NEWS

Blogger Widgets

4.7.12

వీడు సామాన్యుడు కాడు..


మొత్తం విషయం చదివిన తర్వాత మీరు కూడా ఇదే మాట అంటారు. ఎందుకంటే.. మీరు ఎడారిలో చిక్కుకుపోయారనుకోండి.. మీరు ప్రయాణిస్తున్న కారు కూడా చెడిపోయింది. చుట్టూ ఎడారి. అప్పుడేం చేస్తారు? ప్రాణాలపై ఆశలు వదిలేసుకుంటారు. అంతేగా.. ఫ్రాన్స్‌కు చెందిన ఎలక్ట్రీషియన్ ఎమిలీ లీరే ఏం చేశాడో తెలుసా?...... ఆ చెడిపోయిన కారునే బైక్‌లా మార్చేసి ప్రాణాలు దక్కించుకున్నాడు! ఇంతకీ విషయమేమిటంటే.. 20 ఏళ్ల క్రితం ఎమిలీ.. మొరాకోలోని టాన్-టాన్ పట్టణం నుంచి ఎడారి గుండా తన సిట్రియాన్ కారులో బయల్దేరాడు. కొంత దూరం ప్రయాణించాక.. ఓ మిలటరీ పోస్టు వద్ద సైనికులు అతడిని ఆపేశారు. ఇదంతా నిషిద్ధ ప్రాంతమని.. ముందుకు వెళ్లడానికి వీల్లేదని చెప్పారు.

దీంతో చేసేది లేక అతడు వెనక్కు మళ్లాడు. అయితే, వేరే దారిలో ప్రయాణం సాగించాడు. ఎడారి కావడంతో రోడ్డు అంతా ఎగుడుదిగుడుగా ఉంది. ఇంతలో కారు అదుపు తప్పింది. ఓ భారీ రాయిని ఢీకొని ఆగిపోయింది. ఎటు చూసినా ఇసుకే. ఇంకెవరైనా అయితే బతుకుపై ఆశలు వదిలేసుకునేవారు. ఎమిలీ మొండోడు. కారులో చూశాడు. ఎడారి ప్రయాణమని.. ఏం దొరకదని తెలిసి.. తాను ముందుగానే కొనుగోలు చేసిన ఆహారం, నీళ్లు ఉన్నాయి.

డిక్కీలో టూల్‌కిట్, రంపపు బ్లేడు ఉన్నాడు. అంతే.. బుర్రలో బల్బు వెలిగింది. ఈ డొక్కు కారునే మోటార్ సైకిల్‌గా మార్చేయాలనుకున్నాడు. ముందు కారు బాడీని తొలగించాడు. దాన్నే టెంటులా వాడుకుని.. దాని కిందనే పడుకున్నాడు. ఎక్కువ రోజులు వచ్చేందుకు వీలుగా ఆహారం, నీళ్లు కొంచెం కొంచెం మాత్రమే తీసుకోవడం మొదలెట్టాడు. ఇక బైక్ తయారీ కోసం కారు చాసిస్‌ను చిన్న సైజులోకి మార్చాడు. ఇంజిన్, గేర్‌బాక్సును బైక్ మధ్య భాగంలో అమర్చాడు. కారు బంపర్‌ను సీటులా మార్చాడు. మొత్తమ్మీద 12 రోజుల్లో బైక్‌ను తయారుచేసేశాడు. అప్పటికే అతడు తెచ్చుకున్న ఆహారం పూర్తిగా అయిపోయింది. కేవలం అరలీటరు నీళ్లు మిగిలాయి. ఆ బైక్‌పై ఒకరోజు ప్రయాణించిన తర్వాత.. దారిలో అతడికి మొరాకో పోలీసులు కనిపించారు.

వారే అతడిని సమీప గ్రామానికి తరలించారు. మీకో విషయం తెలుసా? ఎమిలీ వద్ద కారుకు సంబంధించిన పత్రాలే ఉన్నాయని.. ఈ ‘బైక్’కు సంబంధించిన పత్రాలు లేవంటూ పోలీసులు అతడికి జరిమానా కూడా విధించారు. ఎమిలీ సాహసయాత్ర గురించి అప్పట్లో స్థానిక పత్రికల్లో వచ్చినా.. పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు. ఇటీవల ఇంటర్నెట్ సైట్లలోనూ.. మీడియాలోనూ మళ్లీ ఈ విషయం రావడంతో అతడి పేరు మార్మోగిపోతోంది. ప్రస్తుతం ఎమిలీ(63) దక్షిణ ఫ్రాన్స్‌లో నివాసముంటున్నాడు. ఆ ‘కారు బైక్’ ఇప్పటికీ ఆయన వద్ద ఉంది.