NEWS

Blogger Widgets

15.6.12

తారాస్థాయికి టెన్షన్లు .. కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్


    ఏలూరు, జూన్ 14: జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుండి ప్రాతినిధ్యం వహించడానికి ఇద్దరికి అధికారం కట్టబెడుతూ ప్రజలిచ్చిన తీర్పు వెలువడటానికి మరికొద్ది గంటలు మాత్రమే గడువు ఉంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలలో భద్రంగా ఉన్న ఓట్ల కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. నర్సాపురం, పోలవరం అసెంబ్లీ సిగ్మెంట్ల నుండి పోటీ పడిన అభ్యర్ధుల్లో టెన్షన్ ప్రారంభమైంది. నర్సాపురం నుండి తొమ్మిదిమంది, పోలవరం నుండి ఆరుగురు పోటీపడగా వీరందరి భవితవ్యం శుక్రవారం వెల్లడికానుంది. ఓట్ల లెక్కింపు కార్యక్రమం కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా కేంద్రమైన ఏలూరులో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఈసారి కూడా త్రిముఖ పోటీ ఉండటంతో ఖచ్చితంగా తాను విజయం సాధించగలనని ఏ ఒక్క అభ్యర్ధి కూడా ధీమా వ్యక్తం చేయలేని పరిస్ధితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రజాశాంతి, సిపిఎం పార్టీలతోపాటు పలువురు ఇండిపెండెంట్ అభ్యర్ధులు కూడా పోటీలో ఉన్నారు. అయితే ఈ రెండు నియోజకవర్గాల్లోనూ ప్రధాన పోటీ కాంగ్రెస్-తెలుగుదేశం-వైఎస్సార్‌సిపిల మధ్యే నెలకొని ఉంది. వివిధ సమీకరణాలు, వెన్నుపోట్లు బేరీజు వేసుకుంటూ గెలుపు తమదేనని మూడు పార్టీల అభ్యర్ధులు మేకపోతు గాంభీర్యం వ్యక్తం చేస్తున్నప్పటికీ లోలోపల మాత్రం అందరిలోనూ కనపడని గుబులు వ్యక్తమవుతోంది. కొంతమంది అభ్యర్ధులు కోట్లాది రూపాయలు వ్యయం చేసినా వారిలో సైతం గెలుపు ధీమా వ్యక్తం కావటం లేదు. ఎవరికివారు తమ పరిధిలో కూడికలు, తీసివేతల్లో నిమగ్నమయ్యారు. ఈ రెండు స్ధానాల్లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. అయితే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు, కడప ఎంపి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి సొంతంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్ధాపించటంతో ఒక్కసారిగా రాజకీయ పరిస్దితుల్లో మార్పు వచ్చింది. ఆయనకు మద్దతుగా ఈ రెండు నియోజకవర్గాల సిట్టింగ్ ఎమ్మెల్యేలు వ్యవహరించటం వారిపై అనర్హత వేటు పడటంతో ఈ ఉపఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. గతంలో కాంగ్రెస్-తెలుగుదేశం పార్టీల మధ్యే నువ్వా-నేనా అన్న రీతిలో పోటీ నెలకొంటూ ఉండగా గత ఎన్నికల్లో పీఆర్పీ కూడా రంగంలోకి దిగటంతో రాజకీయసమీకరణాలతోపాటు వర్గ సమీకరణాల్లో కూడా మార్పు కొట్టొచ్చినట్లు కన్పించింది. అయితే పిఆర్పీ కూడా కాంగ్రెస్‌లో విలీనం కావటం, కొత్తగా వైఎస్సార్‌సిపి ఆవిర్భవించి జిల్లాలో బోణి కొట్టాలని కృతనిశ్చయంతో ఉండటంతో ఎవరికివారు ఈ రెండు స్ధానాలు దక్కించుకోవాలని సర్వశక్తులు ఒడ్డారు. అయితే ప్రతిసారి వైవిధ్యభరితమైన తీర్పును ఇస్తూ అటు రాజకీయపరిశీలకులను కూడా ఆశ్చర్యచకితులను చేసే ఈ రెండు నియోజకవర్గాల ఓటరు దేవుళ్ల కరుణ ఈసారి ఎవరిపై పడిందోనని అభ్యర్ధులంతా ఎదురుతెన్నులు చూస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్ధులందరూ అనుభవజ్ఞులైన వారినే కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించుకున్నారు. ఏలూరులోనే రెండు నియోజకవర్గాల కౌంటింగ్ జరగనుండటంతో అభ్యర్ధులంతా పెద్దఎత్తున అనుచరులతో ఏలూరు తరలివచ్చేందుకు భారీగా ఏర్పాట్లు చేసుకున్నారు. గురువారం రాత్రికే చాలామంది ఏలూరు చేరుకున్నారు. దీంతో ఏలూరులోని అన్ని ప్రముఖ హోటళ్లు, లాడ్జిల రూములన్నీ ఇప్పటికే పార్టీల అభ్యర్ధులు, నాయకుల పేరిట రిజర్వు అయిపోయాయి. అయితే కౌంటింగ్ కేంద్రాల్లో సెల్‌ఫోన్లు నిషేధించటంతో అభ్యర్ధులు ఒకింత నిరాశకు లోనైయ్యారు. నిముషనిముషానికి ఫలితాలు తెలుసుకుని తమ బంధువులు, అనుచరులతో ఆనందాన్ని పంచుకోవాలనుకున్న అభ్యర్ధులు ఈ నిర్ణయంతో హతాశులయ్యారు. లెక్కింపు కార్యక్రమం దగ్గరపడుతున్న కొద్ది జిల్లాలో పందాల జోరు కూడా తారాస్ధాయికి చేరుకుంది.
