అలాగే నా మనసుకు నచ్చిన చిత్రాల్లో ఒకటి... 'ఈ రోజుల్లో'. దీన్ని చిన్న సినిమా అంటే నేను ఒప్పుకోను. నా దృష్టిలో ప్రేక్షకులు ఆదరించింది అన్నిటికంటే పెద్ద సినిమా. 'ఈ రోజుల్లో' సినిమాని ఒక వాస్తవ కథతో తీశారు దర్శకుడు మారుతి. అందుకే ఇంత పెద్ద విజయం దక్కింది. చిన్న సినిమాలు బతకడం లేదంటే కారణం... థియేటర్లపై గుత్తాధిపత్యమే. దీనిపై ఎంతవరకైనా పోరాడాలని నిర్ణయించాను అన్నారు.
ఇక ఎన్ని కోట్లు పెట్టి తీశామన్నది ముఖ్యం కాదు. ఎంత కలక్ట్ చేసిందన్నదే లెక్క. అప్పట్లో ‘ఒసేయ్ రాములమ్మ' 22.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ‘ప్రేమాభిషేకం'కన్నా గొప్ప హిట్టుందా? అని సూటిగా ప్రశ్నించారు దాసరి నారాయణరావు. దళారీ వ్యవస్థ నశించాలి. థియేటర్లను లీజ్‌కు తీసుకుంటే ప్రేక్షకులు తంతారనే భయం ఏర్పడాలి. దళారీ వ్యవస్థ పోతే ప్రతి సినిమా ‘ఈరోజుల్లో' అవుతుంది అని పిలుపు ఇచ్చారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ - ‘‘ఈ ఆరేడేళ్లల్లో నాకు నచ్చినవి మూడే సినిమాలు. బొమ్మరిల్లు, అలా మొదలైంది, ఈరోజుల్లో. చిన్న సినిమా, పెద్ద సినిమా అని లేదు. సక్సెస్ అయిన సినిమా పెద్ద సినిమా. ‘ఈరోజుల్లో' వంద రోజులాడుతుందని చెప్పాను. అది నిజమైంది. ఈ చిత్రంలో కథ లేదు. సమాజంలో జరిగే సంఘటనలు ఉన్నాయి. నమ్మకమే పెట్టుబడిగా ‘ఈరోజుల్లో' తీశారు. ఇలాంటి సినిమాలు మరో పది రావాలి'' అని చెప్పారు. ఈ వేడుకలో తమ్మారెడ్డి భరద్వాజ్, కె.అచ్చిరెడ్డి, ఎం.ఎల్.కుమార్‌చౌదరి తదితరులు పాల్గొన్నారు.