NEWS

Blogger Widgets

6.6.12

జూ ఎన్టీఆర్‌తో ‘రాముడు-భీముడు’, వారసులతో ఓ సినిమా : రామానాయుడు

Ramanaidu Plans On Ramudu Bheemudu Remake
మూవీ మొఘల్ రామానాయుడు నేడు(జూన్ 6) డెభ్బైఆరవ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. బహుభాషల్లో చిత్రాల్ని నిర్మించి శతాధిక చిత్ర నిర్మాతగా భారతీయ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన తన పుట్టిన రోజును పురస్కరించుకుని మీడియాతో ముచ్చటించి తన మసులోని భావాలను పంచుకున్నారు.
1963లో ఎన్టీఆర్ కథానాయకుడిగా ‘రాముడు-భీముడు'చిత్రాన్ని నిర్మించాను. ఆ సినిమా విడుదలై ఇప్పటికి యాభైఏళ్లు గడచిపోయాయి. అందులో ఎన్టీఆర్, జమునల అభినయం తలచుకుంటే ఆనందం ఉప్పొంగుతుంది. టీవీల్లో ఎప్పుడైనా ఆ సినిమా చూస్తే కళ్ల నీళ్లు వస్తాయి. త్వరలోనే మళ్లీ ‘రాముడు-భీముడు' రీమేక్ చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.
జూనియర్ ఎన్టీఆర్ అయితేనే కథానాయకుడిగా ‘రాముడు-భీముడు' సినిమాకు న్యాయం చేయగలడని నా అభిప్రాయం. ఓ సందర్భంలో జూ ఎన్టీఆర్ దగ్గర ‘రాముడు-భీముడు' రీమేక్ గురించి మాట్లాడాను. తప్పకుండా చేద్దాం అంకుల్ అని అతను చెప్పాడు. మా సంస్థకు ఎన్టీఆర్ ‘రాముడు-భీముడు' విత్తనమైతే, ఏఎన్నార్ ‘ప్రేమనగర్' ఓ వృక్షంలాంటిది. మా సంస్థ కీర్తికిరీటంలో ఆ రెండు చిత్రాలు కలికితురాళ్లలా నిలిచిపోయాయని రామానాయుడు చెప్పుకొచ్చారు.
తన వారసులతో కలిసి కూడా ఓ సినిమా చేయాలని ఉందని చెప్పిన రామానాయుడు....‘మా అబ్బాయి వెంకీ మనవలు రానా, నాగచైతన్యలతో ఓ సినిమా చేయాలన్నది నా చిరకాల కోరిక. అదే నా డ్రీమ్ ప్రాజెక్ట్. మేం నలుగురం కలసి త్వరలో ఓ సినిమాలో నటిస్తాం. మంచికథ కోసం అన్వేషణ జరుగుతోంది. ప్రస్తుతం వెంకీ రానా, నాగచైనత్య వారు ఒప్పుకున్న చిత్రాలతో బిజీగా వున్నారు. వచ్చే ఏడాది మా నలుగురి కలయికలో సినిమా ప్రారంభమవుతుంది. ఆ సినిమాకు దర్శకుడెవరనేది ఇంకా నిర్ణయించుకోలేదు. ఆ సినిమా తాలూకు అన్ని వివరాల్ని త్వరలో తెలియజేస్తాను' అన్నారు.
మా సంస్థ నిర్మించనున్న పంజాబీ చిత్రం ఈ నెల 14న ప్రారంభమవుతుంది. సెప్టెంబర్‌లో ఆ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇప్పటివరకు ఒక్క పంజాబీ తప్ప అన్ని భారతీయ భాషల్లో చిత్రాన్ని నిర్మించాను. తాజా పంజాబీ చిత్రంతో అన్ని భారతీయ భాషల్లో మా సంస్థ చిత్ర నిర్మాణంగావించడం గర్వంగా భావిస్తున్నాను. ఆ అరుదైన ఘనత మా సురేష్‌ ప్రొడక్షన్ సంస్థకే దక్కింది. చిత్ర నిర్మాణంలో వరల్డ్‌ నెం.1గా వుండాలన్న నా సంకల్పం నెరవేరిందంటూ రామానాయుడు ఆనందం వ్యక్తం చేశారు.