బారికేడ్ల ఏర్పాటులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన
అర్‌అండ్‌బి డిఇపై కలెక్టర్ ఆగ్రహం
ఏలూరు, జూన్ 14: వట్లూరు పాలిటెక్నిక్ కళాశాల వద్ద శుక్రవారం నిర్వహించనున్న ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా బారికేడ్ల ఏర్పాటులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అర్‌అండ్‌బి డిఇ వీర అర్జునరావుపై కలెక్టరు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతగా పనులు చేయాల్సిన అధికారులు ఈవిధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించటం సహించబోనని, ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద యుద్దప్రాతిపదికన బారికేడ్లు ఏర్పాటుచేయాలని ఆదేశించారు.
వట్లూరులోని సర్ సిఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టరు తెలిపారు. జిల్లా ఎస్పీ ఎం రమేష్‌తో కలిసి ఆమె వాహనాల పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించారు. ఓట్ల లెక్కింపు కేంద్రానికి వంద మీటర్ల దూరంలోనే వాహనాలను నిలిపివేయటం జరుగుతుందన్నారు. కౌంటింగ్‌కు వచ్చే అభ్యర్ధులు, ఏజెంట్లు, కౌంటింగ్ సిబ్బంది తమ వాహనాలను ఇంజనీరింగ్ కళాశాలలో పార్కింగ్ చేసుకోవచ్చునన్నారు. కలెక్టరు వెంట అదనపు ఎస్పీ సత్యనారాయణ, అదనపు జెసి ఎంవి శేషగిరిబాబు, డిఆర్వో మోహనరాజు, ఆర్డీవోలు కె నాగేశ్వరరావు, సత్యనారాయణ, వసంతరావు, సూర్యారావు తదితరులు ఉన్నారు.
నేడే కౌంటింగ్
ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం
ఏలూరు, జూన్ 14: జిల్లాలో ఉప ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టరు డాక్టరు జి వాణిమోహన్ తెలిపారు. ఓట్ల లెక్కింపు, ఇతర వివరాలు ఇలా ఉన్నాయి.
* జిల్లాలో నర్సాపురం, పోలవరం అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 15మంది అభ్యర్ధులు పోటీపడ్డారు.
* నర్సాపురం నియోజకవర్గంలో మొత్తం 141834 మంది ఓటర్లకుగాను 124208మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.
* పోలవరం నియోజకవర్గంలో మొత్తం 172189 మంది ఓటర్లకుగాను 149966మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు.
* ఒక్కొక్క నియోజకవర్గానికి 14 చొప్పున టేబుళ్లను ఓట్ల లెక్కింపునకు వినియోగిస్తున్నారు.
* 56మంది కౌంటింగ్ సిబ్బందిని, మైక్రో అబ్జర్వర్లను నియమించారు.
* శుక్రవారం ఉదయం 8గంటలకు కౌంటింగ్ మొదలుకాగానే తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. రెండు అసెంబ్లీ నియోజకవర్గాల బ్యాలెట్ పత్రాలను సంబంధిత నియోజకవర్గాల టేబుళ్ల మీద లెక్కిస్తారు. * బ్యాలెట్ పత్రాల లెక్కింపునకు సుమారు అరగంట సమయం పడుతుందని భావిస్తున్నారు. అనంతరం 8.30గంటలకు ఈవిఎంలలో ఓట్ల లెక్కింపు మొదలవుతుంది.
* ఒక్కో టేబుల్ వద్ద అభ్యర్ధి తరపున ఒక్కో ఏజెంటు ఉంటారు.
