NEWS

Blogger Widgets

9.6.12


తిరుపతి, ఫిబ్రవరి 2: షిర్డీ సాయి స్వర్ణపాదుకలను హిందువులు కలియుగ ప్రత్యక్షదైవంగా భావించే శ్రీ వెంకటేశ్వరుని ఆలయంలోనికి తీసుకువెళ్లడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే టిటిడి అధికారులు శ్రీవారి ఆలయంలో ఆగమాలను ఉల్లంఘిస్తున్నారంటూ త్రిదండి చినజీయర్ విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో మరో వివాదం చోటు చేసుకోవడం టిటిడి ఉద్యోగుల్లో కూడా తీవ్ర కలవరం రేపుతోంది. శ్రీవారి ఆలయానికి సంబంధించి వస్తున్న అనేక వివాదాల్లో అత్యధిక
శాతానికి పాలకమండళ్ల చైర్మన్లు, సభ్యులే కేంద్ర బిందువులుగా మారుతుండటం గమనార్హం. తాజాగా బుధవారం రాత్రి టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు తిరుపతి నుండి కాలినడకన షిర్ట్భీక్తులు ఊరేగింపుగా తీసుకువచ్చిన సాయి పాదుకలను శ్రీవారి ఆలయంలోనికి వెళ్లడమే ఇందుకు నిదర్శనం. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలకు పాదరక్షలతో వెళ్లడమే మహాపాపమని భావించిన రామానుజాచార్యులు మోకాళ్లతో తిరుమలకు వెళ్లినట్లు పురాణాలు చెపుతున్నాయి. అలాంటిది షిర్టీసాయి పాదుకలను నాలుగుమాడావీదుల్లో ఊరేగించి ఆలయంలోనికి ఎలా తీసుకువస్తారని శ్రీవారి భక్తులు తీవ్ర స్థాయిలో
మండిపడుతున్నారు. కాగా నాలుగుమాడా వీధుల్లో శ్రీవారి భక్తులు సైతం పాదరక్షలతో నడవకూడదన్న నిషేదాన్ని కూడా టిటిడి విధించింది. సాక్షాత్తు మూలవిరాట్టుకు ప్రతిరూపాలైన ఉత్సవ మూర్తులు ఊరేగించే పురమాడావీధుల్లో షిర్డీసాయి పాదుకలను ఊరేగించడం పెద్ద వివాదానికి తెరలేపింది. సాయి పాదుకలను ఆలయంలోనికి తీసుకువెళ్లడంపై విశాఖ శారదాపీఠం స్వరూపానందేంద్రస్వామి, హిందూ దేవాయాల ప్రతిష్ఠాన పీఠం అధిపతి కమలానందభారతీ తీర్థస్వామి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం పాలకుల అజానానికి, అధికార దర్పానికి పరాకాష్ట అని నిప్పులు చెరుగుతున్నారు. పలు రకాల కారణాలు చూపుతూ అధికారులు ఆలయ సంస్కృతి, సాంప్రదాయాలను మంటగలుపుతున్నారని ధ్వజమెత్తుతున్నారు. ఇలాఉంటే ఆలయ పూజావిధానాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆగమ సలహామండలి కూడా కేవలం పాలకమండలి చేతిలో కీలుబొమ్మగా తయారైందనే విమర్శలు వస్తున్నాయి.

ఊహించని రీతిలో టిటిడి చైర్మన్ పదవి దక్కించుకున్న కనుమూరి

బాపిరాజు దంపతులు ధార్మిక చింతన కల్గిన వారని టిటిడిలో ఎలాంటి అక్రమాలు, అపచారాలకు ఇక తావులేదనే భావన సగటు భక్తుల్లోనూ, ఉద్యోగుల్లోనూ వ్యక్తం అయ్యింది. అయితే బాపిరాజు ఏడాది పదవీ కాలంలో ఇప్పటికే నాలుగుమాసాలు పూర్తి చేసుకున్నారు. ఈ  నేపథ్యంలో శ్రీవారికి ఏడాదికి రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామంటూ చేసిన ప్రకటన వివాదస్పదమైంది. రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని తాను ఒత్తిడి చేయనని కూడా స్పష్టం చేశారు. ఏది ఎమైనా అదికారం ముందు ఆగమాలు, శాస్త్రాలు, చట్టాలు దిగదుడుపుగా మారుతుండటం సగటు హిందువులను కలవరపెడుతున్నమాట అక్షర సత్యం.

సంప్రదాయాన్ని మంటగలిపారు
- శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి -
విశాఖపట్నం, ఫిబ్రవరి 2: తిరుమల వెంకటేశ్వరుని సన్నిధికి షిర్డీ

సాయిబాబా పాదుకలు తీసుకువెళ్ళి అక్కడి ఆచార, సంప్రదాయాలను మంటకలిపారని విశాఖ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర  సరస్వతి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ‘ఆంధ్రభూమి’తో మాట్లాడారు. విష్ణు సన్నిధికి, శివుని పాదాలు, శఠగోపాలు తీసుకువెళ్ళరని, అలాగే శివుని వద్దకు విష్ణువు శఠగోపాలు తీసుకువెళ్ళరని తెలిపారు. పురాణాల్లో ఆయా మూర్తుల విశిష్ఠతలను  వర్ణించి, విడి విడిగా దేవాలయాలు నిర్మించారని అన్నారు. సాయిని అవదూతగా, దత్రాత్రేయుని అవతారంగా తాము కూడా భావిస్తామని స్వరూపానందేంద్ర అన్నారు. అయితే ఆగమ శాస్త్ర విరుద్ధంగా ఇలా సాయి పాదుకలను వెంకటేశ్వరుని సన్నిధికి తీసుకువెళ్ళడం అపచారమని అన్నారు. టిటిడి చైర్మన్ బాపిరాజు ఆలయ
సంప్రదాయాలను మంటకలిపారని అన్నారు. ఇంత జరుగుతున్నా, ఆగమ శాస్త్ర పండితులు, ఆలయ పురోహితులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఇదిలా ఉండగా చిన జీయరు స్వామి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని స్వరూపానందేంద్ర సరస్వతి ధ్వజమెత్తారు. తిరుమలో సంప్రదాయాలు మంట కలుస్తున్నాయని, ఇందుకోసం లక్ష మందితో తిరుమలకు చేరుకుని, వెంకటేశ్వరుని దర్శించుకోకుండానే తిరిగి వస్తానన్న చినజీయరు స్వామి, ఇప్పుడు మాట మార్చి, స్వామిని దర్శించుకుని వస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. చినజీయరుస్వామి ఎవరికోసం ఈ దండయాత్ర సాగిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. తిరుమలను ఒక క్లబ్‌గా వర్ణించిన జీయరుస్వామి ఇప్పుడు అక్కడికి ఏవిధంగా వెళుతున్నారని ప్రశ్నించారు. తిరుమలలో అపచారం జరిగితే, అక్కడున్న వైదికులు, పీఠాధిపతులు తదితరులను
సమావేశపరచి, అంతర్గతంగా వాటి విషయమై చర్చించాలే తప్ప, ఈ విధంగా ఆందోళనలు చేయడం తగదని స్వరూపానందేంద్ర హితవు పలికారు. జీయరు చర్యలు అమాయ భక్తులను తప్పుతోవపట్టిస్తున్నాయని ఆయన అన్నారు. ఒక విధంగా హిందూమతంపై ఆయన దాడి చేస్తున్నట్టుందని స్వరూపానందేంద్ర అన్నారు.