జాతి పేరుతో దుర్భాషలు.. మీ దేశం వెళ్లిపోండంటూ పిడిగుద్దులు
మెల్‌బోర్న్:
ఆస్ట్రేలియాలో జాత్యహంకారం మరోసారి వెర్రి తలలు వేసింది. ఇద్దరు భారతీయ ట్యాక్సీ డ్రైవర్లపై దుండగులు దాడులకు పాల్పడ్డారు. మెల్‌బోర్న్ సబర్బన్ ప్రాంతంలో హర్‌ప్రీత్ సింగ్ అనే ట్యాక్సీ డ్రైవర్‌ను కొందరు దుండగులు చుట్టుముట్టి బేస్‌బాల్ బ్యాట్లతో చితకబాదారు. కారును ధ్వంసం చేశారు. జాతి పేరుతో దుర్భాషలాడారు. నల్లని ముసుగులు ధరించిన ఈ దుండగుల గ్యాంగ్ రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతూ క్యాబ్ డ్రైవర్లను దోచుకుంటున్నారు.
ఆదివారం బ్రూక్లిన్ అండ్ లావెర్టన్ నార్త్ ప్రాంతంలోని సన్‌షైన్ శివారుల్లో హర్‌ప్రీత్‌సింగ్ ఈ ముష్కరుల బారిన పడ్డారు. కారులో వెళ్తుండగా ఓ కారు వెనక నుంచి రయ్యిమంటూ దూసుకొచ్చింది. హర్‌ప్రీత్‌సింగ్ కారు ముందు నిలిపి, అందులోంచి నలుగురు దుండగులు దిగి దాడికి పాల్పడ్డారు. ‘‘వాళ్లు కారు అద్దాలను బ్యాట్లతో పగులగొట్టారు. అందులో ఒకడు నా ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. డబ్బులు బయటకు తీయమని డిమాండ్ చేశారు’’ అని హర్‌ప్రీత్ సింగ్ గొల్లుమన్నారు. తన వద్ద ఉన్న 150 అమెరికా డాలర్లతోపాటు మొబైల్ ఫోన్ కూడా వారికి ఇచ్చానని చెప్పారు. దాడిలో హర్‌ప్రీత్ పెదవి చిట్లిపోయింది. సన్నీ సింగ్ అనే మరో డ్రైవర్‌పై కూడా ఇలాగే దాడి జరిగిందని స్థానిక మీడియా పేర్కొంది. సన్నీసింగ్ నుంచి డబ్బులు లాక్కెళ్లినట్లు తెలిపింది. ‘‘నువ్వు భారతీయుడివి.. నీ దేశం వెళ్లిపో.. ’’ అంటూ ముష్కరులు ఆయనతో దుర్భాషలాడారని, దాడిలో డ్రైవర్ చేయి విరిగిపోయిందని వివరించింది.