NEWS

Blogger Widgets

17.6.12

రోమాంచిత సాహసం - నయాగరా జలపాతంపై రోప్‌వాక్


ఒంటారియో(కెనడా) : ఉత్తర అమెరికా, కెనడాలను విభజించే అతిపెద్ద జలపాతం నయాగరాను అత్యంత సునాయాసంగా దాటి రికార్డు సృష్టించాడు యువ అమెరికన్ వాలెండా. చూసేందుకే ఒళ్ళు జలదరించే ఈ జలపాతంపై వాలెండా నడుస్తున్న దృశ్యాన్ని ఇటు అమెరికా, అటు కెనడా పౌరులు ఊపిరిబిగబట్టి మరీ వీక్షించడం విశేషం. వివరాలు.. అమెరికాకు చెందిన నిక్ వాలెండాకు సాహసాలు చేయడమంటే ఎంతో సరదా. సాధారణ పౌరుల్లా బతికేయకుండా ఏదో ఒక ప్రత్యేకతతో జీవించాలని ఉవ్విళ్ళూరే ఈ 33 ఏళ్ళ యువకుడు ఇప్పటి వరకు ఎవరూ చేయని సాహసాన్ని చేయాలని నిర్ణయించుకున్నాడు.

అమెరికా, కెనడాను విభజించే నయాగరా జలపాతంపై ఇటు నుంచి అటు రోప్ ద్వారా నడిస్తే ఎలాగుంటుందని ఆలోచించాడు. ఎంతో లోతుగా ఉండి, దాదాపు 1,800 అడుగుల వెడల్పు ఉన్న జలపాతంపై నడిచివెళ్ళడాన్ని కొందరు స్నేహితులు, కుటుంబ సభ్యులు తొలుత అంగీకరించలేదు. అయితే, వాలెండా పట్టుదలను చూసి వారు మౌనం వహించారు. మొదట అమెరికా వైపు ఉన్న జలపాతం అంచు నుంచి ప్రారంభించి, కెనడా వైపు ఉన్న అంచుపై నడక పూర్తిచేశాడు. వాలెండా సాహసాన్ని వీక్షించేందుకు అమెరికా, కెనడా పౌరులు వేల సంఖ్యలో జలపాతం వద్దకు చేరుకుని విజేతకు జేజేలు పలికారు. మొత్తం 1,800 అడుగుల దూరాన్ని వాలెండా కేవలం 30 నిమిషాల్లో నడిచి రికార్డు సృష్టించాడు. రోప్‌పై నడుస్తున్న సమయంలో బ్యాలెన్స్ కోసం ఓ పొడవాటి కర్రను మాత్రమే వినియోగించాడు. నయాగరా జలపాతంపై నడిచిన మొట్టమొదటి వ్యక్తిగా వాలెండా రికార్డు సొంతం చేసుకున్నాడు. ఈ సందర్భంగా వాలెండా మాట్లాడుతూ, ‘నడుస్తున్నంత సేపూ మేఘాల్లో తేలినట్టు అనిపించింది. భయం భయం అనుకుంటే ఏదీ సాధించలేం. అసాధ్యం అనుకున్నా ఏదీ చేయలేం’ అని అన్నాడు.