NEWS

Blogger Widgets

19.6.12

అందుకే సినిమాలు తగ్గించేశా - కమల్‌హాసన్


‘‘డబ్బు, పరపతి ఉన్నవాళ్లందరూ నిర్మాతలు కాలేరు. నిర్మాణం అనేది ఒక టెక్నిక్. యాక్టింగ్‌కి ఎంత ప్రతిభ ఉండాలో, నిర్మాణానికి కూడా అంతే ప్రతిభ ఉండాలి’’ అన్నారు కమల్‌హాసన్. ఒకప్పుడు ఒకేసారి ఐదారు, అంతకు పైగానే సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉండేవారు కమల్. అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా రెండేళ్లకు ఒకటి, రెండు సినిమాలు మాత్రమే చేస్తున్నారు. ఇలా సినిమాలు తగ్గించడానికి కారణం ఏంటి? అని కమల్‌ని అడిగితే, ఆయన పై విధంగా స్పందించారు. మరింత వివరంగా చెబుతూ - ‘‘ఇప్పటివరకు నేను దాదాపు 200 సినిమాలు చేశాను.

ఈ చిత్రాలను నిర్మించినవారిలో నాకు వంద మంది నిర్మాతలు మాత్రమే ‘పర్‌ఫెక్ట్’ అనిపించింది. మిగతా వంద మందిలో నాకా ప్రతిభ కనిపించలేదు. నాకు ప్లాస్టిక్ కప్‌లో టీ ఇచ్చారనో, సరైన సమయానికి బ్రేక్‌ఫాస్ట్ అందించలేదనో నేను ఈ వంద మందిని నిందించడంలేదు. అవగాహనలోపం వల్ల ఆ నిర్మాతలు సినిమాకి హాని చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో నాకు ‘మంచి నిర్మాతలు’ తారసపడటంలేదు. అందుకే సినిమాలు చేయడం తగ్గించేశాను. మీ దగ్గర డబ్బుందనుకోండి... ఆ డబ్బుతో ఒక పత్రిక ఆరంభించాలనుకోవచ్చు. డబ్బులున్నంత మాత్రాన పత్రిక నడవదు. ప్రతిభ గత ఎడిటర్లు, జర్నలిస్టులు ఉన్నప్పుడే ఆ పత్రిక సజావుగా సాగుతుంది. సినిమా నిర్మాణం కూడా అంతే. డబ్బులు పెడితే సినిమా తయారవ్వదు.

ఒక డెరైక్టర్‌కి, ఆర్టిస్ట్‌కి ఎంత ప్రతిభ ఉండాలో నిర్మాతకూ అంతే ఉండాలి. అప్పుడే సినిమా బాగా వస్తుంది’’ అని చెప్పారు కమల్‌హాసన్. ‘విశ్వరూపం’ తర్వాత మీ తదుపరి చిత్రం అని అడిగితే - ‘‘ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలనుకుంటున్నాను. అందుకు సంబంధించిన సన్నాహాలు మొదలుపెట్టాం. స్క్రిప్ట్ కూడా రెడీ అయ్యింది. ఆ మధ్య మీడియాలో ఒక వార్త వచ్చింది. ‘విశ్వరూపం’ చిత్రాన్ని అవసరానికి మించి తీశానని, అందుకే సీక్వెల్ విడుదల చేయాలనుకుంటున్నానని రాశారు. అది నాకు చాలా అవమానం అనిపించింది. ‘విశ్వరూపం’ సీక్వెల్‌కి స్కోప్ ఉంది. మూడున్నరగంటల పాటు ఈ కథను చూపించే బదులు కొంచెం మొదటి భాగం, మిగతాది రెండో భాగంలో చూపించాలనుకుంటున్నాను’’ అని చెప్పారు.