బెంగుళూరు : సెక్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద స్వామికి బెయిల్ దొరికింది. దైవ స్వరూపుడుగా చెప్పుకుంటున్న వివాదస్పద నిత్యానందస్వామి బుధవారం అరెస్టయిన విషయం తెల్సిందే. రామనగరా ఫస్ట్ క్లాస్ జుడీషియల్ మెజిస్ట్రేట్ కోమల కోర్టు గురువారం అతనికి బెయిల్ మంజూరు చేశారు. ఇక్కడికి 40 కి.మీ దూరంలో ఉన్న రామనగరా కోర్టులో లొంగిపోయిన అనంతరం నిత్యానందకు ఒక రోజు పోలీసు కస్టడీని కోర్టు విధించింది. అనంతరం ఆయన బెయిల్ పిటీషన్ వేసాడు. నేర ఆరోపణలు, అత్యాచారం కేసులలో 2010లో అరెస్టు అయిన అనంతరం బెయిల్‌పై వచ్చారు. ఇక్కడకు సమీపంలో ఉన్న బిదాడి ఆశ్రమం లో విలేకరుల సమావేశం నిర్వహించే సమయంలో విలేకరిపై అతను దాడి చేశారనే ఆరోపణలపై జూన్ 8న పోలీసులు కేసు నమోదు చేయడంతో కొత్త సమస్యలు మొదలయ్యాయి. అమెరికాకు చెందిన మహిళ నిత్యానంద తనను గత 5 సంవత్సరాలుగా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని విలేకరుల సమావేశంలో ఆరోపించడంతో ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తంచేశారు. ఆయనపై పోలీసులు అరెస్టు వారెంటు జారీ చేసిన తర్వాత అతని కోసం ఉన్నతాధికారుల బృందం, పోలీసులు తీవ్రంగా గాలించారు. చివరకు తానే స్వయంగా లొంగిపోయాడు.