NEWS

Blogger Widgets

17.6.12

రాంబాబు లైన్లోకొచ్చాడు


‘నువ్వు నందా అయితే నేను బద్రీ బద్రీనాథ్... అయితే ఏంటి?’... పన్నెండేళ్ల క్రితం ఈ డైలాగ్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. పసి పిల్లల దగ్గర్నుంచి ప్రతి ఒక్కరినోటా ఇదే డైలాగ్. తొలి కలయికతోనే సెన్సేషన్ సృష్టించారు పవన్‌కళ్యాణ్-పూరి జగన్నాథ్. ‘బద్రి’ తర్వాత వాళ్లిద్దరూ మళ్లీ కలిసి సినిమా చేయలేదు. మళ్లీ ఇన్నాళ్లకు వాళ్లిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘కెమెరామేన్ గంగతో రాంబాబు’. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ విషయాన్ని పూరి జగన్నాథ్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ‘‘‘కెమెరామేన్ గంగతో రాంబాబు’ షూటింగ్ శుక్రవారం మొదలైంది. పవన్‌కళ్యాణ్ మంచి మూడ్‌లో షూటింగ్‌లో పాల్గొన్నారు.

ఇందులో విలన్‌గా నా డార్లింగ్ ప్రకాష్‌రాజ్ నటిస్తున్నారు’’ అని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘గబ్బర్‌సింగ్’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవన్‌కళ్యాణ్ నటిస్తున్న సినిమా ఇదే. పైగా సుదీర్ఘ విరామం తర్వాత పవన్-పూరీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు అంబరాన్ని తాకాయి. ఇందులో పవర్‌స్టార్ జర్నలిస్ట్‌గా నటిస్తున్నారు. నేటి రాజకీయాలపై ఓ వ్యంగాస్త్రంగా ఈ చిత్రాన్ని పూరీ రూపొందిస్తున్నట్లు సమాచారం. తమన్నా ఇందులో కథానాయికగా నటిస్తున్నారు. పవన్‌కళ్యాణ్-తమన్నా కలిసి నటిస్తున్న తొలి సినిమా కూడా ఇదే. అక్టోబర్ 18న గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిసింది.