కైరో:
ఈజిప్టు అధ్యక్షుడిగా ఇస్లామిక్ ఛాందస వర్గానికి చెందిన ముస్లిం బ్రదర్‌హుడ్ అభ్యర్థి మహమ్మద్ ముర్సీ గెలుపు దాదాపు ఖరారైంది. ఆయన గెలుపుపై మంగళవారం అధికారిక ప్రకటన వెలువడటమే ఇక తరువాయి. పదవీచ్యుత అధ్యక్షుడు హోస్నీ ముబారక్‌ను తిరుగుబాటుతో గద్దెదించిన తర్వాత అధ్యక్ష పదవికి తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ముర్సీకి 52 శాతం ఓట్లు పోలవగా, ముబారక్ వద్ద చివరి ప్రధానిగా పనిచేసిన అహ్మద్ షఫీక్‌కు 48 శాతం ఓట్లు లభించినట్లు ముస్లిం బ్రదర్‌హుడ్ వెల్లడించింది. ఎన్నికల ఫలితాలపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉండగా, అధికారంపై పట్టు కాపాడుకునే తుది యత్నాల్లో భాగంగా ప్రస్తుత పరిపాలన సాగిస్తున్న సైన్యం రాజ్యాంగానికి సవరణలు చేపట్టింది. ముర్సీ గెలుపు అధికారికంగా కూడా ఖరారైతే, ఈజిప్టుకు తొలి మతఛాందస అధ్యక్షుడు ఆయనే కాగలరు.