* ప్రతి టేబుల్ దగ్గర అధికారులపరంగా కౌంటింగ్ పర్యవేక్షకుడు, సహాయకుడితోపాటు సూక్ష్మ పరిశీలకుడు ఉంటారు. ప్రతి రౌండ్‌లోనూ ఏజెంట్ల సంతకాలు తీసుకుంటారు.
* ఓట్ల లెక్కింపు సిబ్బంది ఏ నియోజకవర్గంలో, ఏ టేబుల్ వద్ద ఉంటారనేది శుక్రవారం ఉదయం 5గంటలకు జిల్లా కలెక్టరు, ఎన్నికల పరిశీలకుల సమక్షంలో కంప్యూటర్ ద్వారా నిర్ణయిస్తారు.
* ప్రతి నియోజకవర్గానికి ఒక రిటర్నింగ్ అధికారి ఉంటారు. అయన టేబుల్ వద్ద అభ్యర్ధితో పాటు నియోజకవర్గ పరిశీలకుడు ఉంటారు.
* అభ్యర్ధులు, ఎన్నికల ఏజెంట్లు, లెక్కింపు సిబ్బంది కూడా శుక్రవారం ఉదయం 7గంటలకే కౌంటింగ్ కేంద్రాలకు రావాలి. అతర్వాత వచ్చేవారినెవర్ని అనుమతించే అవకాశం లేదని కలెక్టరు స్పష్టం చేశారు.
* ఆయా నియోజకవర్గాల్లో ఒకటో పోలింగ్ కేంద్రం నుంచే లెక్కింపు మొదలవుతుంది.
* ప్రతి రౌండ్‌కు ఎన్నికల పరిశీలకులు రాండమ్‌గా రెండు ఈవిఎంలను రీకౌంటింగ్ చేస్తారు. ఒక వేళ ఏదైనా తేడా వస్తే అక్కడి కౌంటింగ్ సిబ్బందిపై చర్యలు తీసుకుంటారు. వెంటనే కొత్త సిబ్బందిని నియమిస్తారు.
* ప్రతి కౌంటింగ్ హాలులోనికి 14+1 మంది కౌంటింగ్ ఏజెంట్లను అనుమతిస్తారు.
* మొత్తం ఓట్ల లెక్కింపు ప్రక్రియను వీడియోగ్రఫి చేయిస్తారు.
* ఒక్కో అసెంబ్లీ సిగ్మెంట్‌కు ఎలక్ట్రానిక్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసిఐఎల్) నుంచి వచ్చిన ఒక్కో ఇంజనీరును కేటాయించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రంలో ఏదైనా సాంకేతిక సమస్య ఏర్పడిన వెంటనే వారు సరిచేస్తారు.
* భద్రతాపరంగా మెయిన్‌గేట్ వద్ద ఒక మేజిస్ట్రేట్‌ను ఉంచుతారు. అత్యవసర పరిస్దితుల్లో ఆదేశాలు జారీ చేయడానికి ఈ మేజిస్ట్రేట్ ఉపయోగపడతారు.
* ఓట్ల లెక్కింపు జరిగే కేంద్రాల పరిధిలో మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు.
భీమవరంలో ఉన్మాది వీరంగం
* దాడిలో మృతిచెందిన మున్సిపల్ ఉద్యోగి* పలువురికి గాయాలు* ఉన్మాదికి స్థానికుల దేహశుద్ధి
భీమవరం, జూన్ 14: భీమవరంలో ఉన్మాది కత్తితో వీరంగం చేశాడు. పలువురు గాయపడడంతో పాటు ఒక మున్సిపల్ ఉద్యోగి మృత్యువాత పడ్డాడు. స్థానిక నాచువారి సెంటర్లో గురువారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. వీరంగం చేసిన ఉన్మాదికి స్థానికులు దేహశుద్ధి చేసి ట్రక్కులో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఒంటినిండా గాయాలు, తలపై బలమైన గాయాలతో భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్మాది శ్రీను చికిత్స పొందుతున్నాడు. మృతిచెందిన మున్సిపల్ ఉద్యోగి షేక్ మీరాసాహెబ్ (57)గా పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలానికి పోలీసులు హుటాహుటిన తరలి వెళ్ళారు. మృతదేహాన్ని వన్‌టౌన్ సిఐ కె.రమణారావు పరిశీలించారు. ఉన్మాది శ్రీను గతంలో ఇదే విధంగా దాడికి పాల్పడ్డాడని స్థానికులు చెబుతున్నారు. ఉన్మాది చేసిన దాడిలో గాయపడ్డ పలువురి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. స్థానిక నాచువారి సెంటర్లోని ఒక సిమెంటు దుకాణంలో ట్రక్కు డ్రైవర్‌గా శ్రీను పనిచేస్తున్నాడు. అయితే కొన్ని సందర్భాల్లో మతిస్థిమితం సరిగా లేక ఎవరిపైన పడితే వారిపైన దాడి చేస్తాడని స్థానికులు తెలిపారు. ఏం జరిగిందో తెలియదు గానీ ఒక్కసారిగా శ్రీను సమీపంలో ఉన్న కొబ్బరి బొండాలు అమ్మే దుకాణం వద్ద ఉన్న కత్తి తీసుకుని