న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ కోసం నోటిఫికేషన్ విడుదలైన శనివారం నుంచి సోమవారం వరకు నలుగురు నామినేషన్లు వేశారు. అయితే జనానికి పరిచయం లేని వీరి అభ్యర్థిత్వ అర్హతలపై ప్రశ్నలు ముసురుకున్నాయి. ఆనంద్‌సింగ్ కుష్వాహా(గ్వాలియర్), ఓం ప్రకాశ్ అగర్వాల్(ఢిల్లీ), నరేంద్ర నాథ్ దూబే(లాయరు- వారణాసి), ఎం. ఇలియాస్(తమిళనాడు) నామినేషన్లు వేశారు. ఓటర్ల జాబితాలో తన పేరున్నట్లు చూపే పత్రాన్ని, డిపాజిట్‌ను సమర్పించకపోడంతో ఇలియాస్ పత్రాలను తిరస్కరించామని రాష్ట్రపతి ఎన్నికల రిటర్నింగ్ అధికారి అయిన రాజ్యసభ సెక్రటరీ జనరల్ వీకే అగ్నిహోత్రి సోమవారం తెలిపారు. కాగా, కుష్వాహా, అగర్వాల్‌లు తమ పేర్లను ప్రతిపాదించే, బలపరిచేవారి పేర్ల జాబితా అందజేయకపోవడంతో వారి నామినేషన్లు కూడా తిరస్కరించే అవకాశముంది. మానవాధికార్ రక్షాసమితి అధ్యక్షుడిగా చెప్పుకున్న దూబే తన పేరును 50 మంది ప్రతిపాదించారని, మరో 50 మంది మద్దతు పలికారని చెప్పారు. కుష్వాహా, అగర్వాల్‌లు శనివారం నామినేషన్లు వేయగా, దూబే ఇలియాస్‌లు సోమవారం వాటిని దాఖలు చేశారు.
|