NEWS

Blogger Widgets

17.6.12

రోదసిలోకి చైనా మహిళ


అంతరిక్షంలోకి తొలిసారి మహిళా వ్యోమగామిని పంపిన చైనా
అమెరికా, రష్యాల తర్వాత మానవ సహిత డాకింగ్ చేపడుతున్న మూడో దేశంగానూ రికార్డు

బీజింగ్: అంతరిక్ష రంగంలో చైనా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. శనివారం సాయంత్రం తన తొలి మహిళా వ్యోమగామి లియు యాంగ్‌ను అంతరిక్షానికి పంపింది. దీంతోపాటు అమెరికా, రష్యాల తర్వాత రోదసీలో మానవ సహిత డాకింగ్ (అనుసంధానం) నిర్వహించిన మూడో దేశంగానూ చైనా రికార్డు సృష్టించనుంది. వాయవ్య చైనాలోని గోబి ఎడారిలో గల జియుక్వాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి సాయంత్రం 6:37 గంటలకు షెంర-9 వ్యోమనౌక (దేవుడి బండి అని అర్థం) ద్వారా మహిళా వ్యోమగామితోపాటు మరో ఇద్దరు పురుష ఆస్ట్రోనాట్స్‌ను పంపినట్లు చైనా ప్రకటించింది. హెనాన్ ప్రావిన్స్‌లోని లింరకు చెందిన 33 ఏళ్ల లియు ఇంతకుముందు ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా పనిచేశారు. గతంలో ఒకసారి తన విమానం 18 పావురాలను ఢీకొట్టిన సందర్భంలో నైపుణ్యం, ధైర్యం ప్రదర్శించిన ఆమె విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. పలు అత్యవసర సందర్భాల్లోనూ చాకచక్యంగా వ్యవహరించి వీరోచిత పైలట్‌గా పేరు పొందారు.

చైనా తొలి మహిళా ఆస్ట్రోనాట్ కావడంతోపాటు అంతరిక్షంలోకి వెళ్లిన 57వ స్త్రీగా లియు రికార్డు సృష్టించారు. ఈమెతోపాటు పురుష వ్యోమగాములు జింగ్ హైపెంగ్, లియు వాంగ్‌లు షెంర-9లో అంతరిక్షానికి వెళ్లారు. రోదసీలో శాశ్వత స్థావరం ఏర్పర్చుకునేందుకుగాను అమెరికా, రష్యాల తర్వాత సొంత అంతరిక్ష కేంద్రం (తియాంగాంగ్-1)ను ఏర్పాటు చేసుకుంటున్న మూడో దేశంగా చైనా అవతరించింది. తియాంగాంగ్-1ను 2020 కల్లా పూర్తిస్థాయిలో నిర్మించేందుకు చైనా ప్రయత్నిస్తోంది. భూమికి 343 కిలోమీటర్ల ఎత్తులో కక్ష్యలో తిరుగుతున్న తియాంగాంగ్-1(దీనికి స్వర్గలోకపు భవనం అని అర్థం)కు ఆ దేశం మానవ సహిత డాకింగ్‌ను నిర్వహించడం ఇదే తొలిసారి. అదేవిధంగా ఈ ప్రయోగం కోసం చైనా ఉపయోగించిన రాకెట్ ఆ దేశం ఇంతవరకు రూపొందించిన రాకెట్లలోకెల్లా పొడవైనది, బరువైనది కావడం విశేషం. షెంర-9ను తియాంగాంగ్-1కు అనుసంధానం చేయడంతోపాటు ఈ ముగ్గురూ వ్యోమనౌక నుంచి బయటికి వచ్చి తియాంగాంగ్‌లోకి వెళతారు. దాదాపు పది రోజులపాటు అందులో ఉండి వివిధ పనులు పూర్తిచేసి, తిరిగి భూమికి చేరుకుంటారు.