వీరంగం చేయడం ప్రారంభించాడని పోలీసులు తెలిపారు. స్థానిక పద్మాలయ థియేటర్ వద్ద దివ్యశ్రీ మెస్ సమీపంలో నివశిస్తున్న షేక్ మీరాసాహెబ్ (57) పిఎస్‌ఎం గరల్స్ హైస్కూలులో నైట్ వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. అతని కుమారుడు షేక్ అక్బర్ తండ్రిని తీసుకుని సాయంత్రం 5 గంటల సమీపంలో పాఠశాల వద్దకు తీసుకువెళ్ళి విడిచివెళ్లాడు. అక్బర్ స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే శ్రీను కత్తితో వీరంగం చేసిన సమయంలో అటుగా వెళ్తున్న ఒక యువతి, మరో యువకుడిపై దాడిచేసినట్టు పోలీసులు చెబుతున్నారు. అయితే వారి వివరాలు తెలియాల్సి వుందన్నారు. వారిపై దాడి చేసిన తరువాత పాఠశాల సమీపంలో ఉన్న నైట్ వాచ్‌మైన్ షేక్ మీరాసాహెబ్‌పై కత్తితో దారుణంగా దాడిచేశాడు. ఈ ఘటనను చూసిన స్థానికులు వెంటనే వెళ్ళి కత్తితో వీరంగం చేస్తున్న శ్రీనుకు దేహశుద్ధి చేశారు. ఇంతలో కొన ఊపిరితో ఉన్న మున్సిపల్ ఉద్యోగి షేక్ మీరాసాహెబ్‌ను 108 ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా అప్పటికే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న షేక్ మీరాసాహెబ్ భార్య షేక్ నబీన్ బీబీ, కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుని భోరున విలపించారు. వన్‌టౌన్ సిఐ కె.రమణారావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. వన్‌టౌన్ ఎస్సై డి.వెంకటేశ్వరరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
కోట్లకు పైగా సాగిన పందాలు
అభ్యర్థులతో ఎంతమంది గల్లంతో
ఏలూరు, జూన్ 14: శాసనసభ ఉపఎన్నికల్లో అభ్యర్ధుల గెలుపుపై భారీగా పందాలు సాగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా విచిత్రమైన రీతిలో ఈసారి పందాలు సాగటం గమనార్హం. ఫలానా అభ్యర్ధి విజయం సాధిస్తాడని, ఓడిపోయే అభ్యర్ధులు రెండు, మూడు స్ధానాల్లో ఏది సాధిస్తారన్న దానిపై కూడా పందాలు సాగటం విశేషం. అదీకాకుండా ఫలానా పార్టీకి జిల్లాలో ఎన్ని సీట్లు వస్తాయి, ప్రత్యర్ధి పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి తదితర అంశాలు ఆధారంగా కూడా పందాలు సాగాయి. క్రికెట్ బెట్టింగ్‌కు మించి ఈసారి రాజకీయ పందాల జోరు కొనసాగింది. ఫలానా ప్రాంతంలో తమపార్టీ అభ్యర్ధికి ఇన్ని ఓట్ల మెజార్టీ వస్తుందని కూడా పందాలరాయుళ్లు పందాలు కాసారు. జిల్లాలో ఎప్పటిమాదిరిగానే ధనవంతులను బికారులుగా మార్చేంతగా కోట్లాది రూపాయల పందాలు సాగాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కొంతమంది వ్యక్తులు కార్లలో డబ్బు తెచ్చి మరీ కోట్ల రూపాయల మేర పందాలు కాస్తుండటంతో పరిస్ధితి తీవ్రస్దాయికి చేరింది. ధనవంతుల సంగతి పక్కనపెడితే మధ్యతరగతి వ్యక్తులు ఈ వ్యసనం వల్ల బికారులుగా మారే ప్రమాదం పొంచి ఉండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. కొంతకాలంగా తాము సంపాదించిన మొత్తాన్ని పందాలలో ఒడ్డుతున్నారు. ఫలితం తారుమారు అయితే అటువంటి వారంతా రోడ్డున పడటం ఖాయం. జిల్లాలో ఉపఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటినుండే మరే ప్రాంతంలో జరగని రీతిలో పలుచోట్ల పందాలు కోట్ల రూపాయల్లో జరిగిపోతున్నాయి. ఏ ప్రాంతంలో చూసినా ఫలానా అభ్యర్ధి గెలుస్తాడు, మీ వారు ఎవరైనా పందాలు కాస్తారా అంటూ కొంతమంది వ్యక్తులు పని గట్టుకుని మరీ పందాలను ప్రోత్సహిస్తున్నారు. మరికొంతమంది