న్యూఢిల్లీ:
నిత్యావసర వస్తువుల ధరలు మరింత భారంగా మారాయి. దీనిని ప్రతిబింబిస్తూ, వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మేలో 10.36 శాతానికి చేరింది. ఏప్రిల్‌లో ఇది 10.26 శాతం. సోమవారం ఈ గణాంకాలను ప్రభుత్వం విడుదల చేసింది.
వార్షిక ప్రాతిపదికన కూరగాయలు (26.59 శాతం), వంటనూనెలు(18.21 శాతం), పాలు (13.74 శాతం) వంటి నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల రేటు దాదాపు 15 శాతం, ఆ పైకి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గుడ్లు, చేపలు, మాంసం ధరలు సైతం 10.50 శాతం ఎగశాయి. కాగా మేలో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన సీపీఐ ద్రవ్యోల్బణం రేటు 9.57 శాతం ఉండగా, పట్టణ ప్రాంతాలకు సంబంధించిన ద్రవ్యోల్బణం రేటు 11.52 శాతంగా ఉంది. ఏప్రిల్‌లో ఈ రేట్లు 9.67 శాతం, 11.10 శాతంగా ఉన్నాయి.