషయం కాదన్నారు. జంట నగరాల్లో తాగునీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా చూస్తూనే ప్రభుత్వం ముందు జాగ్రత్తగా చర్యలు చేపట్టిందన్నారు. వర్షాలు కురిసే వరకు ఎదురుచూస్తే నవంబర్, డిసెంబర్‌లో వచ్చే తుపాను ప్రభావంతో కృష్ణా డెల్టాలో వరి సాగు దెబ్బతింటుదని, కనుక ముందు చూపుతోనే ప్రస్తుతం సాగునీరు విడుదల చేశారన్నారు.
అఖిలపక్ష సమావేశానికి నాగం డిమాండ్
రాష్ట్రంలో ప్రస్తుతం జలాశయాల్లో ఉన్న సాగునీటిపై చర్చిండానికి తక్షణం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆయన సచివాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ, కృష్ణా డెల్టా నారుమళ్లకు సాగునీరు విడుదల చేయడాన్ని తాము రాజకీయం చేయడం లేదన్నారు. అయితే తెలంగాణలోని ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఉన్న వందలాది గ్రామాల్లో తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా చూడాలన్నదే తమ అభిమతం అన్నారు. నాగార్జునసాగర్‌లో నీటిమట్టం 511 అడుగులకు తగ్గిపోతే పంపింగ్ హౌస్ వద్ద నీటి లభ్యత ఉండదన్నారు.
దీంతో హైదరాబాద్ జంట నగరాలకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఏర్పడతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ముందుచూపు లేకపోవడం వల్లనే ప్రస్తుతం సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. కృష్ణా బేసిన్ జలాశయాల్లో నీటి మట్టం కనిష్ఠ స్థాయికి పడిపోయిందన్నారు. వర్షాభావంతో తాగునీటికి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.