అయితే అ పార్టీ అభ్యర్ధి మూడవ స్ధానంలో నిలుస్తాడని 50లక్షల రూపాయల వరకు పందెం ఉంది, ఎవరైనా పందెం కాసేవారు ఉంటే తమకు తెలియజేయాలని కిళ్లీషాపు యజమానులు, కాఫీహోటళ్ల యాజమానులకు చెప్పి పోతున్నారు. వారికి తమ సెల్‌ఫోన్ నెంబర్లు ఇచ్చి పందెం కాసే వారు ఎవరైనా వస్తే అ నెంబరుకు ఫోన్ చేయాలని చెప్పి వెళుతున్నారు. ప్రధానంగా కడప ఎంపి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి స్ధాపించిన వైఎస్సార్‌సిపిపై ఈసారి భారీస్ధాయిలో పందాలు జరిగాయి. రెండు నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్‌సిపి అభ్యర్ధులపై లక్షల రూపాయల మేర పందాలు కొనసాగాయి. జిల్లా కేంద్రానికి సమీపంలోని ఒక ప్రజాప్రతినిధి పోలవరంలో వైఎస్సార్‌సిపి అభ్యర్ధి విజయం సాధిస్తారని దాదాపుగా 40 లక్షల రూపాయలు పందెం కాసారంటే పరిస్దితి అర్ధం చేసుకోవచ్చు. ఇదే నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి మూడవ స్దానంలో ఉంటారని కొంతమంది వ్యక్తులు లక్షల రూపాయల్లో పందాలు కాసారు. తమ పందెం 80వేలు అయితే పందెం కాసేవారు లక్ష రూపాయలు ఇవ్వాలని షరతు పెట్టి మరీ పందాలు కాయటం విశేషం. ఉభయగోదావరి జిల్లాలోని నర్సాపురం, పోలవరం, రామచంద్రాపురం కలుపుకుంటే దాదాపు వంద కోట్ల రూపాయల పందాలు జరిగాయని అంచనా. హైదరాబాద్, కృష్ణా, గుంటూరు, ఖమ్మం, శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల నుండి ప్రముఖులు జిల్లాలోని రెండు అసెంబ్లీ సిగ్మెంట్ల నుంచి పోటీ చేసిన అభ్యర్ధులపై కోట్లాది రూపాయల పందాలు కాసారు. నర్సాపురం నియోజకవర్గంలో తొలుత వైఎస్సార్‌సిపి అభ్యర్ధిపై భారీ పందాలు కాసినవారు పోలింగ్ పూర్తయిన తర్వాత గాలి మారిందన్న ఉద్దేశ్యంతో పందాలు మార్చేందుకు అవకాశం లేకపోవటంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిపైన కూడా అంతకుముందు కాసిన మొత్తానికే పందాలు కాయటం విశేషం. ఒకటికి రెండు రెట్ల రీతిలో పందాలు జరిగాయి. అదేవిధంగా జిల్లాలోని రెండు అసెంబ్లీ స్ధానాలు వైఎస్సార్‌సిపికి వస్తాయని దాదాపు 20కోట్ల రూపాయల వరకు పందాలు జరిగినట్లు సమాచారం. ఇక అధికార పార్టీకి నర్సాపురం స్ధానం తప్పకుండా వస్తుందని మరో 20 కోట్ల కోట్ల రూపాయల వరకు పందాలు జరిగాయి. ఇక పోలవరం నియోజకవర్గానికి వస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి విజయం సాధిస్తారని కోట్ల రూపాయల్లోనే పందాలు జరిగాయి. మరోవైపు జిల్లాలో పలుచోట్ల పందాల కోసం ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటుచేశారు. అదేవిధంగా చేపల చెర్వులు, వ్యవసాయభూములను కూడా పందాలు కాసారు. ఒకప్రక్క ఎవరు నెగ్గుతారో చెప్పలేకుండా ఉన్నామంటూనే పందెం ప్రియులు కోట్లాది రూపాయలను పందాలుగా కాయటం విశేషం. మధ్యతరగతికి చెందిన వ్యక్తులు ఈసారి వేలంవెర్రిగా లక్షల రూపాయల్లో పందాలు కాసారు. లక్ష రూపాయలు లోపు పందెం కాస్తే నామోషీగా భావించి పదిమంది కలిసి రెండు లక్షల రూపాయలను పోగుచేసి పందాలు కాస్తున్నారు. పందెం గెలిస్తే ఫర్వాలేదుగాని ఫలితం ఏమాత్రం ప్రతికూలంగా వచ్చినా వీరిలో చాలామంది రోడ్డున పడేలా ఉన్నారు. కౌంటింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్ది పందాల జోరు ఏమాత్రం తగ్గకపోవటం గమనార్హం. కొంతమంది ఇప్పటికీ నగదు పట్టుకుని వాహనాల్లో తిరుగుతూ పందెం కాస్తావా అంటూ ప్రత్యేకంగా అడుగుతుండటం విశేషం.
