రియాద్:
సౌదీ అరేబియా సింహాసనానికి వారసత్వ లోటు ఏర్పడింది. ఆ దేశానికి కాబోయే రాజు(క్రౌన్ ప్రిన్స్) నయెఫ్ బిన్ అబ్దుల్ అజీజ్ శనివారం అనారోగ్యంతో మృతిచెందారు. 79 ఏళ్ల నయెఫ్ జెనీవాలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. చాలా ఏళ్లుగా హోం మంత్రిగా పనిచేస్తున్న ఆయన ఎనిమిది నెలల కిందటే క్రౌన్ ప్రిన్స్ అయ్యారు. ఆయన ప్రస్తుత రాజు అబ్దుల్లాకు సవతి తమ్ముడు. 88 ఏళ్ల అబ్దుల్లా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అబుల్లా తదనంతరం నయెఫ్ రాజు కావాల్సి ఉంది. నయెఫ్ స్థానాన్ని భర్తీ చేయడానికి అధికారికంగా ఎవరూ లేరు. అయితే ఆయన తమ్ముడైన రక్షణ మంత్రి ప్రిన్స్ సల్మాన్(76) క్రౌన్ ప్రిన్స్ పదవికి బలమైన అభ్యర్థి అని పరిశీలకులు భావిస్తున్నారు. కాగా, నయెఫ్.. సౌదీలో 2006-09 మధ్య దాడులకు పాల్పడిన అల్ కాయిదాను ఉక్కుపాదంతో అణచేశారు. ఈ నేపథ్యంలో ఆయన క్రౌన్స్ ప్రిన్స్ అయ్యారు. ఆయన అనారోగ్య వివరాలపై రాచకుటుంబం ఎలాంటి ప్రకటనా చేయలేదు. అయితే ఆయనకు కేన్సర్ ఉందని సమాచారం. నయెఫ్ అంత్యక్రియలు ఆదివారం మక్కాలో జరగనున్నాయి.