NEWS

Blogger Widgets

6.6.12

మద్యం సిండికేట్లపై ఎసిబి దాడులు, సాక్షిలో కథనం

 Acb Attacks On Liquor Syndicates

హైదరాబాద్: రాష్ట్రంలో మళ్లీ మద్యం సిండికేట్ వ్యాపారుల ఇళ్లపై ఎసిబి దాడులు నిర్వహిస్తోంది. మంగళవారం రాత్రి నుండి అకస్మాత్తుగా పలు జిల్లాల్లో ఎసిబి దాడులు చేస్తోంది. తూర్పు గోదావరి, కడప, మెదక్, అనంతపురం, నల్గొండ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తదితర జిల్లాలలో మద్యం వ్యాపారులపై దాడులు చేసిన ఎసిబి పలువురుని తమ అదుపులోకి తీసుకుంది. మెదక్ జిల్లా మద్యం వ్యాపారి కరుణాకర్ రెడ్డిని సిబిఐ అదుపులోకి తీసుకొని అతనిని హైదరాబాదుకు తరలించింది.
బుధవారం ఉదయం కూడా ఎసిబి రాష్ట్రవ్యాప్తంగా కొరడా ఝులిపిస్తోంది. ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలో ఏడుగురు, అనంతపురం జిల్లాలో నలుగురు, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కొక్కరిని మద్యం వ్యాపారులను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కోదాడలో మద్యం సిండికేటు కార్యాలయం అకౌంటెంట్ నాగేశ్వర రావును అదుపులోకి తీసుకున్నారు. ఇతనిని కూడా హైదరాబాదుకు తరలించారు. మెదక్‌లో అదుపులోకి తీసుకున్న కరుణాకర్ రెడ్డికి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో బినామీ పేర్ల మీద మద్యం షాపులు ఉన్నట్లుగా ఎసిబి గుర్తించినట్లుగా తెలుస్తోంది.
ప్రకాశం జిల్లా చీరాలలో కోడారి ధర్మారావును, కరీంనగర్ జిల్లాలో రంగారావును, నిజామాబాద్ జిల్లాలో దేవీదాస్‌ను, కర్నూలు జిల్లా డోన్‌లో కెఈ మాధవ కృష్ణను, కాకినాడలో వెంకటేష్‌ను, దొరబాబును, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో సుబ్బారావు, కడపలో శ్రీనివాసులు రెడ్డిని, కర్వూలు జిల్లా నందికొట్కూరులో నాగేశ్వర రావును తదితర వ్యాపారులను ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏలూరు సుబ్బారావును విజయవాడకు తరలించారు.
కాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి దిన పత్రికలో బుధవారం లిక్కర్ సిండికేట్ కేసును రాష్ట్ర ప్రభుత్వం మూసేసిందంటూ ఓ కథనం వచ్చింది. హస్తినలో చీర్స్.. మందు మాఫియా హ్యాపీస్.. కేస్.. ఖతం! అంటూ ఓ వార్తను ప్రచురించింది. తదుపరి విచారణ వద్దంటూ ఎసిబికి ఆదేశాలు అందాయని, బొత్సను బయటపడేసేందుకే ఈ నిర్ణయమని పేర్కొంది.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వార్ కారణంగా మద్యం కుంభకోణం వెలుగులోకి వచ్చిందని, అక్రమాలపై ఎసిబి అన్ని ఆధారాలు సేకరించిందని, అయితే బొత్స ఢిల్లీ పెద్దల శరణుజొచ్చడం.. సిఎంతో రాజీకీ వచ్చిన నేపథ్యంలో లిక్కర్ కేసుల దర్యాఫ్తుకు మంగళం పాడారని పేర్కొంది.