NEWS

Blogger Widgets

17.6.12

29 మంది రాష్ట్రవాసుల దుర్మరణం - ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రైవేట్ బస్సు బోల్తా..



ఉస్మానాబాద్ జిల్లాలో వంతెనపై నుంచి లోయలో పడ్డ బస్సు
హైదరాబాద్ నుంచి షిర్డీ వెళ్తుండగా తెల్లవారుజామున ఘోరం...
అతివేగం, ఇరుకు వంతెనే కారణమని ప్రమాద బాధితుల ఆగ్రహం
అక్కడికక్కడే 27 మంది.. ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరి మృతి
మృతుల్లో 15 మంది మహిళలు, 14 మంది పురుషులు.
మరో 16 మందికి గాయాలు.. పలువురి పరిస్థితి విషమం..
మృతులు విజయనగరం, విశాఖ, హైదరాబాద్, మెదక్ వాసులు

షోలాపూర్/జహీరాబాద్ టౌన్ (మెదక్), న్యూస్‌లైన్: తెల్లవారుజాము సమయం. చిమ్మచీకటిని చీలుస్తూ దూసుకెళ్తున్న బస్సు. సుమారు 50 మంది దాకా ప్రయాణికులు. అంతా గాఢనిద్రలో ఉన్నారు. అంతా సవ్యంగా సాగితే మరికొద్ది గంటల్లో షిర్డీ సాయిని దర్శించుకోవాల్సి ఉంది! కానీ, జరగరాని ఘోరం జరిగింది. అతివేగంతో బస్సు అదుపు తప్పింది. ఎదురుగా ఉన్న ఇరుకు వంతెన ప్రాణాంతకంగా మారింది. బస్సు ఒక్కసారిగా వంతెనపై నుంచి 25 అడుగుల లోతున్న లోయలోకి పడిపోయింది. అంతే.. గాఢనిద్రలో ఉన్న వారిలో ఏకంగా 27 మంది అక్కడికక్కడే శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. ఆస్పత్రులకు తరలిస్తుండగా మరో ఇద్దరు తుది శ్వాస విడిచారు. మహారాష్ట్రలో ఉస్మానాబాద్ జిల్లా తుల్జాపూర్ తాలూకాలోని నల్‌దుర్గ్ సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక సుమారు 2.40 ప్రాంతంలో జరిగిన ఈ అత్యంత ఘోరమైన రోడ్డు ప్రమాదం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 29 మందిని పొట్టన పెట్టుకుంది. మృతుల్లో 15 మంది మహిళలు కాగా, 14 మంది పురుషులు. మరో 16 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ఆస్కారముంది. వీరంతా షోలాపూర్, ఉస్మానాబాద్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రుల్లో డ్రైవర్లు కూడా ఉన్నారు. 29 మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించినట్టు రవాణా మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రెండు, వైజాగ్‌కు చెందిన ఐదు మృతదేహాలను ఆదివారం ఉదయం విమానం ద్వారా తరలిస్తామన్నారు. దుర్ఘటనపై ఆదివారం విచారణ జరిపిస్తామని చెప్పారు.

బాధితులంతా షిర్డీ సాయిబాబాను దర్శించుకునేందుకు హైదరాబాద్ నుంచి శ్రీ కాళేశ్వరి ట్రావెల్స్ బస్సులో శుక్రవారం రాత్రి బయల్దేరారు. తొమ్మిదో నంబర్ జాతీయ రహదారిపై షోలాపూర్‌కు సుమారు 70 కిలోమీటర్ల దూరంలో జల్‌కోట్ గ్రామ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున (తెల్లవారితే శనివారం) బస్సు ప్రమాదానికి గురైంది. ఓ మలుపు, ఆ వెంటనే ఇరుకైన వంతెన ఎదురవడంతో మితిమీరిన వేగం కారణంగా మలుపు తిరగ్గానే డ్రైవర్ అదుపు కోల్పోయాడు. దాంతో బస్సు దాదాపుగా 25 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది. పడీ పడగానే ఆ ధాటికి రెండు మూడు పల్టీలు కొట్టిందని ఉస్మానాబాద్ ఏఎస్పీ రవీంద్రసింగ్ పరదేశి తెలిపారు. దాని ఎడమ భాగం పూర్తిగా దెబ్బతింది. లోయలో సుమారు 3 అడుగుల మేర నీరుండటం కూడా భారీ ప్రాణ నష్టానికి కారణమైందని పోలీసులు వెల్లడించారు. క్షతగాత్రుల రోదనలు, ఆత్మీయులను కోల్పోయిన వారి ఆర్తనాదాలతో చిమ్మచీకట్లో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. ఎటు చూసినా హాహాకారాలతో చాలాసేపటిదాకా పరిస్థితి హృదయ విదారకంగా కొనసాగింది. చివరికి ప్రమాదం నుంచి బయటపడ్డ వారే ఓ ప్రైవేటు ట్రావెల్స్ సిబ్బంది సాయంతో నాలుగు కిలోమీటర్ల దూరంలోని నల్‌దుర్గ్ పోలీసుస్టేషన్‌కు సమాచారం అందించారు.

పోలీసులు, స్థానికులు వచ్చేదాకా బాధితులంతా నరకయాతన పడ్డారు. బస్సు కిటికీలను కట్టర్లతో కోసి క్షతగాత్రులను బయటికి తీశారు. 18 మంది క్షతగాత్రులను 70 కిలోమీటర్ల దూరంలోని షోలాపూర్‌లో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం షోలాపూర్ సివిల్ ఆసుపత్రిలో చేర్చారు. మిగతా వారిని ఉస్మానాబాద్ ఆసుపత్రికి పంపించారు. మృతులంతా 25 నుంచి 40 ఏళ్ల లోపు వారేనని తెలిసింది. మృతదేహాలన్నీ ఘటనా స్థలిలో చెల్లాచెదురుగా పడిపోయాయి. వాటిని స్థానికుల సాయంతో జల్‌కోట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆసుపత్రి ఇరుకుగా ఉండటంతో ఆరు బయటే టెంట్లు వేసి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాలను ఆరు అంబులెన్సుల్లో దశల వారీగా హైదరాబాద్ ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఒక్కో అంబులెన్సు వెంట ఇద్దరు పోలీసులు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందిని పంపించారు. షోలాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలోని రెండు శవాల్లో ఒకదాన్ని బంధువులకు అప్పగించగా, మరో శవాన్ని అంబులెన్సులో హైదరాబాద్‌కు తరలించారు. మృతులను సెల్‌ఫోన్లు, పర్సుల్లో దొరికిన నంబర్లు, ఐడీ కార్డుల ఆధారంగా గుర్తించారు. మరికొందరిని ఆసుపత్రికి చేరుకున్న బంధువులు గుర్తించారు. చికిత్స పొందుతున్న 16 మందిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రవీణ్ అనే వ్యక్తి తలకు బలమైన గాయాలు కాగా, ఉపేంద్రకు పలు చోట్ల ఎముకలు విరిగాయి. మరో నలుగురు ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జై బంధువుల వెంట వెళ్లిపోయారు.

రాష్ట్రం నుంచి ప్రత్యేక బృందాలు: షిర్డీ బస్సు ప్రమాద ఘటనలో సహాయ చర్యలు చేపట్టేందుకు మెదక్ జిల్లా నుంచి రెవెన్యూ, పోలీసు, వైద్య బృందాలు జల్‌కోట్ వెళ్లాయి. శనివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మెదక్ జిల్లా కలెక్టర్ సురేశ్‌కుమార్‌తో మాట్లాడి, సహాయ చర్యల బాధ్యత అప్పగించారు. క్షతగాత్రులను ఇప్పటికిప్పుడు హైదరాబాద్ తరలించే పరిస్థితి లేకపోవడంతో వారి పరిస్థితి మెరుగయ్యేదాకా వైద్య, రెవెన్యూ బృందాలను షోలాపూర్‌లోనే ఉండాల్సిందిగా ఆదేశించినట్టు సురేశ్‌కుమార్ ‘న్యూస్‌లైన్’కు వెల్లడించారు. స్థానిక పోలీసులు మృతుల బంగారు ఆభరణాలు, వాచీలు, సెల్‌ఫోన్లు తదితరాలను భద్రపరిచారు. వాటన్నిటినీ హైదరాబాద్‌కు తరలించేందుకు జహీరాబాద్ డిపో నుంచి ఆర్టీసీ రెండు బస్సులను పంపింది.

మృతులు-క్షతగాత్రుల వివరాలు
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలను హైదరాబాద్ ఆర్డీవో హరీష్ ప్రకటించారు. ఆయన వెల్లడించిన 20 మంది మృతుల వివరాలు...
సింగిరెడ్డి(20), మోహన్‌రావు(30-రంగారెడ్డి జిల్లా), డి.జగన్నాథ్ పైడి (23-హైదరాబాద్), పి.శ్రీకాంత్ (హబ్సిగూడ-తండ్రి పేరు నేతాజీ), విక్రమ్(కూకట్‌పల్లి- తండ్రి ఎం.సుదర్శన్), గౌతమ్‌కిషన్‌లాల్ బండారి(హైదరాబాద్), దీపికా కృష్ణయ్య, ప్రఫుల్ సురేశ్, డాక్టర్ పి.సుశీల్‌కుమార్(34-హైదరాబాద్), కె.రామారావు వెంకటాద్రి (55), బంగారురాజు కిషోర్‌కుమార్, ఉమా మహేశ్వరి (21-విశాఖ), సాయి సుష్మ (24-రాజుపాలెం, కడప), ఎం.సురేశ్ (29-హైదరాబాద్), కె.వెంకటేశ్వరరావు (హైదరాబాద్), కె.అనిత (హైదరాబాద్), వెంకటేశ్వర్లు (55-తండ్రి వెంకయ్య), ఆదిత్య (తండ్రి వెంకటేశ్వర్లు), పి.దీప్తి (విజయనగరం-తండ్రి జగదీష్ పైడే), సరోజిని (55-సికింద్రాబాద్)

