విరుదునగర్ (తమిళనాడు): అవినీతికి వ్యతిరేకంగా బీహార్‌కు చెందిన ఓ రైతు ఇటీవల భిక్షాటన చేసి సీఎం నితీష్‌కుమార్‌కు డబ్బు పంపిన తరహాలోనే తమిళనాడులో ఓ ఆడిటర్ వినూత్నంగా నిరసన తెలిపారు. జనన ధ్రువపత్రం జారీలో జాప్యాన్ని నిరసిస్తూ లంచంగా స్వీకరించాలంటూ రూ.100 డి.డి.ని మునిసిపల్ అధికారులకు పంపాడు. దీంతో కంగుతున్న అధికార యంత్రాంగం ఆగమేఘాలపై కదిలి అతడి ఇంటి ముందు వాలింది.
దరఖాస్తుదారుడి నివాసానికే వచ్చి అడిగిన పత్రాన్ని అందచేశారు. విరుదునగర్‌కు చెందిన పళనిసామి వృత్తిరీత్యా ఆడిటర్. ఓ బహుళజాతి కంపెనీలో ఉద్యోగానికి ఎంపికైన తన కుమారుడి జన్మదిన పత్రాన్ని ఇవ్వాలని కోరుతూ మే 15న ఆయన దరఖాస్తు చేసుకున్నారు. రుసుము చెల్లించి పక్షం రోజులు గడిచిపోతున్నా స్పందన లేకపోవటంతో విసిగిపోయారు. అవినీతిలో కూరుకుపోయిన మునిసిపాలిటీ అధికారులు పనులు చేయాలంటే లంచం చెల్లించక తప్పదంటూ స్థానికంగా ఓ పార్టీ రూపొందించిన పోస్టర్లు చూడటంతో ఏం చేయాలో ఆయనకు బోధపడింది. అంతే... బ్యాంకులో రూ.100 డీడీ తీసుకుని లంచం కింద స్వీకరించాలని కోరుతూ మునిసిపల్ కమిషనర్‌కు లేఖ రాశారు. ఈ కాపీని జిల్లా కలెక్టర్‌కు కూడా పంపారు. దీంతో కదిలిన మునిసిపల్ అధికారులు శుక్రవారం ఆయనకు ఇంటివద్దే జనన ధ్రువపత్రాన్ని అందజేశారు.
|