NEWS

Blogger Widgets

17.6.12

9 మంది సాఫ్టువేర్ ఉద్యోగుల దుర్మరణం - అంతా టీసీఎస్ సిబ్బందే



వారితోపాటు వెళ్లి దుర్మరణం పాలైన ఓ ఉద్యోగిని చెల్లెలు

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఒకరు కాదు, ఇద్దరు కాదు. మొత్తం 14 మంది. వారంతా ఒకే కాలేజీలో చదువుకున్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఉద్యోగాల్లో చేరేముందు దైవ దర్శనం చేసుకోవాలని బయల్దేరి, తిరిగిరాని లోకాలకే చేరుకున్నారు. షిర్డీ బస్సు ప్రమాదంలో హైదరాబాద్ గౌలిదొడ్డిలోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు చెందిన తొమ్మిది మంది ఉద్యోగులు మరణించారు. దివ్య అనే ఉద్యోగినితో పాటు బయల్దేరిన కవల సోదరి దీప్తి కూడా దుర్మరణం పాలైంది. మృతుల్లో ఎనిమిది మంది మహిళలే! కాగా మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. మరొకరి జాడ తెలియరావడం లేదు. బి.నరేశ్, ఉషాకీర్తి, కె.సావర్ణిక, ఎస్.ఉమామహేశ్వరి, శేఖర్, మానస, కృష్ణ సాహిత్య, సుచిత్ర, దివ్యపాండ, ఆమె సోదరి దీప్తి దుర్మరణం పాలయ్యారు. వి.సంపత్, రాయప్రోలు సత్యమంగళ పూజిత, కిరణ్‌కుమార్ తీవ్రంగా గాయపడ్డారని మాదాపూర్ పోలీసులు తెలిపారు. వీరితో పాటు మహిమ, శిరీష అనే మరో ఇద్దరు ఉద్యోగులు కూడా ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది. ఈ 14 మందీ విజయనగరం జిల్లా చింతలవలస మహారాజా ఇంజనీరింగ్ కాలేజీలో చదివారు.గౌలిదొడ్డిలోని క్యూసిటీలో ఉన్న టీసీఎస్‌లో మార్చి 5న చేరారు. మే 29న శిక్షణ పూర్తి చేసుకున్నారు.

షిర్డీ వెళ్లేందుకు వీరందరికీ సంపత్ టికెట్లు బుక్ చేశాడు. అంతా మాదాపూర్‌లో బస్సెక్కారు. దుర్ఘటన గురించి తెలియగానే వారి సహోద్యోగులంతా తల్లడిల్లిపోయారు. తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపో యారు. మృతుల్లో మానసది విజయనగరానికి చెందిన కొట్టన. పి.దివ్య, దీప్తిలది వైజాగ్ భానూ స్ట్రీట్స్ దాబా గార్డెన్స్. ఎస్.ఉమామహేశ్వరిది వైజాగ్‌లోని వెంకటేశ్వరమెట్ట అల్లిపురం. కె.సావర్ణికది వైజాగ్‌లోని నౌరోజీ రోడ్డు ఎంఆర్‌పేట్. ఇల్ల కృష్ణ సాహిత్యది విజయనగరం. సత్యమంగళది వైజాగ్ బండపాలెం చిన్న రుషికొండ. వీరంతా గౌలిదొడ్డి ఆమని లగ్జరీ లేడీస్ హాస్టల్లో నివాసముంటున్నారు. ప్రమాదం గురించి తెలిసి వారి రూమ్మేట్ మామిడి తేజారాణి కన్నీటి పర్యంతమయ్యారు. తాము ఎనిమిది మందిమి హాస్టల్లో ఉంటున్నట్టు చెప్పారు. ప్రసన్న అనే అమ్మాయి శుక్రవారమే ఊరికి వెళ్లగా మిగతా ఆరుగురు షిర్డీ బయల్దేరారన్నారు. తమ సంస్థకు చెందిన పలువురు ఉద్యోగులు షిర్డీ బస్సు ప్రమాదంలో మరణించడంతో టీసీఎస్‌లో విషాదం నెలకొంది. మరణించిన తమ ఉద్యోగులకు టీసీఎస్ నివాళులు అర్పించింది. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. షోలాపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమ ఉద్యోగులకుఅక్కడి టీసీఎస్ బృందం అన్ని విధాలుగా సహకారం అందిస్తోందని టీసీఎస్ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.