కాగా చిరంజీవి మనవరాలు ప్రమాదవశాత్తూ భవనంపై నుండి పడిపోవడంతో చిన్నారి తలకు దెబ్బలు తగిలిన విషయం తెలిసిందే. అక్కడే ఉన్న చిరంజీవి వెంటనే స్వయంగా అపోలో ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. ప్రస్తుతం ఆ పాప చికిత్స పొందుతోంది. చిరు తనయుడు రామ్ చరణ్ తేజ పెళ్లి వేడుకలలో భాగంగా సోమవారం మెహందీ వేడుకను నగరంలోని ఓ స్డూడియోలో నిర్వహిస్తున్నారు.
చిరంజీవి, అల్లు అరవింద్ కుటుంబ సభ్యులతో పాటు సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత కూతురు ఆడుకుంటూ భవనం చివరి అంచు వరకూ వచ్చింది. అక్కడ ఉన్న వారు చూసి పిలిచేలోగా కిందకు పడిపోయింది.
దీంతో ఆమె తలకు గాయాలయ్యాయి. అది గమనించిన చిరంజీవి వెంటనే కారులో అపోలో ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. అపోలో గ్రూపు ఆసుపత్రుల చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి, రామ్ చరణ్ తేజ, అల్లు అర్జున్ సహా చిరంజీవి కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలి వచ్చారు. ఆసుపత్రి సిఈవో హరిప్రసాద్ నేతృత్వంలో ఐసియులో చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది.
కాగా చిరంజీవి రెండు రోజుల క్రితం వరకు ఉప ఎన్నికల ప్రచారంలో హడావుడిగా ఉన్న విషయం తెలిసిందే. తనయుడి పెళ్లి మరికొద్ది రోజులలో ఉన్నప్పటికీ ఆ బాధ్యతలను కుటుంబ సభ్యులపై వేసి చిరంజీవి ప్రచారంలో జోరుగా పాల్గొన్నారు. రెండు రోజుల క్రితం ప్రచారం పూర్తవడంతో ఇప్పుడు చిరంజీవి కూడా పెళ్లి పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు.