NEWS

Blogger Widgets

17.6.12

అక్రమంగా వచ్చినా సరే ఇక్కడే ఉండొచ్చు


యువ ప్రతిభావంతులకు ఒబామా అనుమతి
అమెరికా వలస విధానంలో కీలక నిర్ణయం
డీపోర్టేషన్ నుంచి తాత్కాలిక మినహాయింపు

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా వలస విధానంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. అక్రమంగా వలస వచ్చి అమెరికాలో ఉంటున్న యువ ప్రతిభావంతులను దేశం నుంచి పంపించివేయకుండా అక్కడే ఉండేందుకు అనుమతించనున్నట్లు వెల్లడించారు. తల్లిదండ్రుల ద్వారా బాల్యంలోనే అమెరికాకు వచ్చి అనధికారికంగా నివసిస్తున్న, జాతీయ, ప్రజా భద్రతకు ప్రమాదకరం కాని యువతీయువకులపై డీపోర్టేషన్ (దేశ బహిష్కారం) చర్యలు నిలిపివేయనున్నట్లు తెలిపారు. అయితే ఒబామా ప్రకటనపై లాటిన్ అమెరికా నేతలు హర్షం వెలిబుచ్చగా, రిపబ్లికన్లు మాత్రం తీవ్ర వ్యతిరేకత వ్యక్తంచేశారు. ఈ చర్య క్షమాభిక్ష కిందకే వస్తుందని, కాంగ్రెస్‌కున్న అధికారాన్ని అధ్యక్షుడు లాగేసుకోవడమే అవుతుందని ఆరోపించారు.

కాగా, డిపోర్టేషన్‌ను నిలిపివేయడానికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ తక్షణమే చర్యలు ప్రారంభిస్తుందని ఒబామా చెప్పారు. డీపోర్టేషన్ నుంచి తాత్కాలిక మినహాయింపు కోరేందుకుగాను అర్హులైన యువత వచ్చే కొన్ని నెలలపాటు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇది కేవలం తాత్కాలిక మినహాయింపే తప్ప క్షమాభిక్ష కాదని, వారికి పౌరసత్వం ఇచ్చేందుకు ఇది మార్గమూ కాదని స్పష్టంచేశారు. ‘తల్లిదండ్రుల ద్వారా మన దేశం వచ్చిన ఈ యువత అంతా మన స్కూళ్లలో చదువుకున్నారు. మన పిల్లలతో, మన పరిసరాల్లో పెరిగారు. వీరంతా మన జాతీయజెండాకు విధేయులై ఉంటారు. మానసికంగా వారు అమెరికన్లే. అయితే ఉద్యోగానికి లేదా స్కాలర్‌షిప్‌కు లేదా డ్రైవింగ్ లెసైన్సుకు దరఖాస్తు చేసుకునేదాకా.. తాము అక్రమంగా ఉంటున్నామన్న సంగతే చాలామందికి తెలియదు. మనదేశంలో వివిధ రంగాల్లో పనిచేయాలనుకుంటున్న ప్రతిభావంతులను ఇలా అకస్మాత్తుగా అంతగా పరిచయంలేని దేశాలకు పంపడం సరికాదు. అందుకే ఈ కొత్త నిర్ణయం సమంజసమేన’ని ఒబామా వివరణనిచ్చారు.