మరికొందరు మృతుల వివరాలు: దివ్య (విశాఖపట్టణం), తేజస్విని (45-రాజుపాలెం, కడప), సీనా కేశవరెడ్డి (16-హైదరాబాద్), సంతోష్ గుప్తా (25-హైదరాబాద్), ఆదెమ్మ (50-గుంటూరు), కిష్టయ్య (50-గుంటూరు), సావిత్రమ్మ (46-గుంటూరు), బి.నరేశ్, కృష్ణ సాహిత్య (విజయనగరం)

క్షతగాత్రులు: కృష్ణ తులసి, ఇందూ వెంకటేశ్వర్, జోసఫ్ (కృష్ణా జిల్లా), పూజిత (విశాఖపట్నం), ఎస్.అశోక్‌కుమార్ (హర్యానా), దిప్తీ విశాల (గుంటూరు), ఎన్.రాధిక (గుంటూరు), రజత్ వీరేంద్ర (ఢిల్లీ), వీరన్ ఉపేంద్ర (ఖమ్మం), డి.యాదగిరి, షీలా ప్రవీణ, సంపత్ శ్యామ్ (విశాఖపట్నం), ఎ.ఎస్.ప్రవీణ్, కిరణ్‌కుమార్ (శ్రీకాకుళం), జ్యోతి సుశీల్‌కుమార్, (హైదరాబాద్), శేషుబాబు.

హెల్ప్‌లైన్ సెంటర్ల ఏర్పాటు

హైదరాబాద్, న్యూస్‌లైన్: మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతులు, క్షతగాత్రుల వివరాల కోసం శనివారం హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ప్రమాదంలో మృతి చెందిన, గాయపడిన వారి వివరాలను వారి కుటుంబ సభ్యులు, బంధువులకు అందించేందుకు జిల్లా కలెక్టర్ నటరాజన్ గుల్జార్ యుద్ధప్రాతిపదికన హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హెల్ప్‌లైన్ ఫోన్ నంబర్లు: 9440815861 / 040-23204833

అతివేగం, ఇరుకు వంతెన వల్లే..

అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తేలినట్టు ఉస్మానాబాద్ జిల్లా ఎస్పీ దత్తాత్రేయ కరాడే ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ఈ రోడ్డుపై మునుపెన్నడూ ఇంతటి ప్రాణనష్టం జరగలేదన్నారు. ఇరుకైన వంతెన కూడా ప్రమాదానికి కారణమేనని ఘటనా స్థలాన్ని పరిశీలిస్తే తెలుస్తోంది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో బస్సు లోయలో పడ్డట్టు పోలీసులు భావిస్తున్నారు. ఇరుకైన ఈ వంతెనకు రక్షణ గోడ కూడా లేదు. దాంతో అతివేగంగా వస్తున్న వోల్వో బస్సు, ఇనుప కడ్డీలతో కూడిన నామమాత్రపు రెయిలింగ్‌ను ఢీకొట్టి లోయలోకి దూసుకెళ్లింది.

విజయమ్మ దిగ్భ్రాంతి

హైదరాబాద్, న్యూస్‌లైన్: మహారాష్ట్ర నల్‌దుర్గ్ వద్ద చోటుచేసుకున్న బస్సు ప్రమాదంలో రాష్ట్రవాసులు మరణించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న ఆమె విషయం తెలుసుకొని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి ప్రభుత్వం వెంటనే మంచి వైద్యం అందజేయాలని ఒక ప్రకటనలో ఆమె కోరారు.
చంద్రబాబు విచారం..: బస్సు ప్రమాదం పట్ల టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించడంతో పాటు మహారాష్ట్రకు ప్రత్యేక బృందాన్ని పంపించాలని శనివారం ఒక ప్రకటనలో కోరారు.

బస్సు యాజమాన్యానికి నోటీసులు!

హైదరాబాద్, న్యూస్‌లైన్: హైదరాబాద్ నుంచి షిర్డీ వెళుతూ ప్రమాదానికి గురైన బస్సు యాజమాన్యానికి నోటీసులు జారీచేయాలని రవాణాశాఖ నిర్ణయించింది. బెంగళూరుకు చెందిన కాళేశ్వర్ ట్రావెల్స్ భాగస్వామి సీహెచ్ రమేశ్ పేరిట ఈ బస్సు రిజిష్టర్ (కేఎ 01డీ 0245) అయ్యింది. అయితే, బస్సు పొరుగు రాష్ట్రానిది కావడం.. ప్రమాదం మరో రాష్ర్టంలో జరగడంతో కేవలం నోటీసులతో సరిపెట్టుకోవాలని భావిస్తోంది. మన రాష్ట్ర ప్రయాణికులను తరలించడంలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంపై వివరణ కోరుతూ ఈ మేరకు నోటీసులు ఇవ్వాలని యోచిస్తోంది.