హైదరాబాద్: ఉప ఎన్నికల నేపథ్యంలో తన వాణిని ఎలక్ట్రానికి, ప్రింట్ మీడియా ద్వారా వినిపించేందుకు అవకాశం ఇవ్వాలన్నవైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో నిరాశ ఎదురయింది. ఉప ఎన్నికల సందర్భంగా తన వాణిని వినిపించుకునేందుకు అవకాశం కల్పించాలని హైకోర్టులో జగన్ బుధవారం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
దీనిపై కోర్టు గురువారం విచారణ జరిపింది. జగన్ తరఫు న్యాయవాది, అడ్వోకేట్ లాయర్ తమ వాదనలు న్యాయమూర్తి విన్నారు. జైలులో ఉన్న జగన్‌తో ఎవరూ మాట్లాడకూడదని సిబిఐ తరఫు న్యాయవాది వాదించారు. మీడియాతో మాట్లాడేందుకు జగన్‌కు అవకాశం ఇవ్వవద్దని కోరారు. ప్రచారానికి అనుమతివ్వడానికి జగన్ రాజకీయ ఖైదీ కాదన్నారు. రాజ్యాంగ అధికరణ 19(1) ప్రకారం జగన్‌కు ప్రత్యేక హక్కులు సంక్రమించవని అడ్వోకేట్ జనరల్ చెప్పారు. రాజ్యాంగ అధికారణ 19(1) ప్రకారం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కింద జగన్‌కు మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని జగన్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు.
ఇరువైపుల వాదనలను విన్న కోర్టు విచారణను 21వ తేదికి వాయిదా వేసింది. పూర్తి వివరాలతో రెండు వారాలలోగా కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐని ఆదేశించింది. ఉప ఎన్నికలు ఈ నెల 12వ తేదిన ముగుస్తున్నాయి. 10వ తేదినే ప్రచారం ముగుస్తుంది. ప్రచారానికి ఇంకా మూడు రోజులే మిగిలి ఉంది. ఇలాంటి సమయంలో ఈ మూడు రోజులైనా తన వాణి వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని జగన్ కోర్టును ఆశ్రయించారు.
అయితే కోర్టు విచారణ 21వ తేదికి వాయిదా వేసింది. అప్పటికే ఎన్నికలు పూర్తయి, ఫలితాలు కూడా విడుదలయి ఆరు రోజులు పూర్తవుతుంది. అంటే ఎన్నికల క్రతువు పూర్తిగా అయిపోయి ఫలితాలు విడుదలయిన తర్వాత జగన్ పిటిషన్ విచారణకు మరోసారి వస్తుంది. ఇది జగన్‌కు నిరాశ కలిగించే అంశమేనని అంటున్నారు. కాగా కేసును లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఈ దశలో ఎన్నికల ప్రచారం పేరిట ఎలాంటి సమాచారం బదలీ కుదరదని చెప్పింది.
కాగా ఉప ఎన్నికల సందర్భంగా తమ వాణిని వినిపించుకునేందుకు అవకాశం కల్పించాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తమ వాణిని వినిపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు.
రాజ్యాంగ అధికరణ 19(1) ప్రకారం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కల్పించాలని జగన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అండర్ ట్రయల్‌గా ఉన్నా తనకు మీడియాతో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. జైళ్ళ శాఖ డిజి, ఐజి, డిఐజిలను జగన్ తన పిటిషన్‌లో ప్రతివాదులుగా చేర్చారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఎన్నికల ప్రచారానికి అనుమతివ్వాలని కోరారు.