గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సుమారు 37.03 శాతం ఓట్లు, తెలుగుదేశంపార్టీకి 35.66 శాతం ఓట్లు, ప్రజారాజ్యం పార్టీకి సుమారు 15.6 శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం విలీనం కావటంతో ఈ ఓట్ల శాతం 51 శాతంకు పెరిగింది. దీనికి తోడు టిడిపికి ఉన్న 35.56 శాతాన్ని కూడా కలిపితే సుమారు 87 శాతం ఓట్లు ఈ మూడు పార్టీలకు వచ్చినట్లు భావించాలి. అయితే 0 స్థాయినుంచి ప్రారంభమైన వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలను మట్టికరిపించింది. ఒకరకంగా చెప్పాలంటే బైబిల్ కథలోని డేవిడ్ అనే చిన్నకుర్రాడు తన చేతిలోని వడిశేలతో గొలియత్ అనే ఒక భీకరాకురుడిని హతం చేసిన సంఘటన గుర్తుకు వస్తుంది. ఇక్కడ జగన్ అనే జూనియర్ రాజకీయనాయకుడు ఏకంగా ఇద్దరు ప్రత్యర్థులకు ఒకేసారి మట్టికరిపించాడు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, టిడిపిలతో పాటు బలమైన మీడియా వర్గాలు కూడా జగన్ కు వ్యతిరేకంగా తీవ్రంగా స్పందించాయి. సోనియాగాంధీ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తేసుకుని వాయలార్ రవి, గులాంనబీ ఆజాద్ వంటి సీనియర్లకు ఎన్నికల ప్రచారానికి పంపింది. అలాగే టిడిపి అన్ని చోట్ల ఏరికోరి డబ్బున్నవారికే టిక్కెట్లు కట్టబెట్టింది. ఇక జగన్ ను వ్యతిరేకించే ఎలక్ట్రానిక్ ఛానల్స్, వార్తాపత్రికలు జగన్ అవినీతిపై పుంఖానుపుంఖాలుగా వ్యతిరేక వార్తలు గుప్పించాయి. జగన్ కు ఓటు వేస్తే ప్రజలు అవినీతిని సమర్థించినట్లేనని తీర్మానించాయి. అయినా ఓటర్లు మాత్రం ఇవేవీ పట్టించుకోలేదు. అవినీతి ఆరోపణలు అందరిపైనా ఉన్నాయంటూ జగన్ కె తమ మద్దతును ప్రకటించారు.