NEWS

Blogger Widgets

15.6.12

మహిళా అథ్లెట్ పింకీపై రేప్ కేసు!



కోల్‌కతా, జూన్ 14: భారత మహిళా అథ్లెట్ పింకీ ప్రామాణిక్‌పై రేప్ కేసు నమోదైంది. అత్యంత ఆశ్చర్యకరంగా, పింకీ మహిళ కాదని, పురుషుడనీ ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బ్రాగుటీ పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఎంతోకాలంగా తనతో ప్రేమ వ్యవహారం నడిపిన పింకీ పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేసి మోసం చేసినట్టు ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. తనను బలాత్కరించినట్టు ఆరోపించింది. పింకీ 2006లో జరిగిన దోహా ఏసియాడ్‌లో 4న400 మీటర్ల రిలేలో స్వర్ణ పతకం సాధించింది. అదే ఏడాది మెల్బోర్న్ కామనె్వల్త్ గేమ్స్‌లో పాల్గొన్న ఆమె అదే ఈవెంట్‌లో రజత పతకం గెల్చుకుంది. 2006లోనే కొలంబోలో జరిగిన శాఫ్ క్రీడల్లో 400 మీటర్లు, 800 మీటర్ల పరుగుతోపాటు 4న400 మీటర్ల రిలేలో స్వర్ణ పతకం సాధించింది. ప్రతిభగల అథ్లెట్‌గా గుర్తింపు పొందిన పింకీ మహిళ కాదని ఇప్పుడు ఫిర్యాదు అందడంతో ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పింకీ మహిళ కాదని, తప్పుడు సర్ట్ఫికెట్లతో మహిళల విభాగంలో పోటీపడినట్టు రుజువైతే కఠిన చర్యలు తప్పవని భారత అథ్లెటిక్ సమాఖ్య స్పష్టం చేసింది. కాగా, పింకీపై కేసు నమోదు కావడం ఇదే మొదటిసారి కాదు. 2004 నవంబర్ 22న నాదియాలో కొంతమంది స్థానికులు ఆమె బ్యాగును తస్కరించారు. అందులో తుపాకీ కనిపించడంతో ఈ విషయాన్ని పోలీస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అప్పట్లో ఆమెపై అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నందుకు కేసు నమోదైంది. ఇంతకీ పింకీ మహిళనా లేక పురుషుడా అన్నది తేలాల్సి ఉంది. బాధితురాలు ఫిర్యాదు చేసినట్టు రుజువైతే, మన దేశంలో ఒక పురుషులు తప్పుడు సమాచారమిచ్చి మహిళల విభాగంలో పోటీ పడిన తొలి కేసుగా నమోదవుతుంది.
ఇలావుంటే, పింకీలో పురుషులకు ఉండే హార్మోన్లు ఎక్కువగా ఉన్నాయని బెంగాల్ అథ్లెటిక్స్ సంఘం అధికారులు తెలిపారు. దోహా ఆసియా గేమ్స్ తర్వాత ఆమె అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనలేదన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. పురుషుల హార్మోన్లు ఎక్కువ ఉన్నంత మాత్రాన ఒక మహిళా అథ్లెట్‌ను పోటీ నుంచి తొలగించడంగానీ, మహిళల విభాగంలో పోటీ చేయరాదని నిషేధించడంగానీ జరగదని స్పష్టం చేశారు.