ఆ పోలింగ్ స్టేషన్లపైనే అందరి దృష్టి
ఏలూరు, జూన్ 14: ఉపఎన్నికలు జరిగిన నర్సాపురం, పోలవరం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 90శాతం పైబడి పోలింగ్ జరిగిన పోలింగ్ స్టేషన్లపైనే అందరి దృష్టి నిల్చి ఉంది. అభ్యర్ధుల విజయంలో ఈ పోలింగ్ స్టేషన్లు మలుపుతిప్పే అవకాశం ఉండటంతో ఇప్పుడు వీటిపైనే చర్చ జరుగుతోంది. ఇలాంటి పోలింగ్ స్టేషన్లు గతంతో పోల్చుకుంటే వీటి సంఖ్య పెద్దగానే పెరిగింది. కొందరు అభ్యర్ధులు ప్రత్యేకంగా కృషి చేయటం వల్లే సంబంధిత పోలింగ్ స్టేషన్లలో ఊహాతీతంగా పోలింగ్ పెరిగిపోయింది. తమకు పట్టు ఉన్న పోలింగ్ స్టేషన్లలో భారీఎత్తున పోలింగ్ జరగటం వల్ల తమ విజయావకాశాలు గణనీయంగా మెరుగుపడినట్లేనని కొందరు అభ్యర్ధులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నర్సాపురం నియోజకవర్గం పరిధిలో 90శాతం పైబడి పోలింగ్ జరిగిన పోలింగ్ స్టేషన్లు 50కు పైబడి ఉన్నాయంటే అక్కడ ఏమేరకు పోలింగ్ జరిగిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ ఎన్నికలలో ఫలితం ఉత్కంఠగా మారిన నేపధ్యంలో ఏ అభ్యర్ధికైనా మెజార్టీ అతితక్కువగా ఉండే అవకాశం ఉండటంతో 90శాతం పైబడి పోలింగ్ జరిగిన స్టేషన్లపై ఇప్పుడు అందరి దృష్టి మరలింది. 90శాతం పైబడి పోలింగ్ జరిగిన స్టేషన్లలో ఓట్లన్నీ దాదాపుగా ఒకవైపే ఉండవచ్చునని కొందరి భావన. దీనికి కారణంగా సంబంధిత పార్టీ బలంగా ఉన్న ప్రాంతాలలోనే భారీ పోలింగ్ జరిగింది. ఈవిధంగా పోలింగ్‌స్టేషన్ల వారీగా పార్టీలు లెక్కలు వేసుకుని విజయావకాశాలను అంచనా వేసుకుంటున్నారు. ప్రధానంగా ఈసారి నర్సాపురం నియోజకవర్గంలో పోటీపై ఎక్కువ ఉత్కంఠ నెలకొని ఉండటంతో 90శాతం పైబడి పోలింగ్ జరిగిన పోలింగ్ స్టేషన్లను గుర్తించి అక్కడి నాయకులు, పార్టీ క్యాడర్‌తో సమీక్షలు నిర్వహించి కొంతమంది అభ్యర్ధులు తమ విజయావకాశాలను లెక్కించుకుంటున్నారు. ఈ పోలింగ్ స్టేషన్ల వివరాలు సేకరించిన నేతలు అయా ప్రాంతాల్లో తమ పార్టీకి ఉన్న ప్రాబల్యం, సామాజిక అంశాలను పరిగణనలోకి తీసుకుని లెక్కలు వేస్తున్నాయి. వీటి ఆధారంగా తమకున్న విజయావకాశాలను బేరీజు వేసుకుని గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పోలింగ్ స్టేషన్లలో కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్సార్‌సిపిలకు కూడా భారీగానే ఓట్లు పోల్ అయ్యాయని, ఈకారణంగా ఫలానా అభ్యర్ధికి ఏకమొత్తంగా ఓట్లు పడ్డాయని తేల్చలేమని రాజకీయ విశే్లషకులు పేర్కొంటున్నారు. మొత్తంమీద నర్సాపురంలో ఈ పోలింగ్ స్టేషన్లపైనే ప్రధాన చర్చ జరగటం విశేషం. ఇక రసవత్తర పోరుకు వేదికగా మారిన పోలవరం నియోజకవర్గంలో కూడా 90శాతానికి పైగా పోలింగ్ జరిగిన పోలింగ్ స్టేషన్లు చాలా ఉన్నాయి. 