NEWS

Blogger Widgets

17.6.12

రజనీకాంత్ ఆఫ్ తెలుగు సినిమా... రాజమౌళి


‘‘ ‘ఈగ’ చిత్రం విడుదల తేదీలను ఇప్పటివరకూ చాలా ప్రకటించాం. కానీ విడుదల చేయలేకపోయాం. దానికి కారణం గ్రాఫిక్స్. ఎట్టకేలకు సినిమా కంప్లీట్ అయ్యింది. జూలై 6న సినిమాను విడుదల చేస్తున్నాం. ఈ చిత్రం ప్రచారంలో భాగంగా ఇటీవలే నానిపై ఓ పాటను చిత్రీకరించాం. ఈ పాటను కేవలం ప్రచారంలో మాత్రమే ఉపయోగిస్తాం. సినిమాలో ఉండదు’’ అని ఎస్.ఎస్.రాజమౌళి అన్నారు. నాని, సుదీప్, సమంత ప్రధాన పాత్రధారులుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో సాయి కొర్రపాటి నిర్మిస్తున్న చిత్రం ‘ఈగ’.

డి.సురేష్‌బాబు సమర్పకుడు. జూలై 6న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజమౌళి పై విధంగా స్పందించారు. ‘‘‘ఈగ’కు సంబంధించిన ప్రతి ఫ్రేములోనూ రాజమౌళి పడ్డ కష్టం కనిపిస్తుంది. ఎన్టీఆర్ అతణ్ని జక్కన అని ఎందుకు పిలుస్తాడో ఇప్పుడర్థమైంది నాకు. ‘ఈగ’లో ప్రతి సన్నివేశం క్లయిమాక్స్‌లా ఉంటుంది. ఛాలెంజ్‌గా తీసుకొని ఈ సినిమా రీ-రికార్డింగ్ అందించాను’’ అని కీరవాణి చెప్పారు. సురేష్‌బాబు మాట్లాడుతూ -‘‘తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో 1200 ప్రింట్లతో ‘ఈగ’ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం.

ఆంధ్రప్రదేశ్‌లో 450 నుంచి 500 ప్రింట్లు, ఓవర్సీస్ 150 ప్రింట్లు, తమిళనాడులో 150, కేరళలో 75, నార్త్ ఇండియాలో 100 ప్రింట్లతో భారీ స్థాయిలో చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. మిగతాభాషల్లోనూ విడుదల చేయాలనే ఆలోచన ఉంది’’ అని తెలిపారు. రాజమౌళిని రజనీకాంత్ ఆఫ్ తెలుగు సినిమా అనొచ్చని, ఆయన లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వస్తారని, భారతీయ సినీ చరిత్రలోనే ‘ఈగ’లాంటి సినిమా రాలేదని, ‘ఈగ’ విడుదల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని నాని చెప్పారు