NEWS

Blogger Widgets

17.6.12

మృత్యుంజయుడీ బాలుడు



మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం బారి నుంచి ఓ 11 నెలల బాలుడు అద్భుత రీతిలో చిన్న గాయం కూడా లేకుండా బయట పడ్డాడు! కానీ అతని తండ్రితో పాటు అమ్మమ్మ, నాన్నమ్మ, ఇద్దరు తాతయ్యలు మృత్యువాత పడ్డారు. తల్లి ఆస్పత్రిలో కోలుకుంటోంది. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం బోదిలవీడుకు చెందిన గుండపునేని మోహన్‌రావు (30) రహేజా ఐటీ పార్క్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేస్తున్నారు. కుత్బుల్లాపూర్ మండలం బాచుపల్లి శ్రీనివాస టవర్స్‌లో ఉంటున్నారు. 11 నెలల కొడుకు జయవర్ధన్ తలనీలాల కోసం భార్య దీపిక, తల్లిదండ్రులు ఆదెమ్మ (50), వెంకటేశ్వర్లు (54); అత్తమామలు సావిత్రి (46), కిష్టయ్య (50), మరదలు రాధికలతో కలిసి మోహన్ షిర్డీ బయల్దేరారు. ప్రమాదంలో ఆయనతో పాటు తల్లిదండ్రులు, అత్తమామలు కూడా అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. భార్య, మరదలు షోలాపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

బాబును జాల్‌కోట్ ఆస్పత్రికి తరలించిన పోలీసులు, మధ్యాహ్నం అక్కడికి చేరుకున్న బంధువు విజయ్‌కుమార్‌కు అప్పగించారు. మోహన్ తండ్రి గుండపునేని వెంకటేశ్వర్లు బోదలవీడు సర్పంచ్‌గా పని చేశారు. ఆయన ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్నారు. వియ్యంకుడు కిష్టయ్యది దాచేపల్లి. ప్రమాద సమాచారం తెలియగానే ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లి వెంకటేశ్వర్లు, కుటుంబీకుల మృతదేహాలను సందర్శించి నివాళులర్పించారు. ఆంధ్ర, మహారాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం మృతుల కుటుంబాలకు పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.