మీ ఓటుతో జగన్ కడిగిన ముత్యంలా బయటకొస్తాడు.. అందరి ఆదరాభిమానాలతో ముఖ్యమంత్రి అవుతాడు.. వైఎస్‌ఆర్ పథకాలను అమలు చేస్తాడు' అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అన్నారు. విజయమ్మ ఉప ఎన్నికల ప్రచారం తిరుపతి రోడ్డుషోతో ముగిసింది. లీలామహల్ జంక్షన్ వద్ద ఆమె మాట్లాడారు. నా పెంపకం బాగోలేదని కొంతమంది ఆరోపించారని, వారికి ఏ అర్హత ఉందని అలా మాట్లాడతారని విరుచుకుపడ్డారు. నా పెంపకం బాగుంది కనుకే ఈ రోజు జగన్‌ను దేశ ప్రజలుకూడా ఆదరిస్తున్నారని తెలిపారు. పెళ్లయిన కొత్తల్లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో కలిసి తిరుపతిలో ఏడాదిపాటు ఉన్నానని స్థానికులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. జగన్ సోదరి షర్మిల మాట్లాడుతూ రాజ్యసభ పదవి కోసం 18 మంది ఎంఎల్‌ఏలను హోల్‌సేల్‌గా అమ్మేసిన ఘనత చిరంజీవికి దక్కిందన్నారు. 35 కోట్ల రూపాయలు చిరంజీవి కూతురు ఇంట్లో దొరికితే దాన్ని ఎందుకు సిబిఐ తప్పుపట్టలేదన్నారు. రెండు ఎకరాలున్న ఆసామి చంద్రబాబు నేడు దేశవిదేశాల్లో వ్యాపారాలను విస్తరించి కూడబెట్టిన నల్లధనంపై ఎందుకు విచారణ చేపట్టడం లేదని ప్రశ్నించారు. తండ్రి చనిపోయి జీవచ్ఛవంలా ఉన్న తాము ముఖ్యమంత్రి కావాలని సంతకాల సేకరణ చేయలేదన్నారు. వీరప్పమొయిలి సలహాతో కెవిపి రామచంద్రరావు సంతకాల సేకరణ చేశారని తెలిపారు. తమవి శవరాజకీయాలు కాదన్నారు. ఈ రోడ్డుషోలో అభ్యర్థి భూమన కరుణాకర్‌రెడ్డి, రోజా, అంబటిరాంబాబు పాల్గొన్నారు.
|