- సున్నితంగా తిరస్కరించానన్న కలాం
- ఆయన తాజా పుస్తకంలో వెల్లడి
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త ఎ.పి.జె అబ్దుల్ కలాంను 1998లో కేబినెట్ మంత్రిగా చేర్చుకోవాలని నాటి ప్రధాని అటల్ బీహారీ వాజపేయి భావించారట.....
అయితే దేశ ప్రయోజనాల దృష్ట్యా కలాం ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారట. ఈ విషయాన్ని స్వయంగా కలామే తన తాజా పుస్తకం ‘టర్నింగ్ పాయింట్స్: ఎ జర్నీ త్రూ చాలెంజ స్’లో వెల్లడించారు. ‘1998 మార్చి 15 అర్ధరాత్రి వాజపేయి నాకు ఫోన్ చేసి నన్ను కేబినెట్‌లోకి తీసుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. దీనిపై ఆలోచించుకునేందుకు ఆయన్ను సమ యం కోరా.
అయితే మర్నాడు ఉదయం కలిసి నా నిర్ణయాన్ని వాజపేయి చెప్పమన్నారు. దీంతో రాత్రి మూడు వరకూ కొందరు స్నేహితులతో ఈ అంశంపై చర్చించా. కీలక దశలో ఉన్న అగ్ని క్షిపణి వ్యవస్థ, అణు పరీక్షలపై ప్రయోగాలను డీఆర్‌డీవో చీఫ్‌గా నేను పర్యవేక్షిస్తున్నందున వీటిని విడిచి వెళ్లరాదనే అభిప్రాయం ఈ చర్చలో వ్యక్తమైంది. దీంతో మర్నాడు ప్రధాని ఇంటికి వెళ్లి ఇదే విషయాన్ని ఆయనకు వివరించా.
నా అభిప్రాయాలను గౌరవించి ముందుకెళ్లాల్సిందిగా ఆయన ప్రోత్సహించారు’ అని కలాం తన పుస్తకంలో చెప్పుకొచ్చారు. మంత్రి పదవిని తిరస్కరిస్తూ తాను తీసుకున్న నిర్ణయం దేశానికి అగ్ని క్షిపణులతోపాటు అణ్వస్త్ర సామర్థ్యాన్ని అందించేందుకు దోహదపడిందన్నారు. కాగా, ఈ పరిణామం అనంతరం కలాం 1999 నవంబర్ నుంచి 2001 నవంబర్ వరకూ కేంద్రానికి ప్రధాన శాస్త్ర సాంకేతిక సలహాదారుగా కేబినెట్ హోదా పదవిలో పనిచేశారు.
ఇదిలా ఉండగా, మద్రాస్ యూనివర్సిటీ వీసీగా పనిచేయాల్సిందిగా 1993లో నాటి తమిళనాడు గవర్నర్ మర్రి చెన్నారెడ్డి తనను ఆహ్వానించారని కలాం పేర్కొన్నారు. తన నియామకాన్ని ఆమోదించాల్సిందిగా ప్రభుత్వాన్ని కూడా కోరారని చెప్పారు. అయితే తాను అప్పటికే రక్షణశాఖకు శాస్త్ర సలహాదారుగా ఉన్నందున పదవీవిరమణ అనంతరం ఆ పదవి చేపడతానని చెప్పినట్లు కలాం గుర్తుచేసుకున్నారు. కానీ నాటి ప్రధాని, రక్షణ మంత్రి కూడా అయిన పి.వి. నరసింహారావు మాత్రం తనను శాస్త్ర సలహాదారుగానే కొనసాగాల్సిందిగా సూచించినట్లు చెప్పారు.