2009 సార్వత్రిక ఎన్నికల సమయంలో నమోదైన పోలింగ్ కన్నా ఇక్కడ ఈ ఉపఎన్నికల్లో ఎక్కువశాతం పోలింగ్ నమోదు కావటం గమనార్హం. ఇక్కడ కూడా మూడు పార్టీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొని ఉండటంతో 90శాతం పైబడి పోలింగ్ జరిగిన పోలింగ్ స్టేషన్ల వివరాలు సేకరించిన నేతలు ఎక్కడెక్కడ ఏఏ పార్టీకి అధిక ఓట్లు పడ్డాయన్న అంశంపై అంచనాలు వేస్తున్నాయి. వీటి ఆధారంగానే గెలుపు అవకాశాలు ఆధారపడి ఉంటాయని భావించి అయా పోలింగ్ స్టేషన్లలో మొత్తం ఓట్లు, సామాజికపరంగా ఉన్న ఓట్లు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ లెక్కలు కడుతున్నారు. ముఖ్యంగా ఒకే వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న పోలింగ్ స్టేషన్లలో ఏకమొత్తంగా ఏ పార్టీకి ఓట్లు పడ్డాయన్న అంశంపై నేతలు దృష్టి పెట్టారు. నియోజకవర్గ పరిధిలోని అయిదుమండలాల్లో ఎక్కువశాతం పోలింగ్ జరిగిన పోలింగ్ స్టేషన్ల వివరాల ఆధారంగా ఏఏ పార్టీకి అక్కడ మెజార్టీ వస్తుంది అన్న అంశంపై లెక్కలు వేస్తున్నారు. ఈవిధంగా రెండు నియోజకవర్గాల పరిధిలో భారీగా పోలైన పోలింగ్ స్టేషన్లపై ప్రధాన పార్టీలు ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. ఎవరి లెక్కలు సరిపోయాయన్నది ఓట్ల లెక్కింపు అనంతరమే తేలుతుంది.
ఒకవైపు లబ్‌డబ్ అయినా విజయోత్సవాలకు సిద్ధం
ఏలూరు, జూన్ 14: ఉప ఎన్నికల్లో పోటీ చేసిన పలువురు అభ్యర్ధులు విజయం మీద ధీమాతో అప్పుడే విజయోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్నికల సంఘం విధించిన ఆంక్షల కారణంగా నానా ఆగచాట్లు పడ్డ అభ్యర్ధులు విజయం సాధించిన తర్వాత మాత్రం తమ సత్తా చూపేందుకు ముందడుగు వేయాలని నిర్ణయించుకున్నారు. 15వ తేదీ మధ్యాహ్నం 11-12గంటలకు ఫలితాలు మొత్తం వెలువడే అవకాశం ఉండటంతో అతర్వాత నుంచి విజయోత్సవాలు నిర్వహించుకునేందుకు కొంతమంది అభ్యర్ధులు భారీ ప్రయత్నాలే చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ ఉపఎన్నికలు హోరాహోరీగానే కాకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగాయి. కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్సార్‌సిపిల మధ్య పోరు తీవ్రంగా ఉండటంతో ఏ అభ్యర్ధికి విజయం దక్కుతుందన్నది చెప్పలేకుండా మారింది. అయినప్పటికీ అభ్యర్ధులు ఎవరికివారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈసారి పది వేల మెజార్టీతో గెలుస్తామంటూ కొందరు మెజార్టీని అంకెలతో సహా చెపుతున్నారు. దీని ఆధారంగా తమ గెలుపు సునాయాసమని భావిస్తున్న అభ్యర్ధులు ఫలితాలు వెలువడిన వెంటనే సంబరాలు జరుపుకునేందుకు సిద్దపడుతున్నారు. పోలవరం నియోజకవర్గంలో అయితే మూడు పార్టీలకు చెందిన అభ్యర్ధులు విజయోత్సవాలకు ఏర్పాట్లు చేస్తుండటం విశేషం. మరికొంతమంది విజయం సాధించిన అనంతరం నియోజకవర్గంలో కృతజ్ఞతాపూర్వక ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అటు ఓటర్లును కలుసుకోవటంతోపాటు ఇటు తమ అనందాన్ని పంచుకున్నట్లు ఉంటుందని