NEWS

Blogger Widgets

6.6.12

మద్యం వ్యాపారుల అరెస్ట్


హైదరాబాద్: మద్యం సిండికేట్లపై ఎసిబి మరోసారి కొరడా ఝుళిపించింది. రాష్ట్రవ్యాప్తంగా సోదాలు మొదలు పెట్టింది. పలువురిని అదుపులోకి తీసుకుంది. మరికొందరిని అరెస్ట్‌ చేసింది. దీంతో అక్రమార్కుల్లో మళ్లీ దడ మొదలైంది. ఎప్పుడు ఎవరిమీదికొస్తుందోనన్న బెంగ పట్టుకుంది.

మచిలీపట్నంకు చెందిన రాంప్రసాద్, కైకలూరుకు చెందిన సుబ్బారావు, ఏలూరుకు చెందిన సత్యనారణయణలను ఎసిబి అధికారులు అరెస్ట్ చేశారు. సుబ్బారావు, రాంప్రసాద్ లకు చెరో 13 మద్యం షాపులు, సత్యనారాయణకు 14 మద్యం షాపులు ఉన్నట్లు ఎసిబి డిఎస్ పి నరసింహారావు చెప్పారు.

ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన మద్యం వ్యాపారి కోడూరి ధర్మారావు ఇంట్లో ఉదయాన్నే ఎసిబి అధికారులు సోదాలు చేశారు. వ్యాపారానికి సంబంధించి పలు పత్రాలు అధికారులు పరిశీలించారు. వ్యాపార లావాదేవీలకు సంబంధించిన బ్యాంకు ఖాతాలు తనిఖీచేశారు. ఆ తర్వాత ధర్మారావును అదుపులోకి తీసుకొని ఒంగోలు తరలించారు.

మెదక్‌ జిల్లా గజ్వేల్‌లో మద్యం వ్యాపారి కరుణాకర్‌రెడ్డిని ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మెదక్‌, రంగారెడ్డి జిల్లాల్లో కరుణాకర్‌రెడ్డి మద్యం షాపులు నిర్వహిస్తున్నారు. మద్యం వ్యాపారాల్లో అక్రమాలు వెలికితీసేందుకు ఆయనను అదుపులోకి తీసుకొని హైదరాబాద్‌కు తరలించారు. అయితే తన భర్త పేరుమీద ఒకే మద్యం షాపు ఉందని, సిండికేట్‌తో ప్రమేయం లేదని కరుణాకర్‌రెడ్డి భార్య చెబుతోంది.

మరోవైపు నల్గొండ జిల్లా కోదాడలోనూ మద్యం సిండికేట్ల వ్యవహారంలో ఎసిబి అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. మద్యం సిండికేట్‌ ఆర్థిక లావాదేవీలు నిర్వహించే అకౌంటెంట్‌ నాగేశ్వర్‌రావును తెల్లవారు జామున అదుపులోకి తీసుకున్నారు. సిండికేట్‌ రికార్డులు, ల్యాప్‌టాప్‌, హార్డ్‌డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. నాగేశ్వర్‌రావును హైదరాబాద్‌ తరలించారు. దీంతో పట్టణంలోని మిగతా మద్యం వ్యాపారులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

చిత్తూరు జిల్లా పలమనేరులో మద్యం వ్యాపారి స్వామి అలియాస్ నాగభూషణంని కూడా ఎసిబి అధికారులు అరెస్ట్ చేశారు.