ఉప ఎన్నికల ఫలితాలు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి రాజకీయ ఎదుగుదలకు గొడ్డలిపెట్టులా మారాయి. తిరుపతి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకటరమణ గెలిచి ఉంటే చిరంజీవికి క్యాబినెట్ స్థానం లభిస్తుందనే వార్తలు వచ్చాయి. చిరంజీవి 2009 ఎన్నికల్లో తిరుపతి నుంచే పోటీ చేసి గెలుపొందారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత ఆయనకు రాజ్యసభ సభ్యత్వం నజరానాగా లభించడంతో అసెంబ్లీకి రాజీనామా చేశారు. దీంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. తన రాజకీయ భవిష్యత్తుతో ముడిపడిన ఎన్నికలను చిరంజీవి కూడా సవాల్ గా తీసుకున్నారు. మండుటెండలను సైతం లెక్కచేయకుండా నియోజకవర్గం అంతా ప్రచారం చేశారు. జగన్ పై వ్యక్తిగత వైరం లేకపోయినప్పటికీ ఆయన్ని ఎన్నికల ప్రచారం సందర్భంగా తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ తో పాటు మాజీ పి.ఆర్.పి. శ్రేణులు కూడా కలిసి వస్తే వెంకట రణమ విజయం నల్లేరుపై నడకేనని ఆయన అంచనా వేశారు. ఇక్కడ కాంగ్రెస్ విజయం సాధిస్తే అధిస్థానం తనకు కేంద్ర క్యాబినెట్ లో చోటు కల్పిస్తుందన్న హామీ వుండడంతో ఆయన రెచ్చిపోయి మరీ ఎన్నికల ప్రచారం చేశారు. అయితే అనూహ్యంగా అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి పరాజయం పాలవడంతో చిరంజీవి కంగుతిన్నారు. గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన స్థానంలో తిరిగి తన మద్దతుతో బరిలోకి దిగిన అభ్యర్థిని గెలిపించుకోలేకపోయాడనే అపవాదును ఆయన మూతగాట్టుకున్నట్లయింది. ఈ ఓటమితో రాష్ట్ర కాంగ్రెస్ లో చిరంజీవికి ప్రాధాన్యత తగ్గే అవకాశం ఉంటుంది.