భావిస్తున్నారు. వాస్తవానికి ఈసారి ఉపఎన్నికలు అనూహ్యమైన ఉత్కంఠ మధ్య సాగటంతోపాటు వర్గసమీకరణాల్లో భారీగా మార్పులు చోటుచేసుకోవటం వల్ల ఈ రెండు స్ధానాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తవచ్చునన్న అనుమానాలు లేకపోలేదు. ప్రధానంగా కొన్ని వర్గాలు ఒక పార్టీకి కొమ్ము కాసాయన్న అంచనాల నేపధ్యంలో చివరకు ఈ గెలుపొటములు, అనంతరం జరిగే విజయోత్సవాలు ప్రతీకార కార్యక్రమాలుగా మారతాయన్న అనుమానాలను పోలీసు అధికారులు వ్యక్తం చేస్తున్నారు. అ పరిస్ధితే తలెత్తితే కొన్ని చోట్ల ఘర్షణ వాతావరణం కూడా చోటుచేసుకుంటుందన్న అనుమానాలున్నాయి. గతంలో ఏనాడూ లేనివిధంగా కొన్ని వర్గాల మధ్య పోరాటంగా ఈసారి ఎన్నికలు జరగటంతో పోలింగ్ సమయంలోనే ఉద్రిక్తతలు తలెత్తుతాయన్న అభిప్రాయంతో బందోబస్తును భారీగా చేపట్టారు. అయితే అవి పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్రీకృతం కావటంతోపాటు స్ధానిక పోలీసుస్టేషన్ల పరిధిలో పరిస్దితులను ఎప్పటికప్పుడు అంచనా వేయటం ద్వారా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అయితే విజయోత్సవాల పరిస్ధితి అలా ఉండదన్న అభిప్రాయాన్ని పోలీసు అధికారులతో పాటు కొంతమంది రాజకీయనాయకులు కూడా వ్యక్తం చేస్తున్నారు. విజయోత్సవంలో కొందరు, ఓటమి పాలైన ఆక్రోశంలో మరికొందరు ఉండటంతోపాటు ఇవి ప్రతీకార కార్యక్రమాలుగా రూపుదిద్దుకుంటే వాటిని అప్పటికప్పుడు అదుపులోనికి తీసుకురావటం కష్టసాధ్యమవుతుందన్న అభిప్రాయం ఉంది. భారీ ర్యాలీలు నిర్వహిస్తే మాత్రం వాటికి తగిన భద్రత ఏర్పాటుచేయటం కూడా ఇబ్బందికరమేనని చెపుతున్నారు. అయినప్పటికీ గతంలో ఏనాడూ ఈతరహా ఉద్రిక్తతలు తలెత్తకపోవటంతో చిన్నతరహాలోనే విజయోత్సవాలు నిర్వహించుకునేందుకు అవకాశం ఇవ్వవచ్చునని భావిస్తున్నారు.
ద్వారకాతిరుమల ఇఒఆర్‌డి అరెస్టు
ద్వారకాతిరుమల, జూన్ 14: మండలంలోని గుణ్ణంపల్లిలో ఒక మహిళ ఇంటివద్దకు వెళ్లి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన కారణంగా ద్వారకాతిరుమల ఇఒఆర్‌డి శ్రీనివాసును గురువారం అరెస్టు చేసినట్టు ద్వారకాతిరుమల ఎస్సై శీలం శంకర్ తెలిపారు. డోరు నెంబర్ల కేటాయింపు వివాదంలో ఇఒఆర్‌డి శ్రీనివాసుపై గత పలు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో గుణ్ణంపల్లికి చెందిన ఒక మహిళ నాగలక్ష్మి ఇఒఆర్‌డిపై అధికారులకు ఫిర్యాదు చేసింది. దీనిపై జడ్పీ సిఇఒ విచారణ చేపట్టారు. ఇదిలావుండగా తనపై ఉన్నతాధికారులకు చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలంటూ గత నెలలో ఇఒఆర్‌డి శ్రీనివాసు నాగలక్ష్మి ఇంటికి వెళ్లి పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీనిపై భయపడిన నాగలక్ష్మి ద్వారకాతిరుమల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. విచారణ నిర్వహించిన అనంతరం శ్రీనివాసును అరెస్టుచేసినట్టు ఎస్సై తెలిపారు.