NEWS

Blogger Widgets

19.6.12

గ్రీస్ ఫలితాలతో యూరప్‌కు ఊరట


ఎన్నికల్లో ఉద్దీపన అనుకూల న్యూ డెమోక్రసీ విజయం
రెండో స్థానంలో సిరిజా పార్టీ

లండన్: ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన గ్రీస్ పార్లమెంటు ఎన్నికల్లో ఆర్థిక ఉద్దీపనల అనుకూల న్యూ డెమోక్రసీ పార్టీ విజయం సాధించింది. దీంతో యూరోజోన్ సంక్షోభంతో సతమతమవుతున్న యూరప్‌కు తాత్కాలిక ఉపశమనం కలిగింది. న్యూ డెమోక్రసీ.. అతివాద వామపక్షమైన సిరిజాను స్వల్ప ఆధిక్యంతో ఓడించింది. 29.7 శాతం ఓట్లు సంపాదించుకున్న న్యూ డెమోక్రసీ 79 సీట్లను(బోనస్ సీట్లు కాకుండా) కైవసం చేసుకుంది. 26.9 శాతం ఓట్లతో సిరిజా 71 స్థానాలు దక్కించుకుని రెండో స్థానంలో నిలిచింది. గ్రీస్ ఎన్నికల విధానం ప్రకారం.. ఎక్కువ సీట్లు సాధించిన పార్టీకి బోనస్‌గా 50 సీట్లు దఖలు పడతాయి.

దీంతో న్యూ డెమోక్రసీకి మొత్తం 129 సీట్లు వచ్చాయి. పార్లమెంటులో బోనస్ సీట్లతో కలిపి 300 స్థానాలున్నాయి. చట్టసభలో అధికార పక్షానికి మెజారిటీ ఉండేందుకు బోనస్ సీట్లను ఇస్తున్నారు. ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించే పార్టీ ఈ కోటా కింద సొంతంగా సభ్యులను ఎంపిక చేసుకోవచ్చు. గతంలో బోనస్ సీట్ల సంఖ్య 40గా ఉండేది. ఈ ఏడాది మే నెలలో 50కి పెంచారు. కాగా, ఎన్నికల్లో సోషలిస్టు పార్టీ పసోక్ కు 33 సీట్లు వచ్చాయి. ఇండిపెండెంట్ గ్రీక్స్‌కు 20 సీట్లు దక్కాయి. గ్రీస్‌ను రుణాల ఊబి నుంచి బయటపడేసేందుకు, యూరోజోన్ సంక్షోభాన్ని నివారించేందుకు యత్నిస్తున్న యూరోపియన్ యూనియన్ నేతలకు న్యూ డెమోక్రసీ విజయంతో మరింత సమయం చిక్కినట్లయింది.

ఉద్దీపనలను, పొదుపు చర్యలను వ్యతిరేకించే సిరిజా ఎన్నికల్లో గెలిస్తే గ్రీస్‌ను యూరో కరెన్సీ జోన్ నుంచి బయటకు తెస్తుందని, దీంతో ఆ దేశానికి అప్పులిచ్చిన దేశాలతోపాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని పరిశీలకులు ఇది వరకు అంచనా వేశారు. ఆర్థిక సమస్యలపై చర్చించనున్న జీ-20 దేశాల సదస్సు ప్రారంభమైన సోమవారమే ఈ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. పార్లమెంటుకు గత నెల 6న జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకీ మెజారీటీ రాకపోవడంతో తాజా ఎన్నికలు నిర్వహించారు. ఇవి.. గ్రీస్ కోసం జర్మనీ రూపొందించిన పొదుపు చర్యలపై రెఫరెండమని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. తమ సమస్యలను అధిగమించడానికి ఆర్థిక వనరులు కావాలని ఓటర్లు భావించారని వారంటున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడగానే గ్రీస్, ఆసియా స్టాక్‌మార్కెట్లు పైకి ఎగబాకాయి.

యూరో కరెన్సీ జోన్‌లో ఉండడానికే ప్రాధాన్యం: న్యూ డెమోక్రసీ

గ్రీస్ ఉద్దీపన పథకాల్లోని కఠిన నిబంధనలను సడలించాల్సిన అవసరముందని న్యూ డెమోక్రసీ పార్టీ నేత, మాజీ మంత్రి అంటోనిస్ సమరస్ చెప్పారు. తమ దేశం యూరో కరెన్సీ జోన్‌లో ఉండడానికే తొలి ప్రాధాన్యమిస్తుందన్నారు. కాగా, వెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అధ్యక్షుడు పపౌలియాస్ పార్టీలను కోరడంతో సమరస్ కసరత్తు మొదలెట్టారు. సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ కూడగట్టుకోవడానికి పసోక్ పార్టీతో చర్చలు ప్రారంభించారు.