NEWS

Blogger Widgets

9.6.12

లిక్కర్ సిండికేట్స్: ఎమ్మెల్యేలకు ఎసిబి నోటీసులు


 Acb Issues Notice Mlas
హైదరాబాద్: మద్యం సిండికేట్ల వ్యవహారంలో ముగ్గురు శానససభ్యులకు అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) నోటీసులు జారీ చేసింది. ప్రస్తుత ఎమ్మెల్యేలు కవిత, సండ్ర వెంకట వీరయ్య, వెలగపూడి రామకృష్ణ ఎసిబి ఈ నోటీసులు జారీ చేసింది. ఈనెల 18, 19, 20 తేదీల్లో విచారణకు హాజరుకావాలని ఎసిబి వారిని ఆదేశించింది. వారితో పాటు మాజీ శానససభ్యులు చెన్నకేశవరెడ్డి, సిపిఐ నాయకుడు పువ్వాడ నాగేశ్వర రావులకు, మంత్రి ధర్మాన ప్రసాదరావు కుమారుడు రామ్మోహన్‌కు బంధువు చిన్నాకు కూడా నోటీసులు ఎసిబి నోటీసులు జారీ అయ్యాయి.
లిక్కర్ సిండికేట్ల వ్యవహారంలో అరెస్టయిన నున్నా వెంకటరమణ ఇచ్చిన వాగ్మూలం ఆధారంగా నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది. వారంతా నున్నా వెంకటరమణ నుంచి ముడుపులు స్వీకరించినట్లు చెబుతున్నారు.మరో 16 మంది శాసనసభ్యులకు కూడా నోటీసులు జారీ చేయడానికి ఎసిబి రంగం సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిలో వివిధ జిల్లాలకు చెందినవారున్నారని చెబుతున్నారు.
మంగళవారం రాత్రి నుండి అకస్మాత్తుగా పలు జిల్లాల్లో ఎసిబి లిక్కర్ సిండికేట్లపై దాడులు నిర్వహించింది. తూర్పు గోదావరి, కడప, మెదక్, అనంతపురం, నల్గొండ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తదితర జిల్లాలలో మద్యం వ్యాపారులపై దాడులు చేసిన ఎసిబి పలువురుని తమ అదుపులోకి తీసుకుంది. మెదక్ జిల్లా మద్యం వ్యాపారి కరుణాకర్ రెడ్డిని సిబిఐ అదుపులోకి తీసుకొని అతనిని హైదరాబాదుకు తరలించింది.
ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలో ఏడుగురు, అనంతపురం జిల్లాలో నలుగురు, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కొక్కరిని మద్యం వ్యాపారులను ఎసిబి బుధవారం అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కోదాడలో మద్యం సిండికేటు కార్యాలయం అకౌంటెంట్ నాగేశ్వర రావును అదుపులోకి తీసుకున్నారు. ఇతనిని కూడా హైదరాబాదుకు తరలించారు. మెదక్‌లో అదుపులోకి తీసుకున్న కరుణాకర్ రెడ్డికి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో బినామీ పేర్ల మీద మద్యం షాపులు ఉన్నట్లుగా ఎసిబి గుర్తించినట్లుగా తెలుస్తోంది.
ప్రకాశం జిల్లా చీరాలలో కోడారి ధర్మారావును, కరీంనగర్ జిల్లాలో రంగారావును, నిజామాబాద్ జిల్లాలో దేవీదాస్‌ను, కర్నూలు జిల్లా డోన్‌లో కెఈ మాధవ కృష్ణను, కాకినాడలో వెంకటేష్‌ను, దొరబాబును, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో సుబ్బారావు, కడపలో శ్రీనివాసులు రెడ్డిని, కర్వూలు జిల్లా నందికొట్కూరులో నాగేశ్వర రావును తదితర వ్యాపారులను ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏలూరు సుబ్బారావును విజయవాడకు తరలించారు.