ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మరో అస్త్రాన్ని ప్రయోగించింది. ఖమ్మం జిల్లా బయ్యారం ప్రాంతంలో మైనింగ్, పరిశోధన నిమిత్తం ఇచ్చిన రక్షణ స్టీల్స్ కు ఇచ్చిన ఒప్పందాన్ని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎపి ఖనిజాభివృద్ది సంస్థకు ప్రభుత్వం ఆదేశాలు పంపింది. నిజానికి గతంలోనే ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే సరిగ్గా ఉప ఎన్నికలకు ఒక రోజు ముందు ఒప్పందాన్ని రద్దు చేసినట్లు ప్రకటన విడుదల చేయడం వ్యూహాత్మకమే కావచ్చు. దీని ద్వారా ప్రజలకు వై.ఎస్.కుటుంబానికి చెందిన వారి అవకతవకలను రద్దు చేశామని చెప్పడానికి ఒక ప్రయత్నంగా కనిపిస్తుంది. కాగా ఇది వై.ఎస్.అల్లుడు బ్రదర్ అనీల్ కు సంబందించిందన్న ప్రచారం ఉంది. కాని అనీల్ మాత్రం దీనిని ఖండిస్తున్నారు. అయితే నిజానికి బయ్యారం ప్రాంతంలో దొరికే ఇనుప ఖనిజం నాసి రకమైనదని అంటారు. దీనిని పెద్ద వివాదంగా మార్చడంలో రాజకీయ పార్టీలు కృతకృత్యమయ్యాయి. నిజానికి రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు రోజుల తర్వాత అయినా ఈ ప్రకటన చేయవచ్చు. కాని ఉప ఎన్నికల నేపద్యంలోనే దీనిని ప్రచారంలో పెట్టాలని భావిస్తున్నారు. అయితే ఇందులో ఏదైనా తప్పు ఉంటే తప్పకుండా రద్దు చేయాల్సిందే. కాని ప్రతిదానిని రద్దు చేసుకుంటూ పోయినా, పారిశ్రామికవేత్తలను జైలుకు పంపినా అది రాష్ట్రానికి సంబందించినంతవరకు తప్పుడు సంకేతం పంపుతుంది. దురదృష్టవశాత్తు మన రాష్ట్రంతో కాంగ్రెస్ హై కమాండ్ తన ఇష్టం వచ్చినట్లు చెలగాటమాడుతోంది. |
|